జడ్జిల కమిటీ వేయలేం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ప్రభుత్వం అశక్తత.. హైకోర్టుకు తెలిపిన సీఎస్‌ జోషి
  • ఇలా వేయాలని పారిశ్రామిక
  • వివాదాల చట్టంలో ఎక్కడా లేదు
  • ఆర్టీసీ సమ్మెను లేబర్‌ కోర్టువిచారణకు పంపించండి: సర్కారు
  • విచారణ ఈ నెల 18కి వాయిదా

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచించినట్లుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తినపుడు పరిష్కారం కోసం ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీని వేయాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి పేరుతో రూపొందించిన అఫిడవిట్‌ను అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎ్‌స.ప్రసాద్‌ బుధవారం న్యాయస్థానానికి సమర్పించారు. ఆ చట్టంలోని పదో సెక్షన్‌ ప్రకారం దీనిపై లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఈ వివాదంపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టు విచారణ చేస్తున్నందున ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ వ్యాజ్యాల్లో రెండున్నర గంటలకు పైగా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అయితే, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన వ్యాజ్యాన్ని గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది. అంతవరకు దానిపై గతంలో ఇచ్చిన స్టే ఆదేశాలు కొనసాగుతాయని చెప్పింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మెపై, బస్సు రూట్ల ప్రయివేటీకరణపై రెండు వ్యాజ్యాలను ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆర్‌.భాస్కర్‌ ‘శివారావ్‌ శాంతారావ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వంకేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేసే అధికారాలు ఈ న్యాయస్థానానికి ఉంటాయన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో తాజాగా ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ సమ్మె వల్ల మరణించిన కార్మికుల సంఖ 20కి చేరిందని నివేదించారు. కార్మిక సమస్యలపై ముఖాముఖి చర్చలకు కమిటీ వేయాలని కోరారు. ఏజీ వాదిస్తూ… ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఎస్మా కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీని ఎస్మా కిందకు చేర్చుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందా? అని ధర్మాసనం ఏజీ ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందని ఏజీ బదులిచ్చారు. ఆర్టీసీ సేవలు ప్రజోపయోగం కిందకు వస్తాయని చెప్పారు. వాటికి భంగం కలిగించిన వారిపై ఎస్మా కింద చర్యలు చేపట్టవచ్చన్నారు. ఆర్టీసీ సమ్మె ఎస్మా కిందకు రాదని కార్మిక సంఘాల న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి బదులిచ్చారు. టీఎస్‌ ఆర్టీసీని ఆర్టీసీ యాక్టు 1950, ఏపీ పునర్‌విభజన చట్టం-2014లోని సెక్షన్‌ 3 కింద ఏర్పాటు చేశామని ఏజీ కోర్టుకు వివరించారు.

ఈ వాదనలను ధర్మాసనం తొలుత తోసిపుచ్చింది. ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీఎస్‌ ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉందని, టీఎస్‌ ఆర్టీసీని కేంద్రం గుర్తించడం లేదని గతంలో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. ఆర్టీసీని విభజించాలంటే ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 47ఏ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర అనుమతి లేకుండా ఏర్పాటు చేయడానికి వీల్లేద అని న్యాయస్థానం ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయని, ఈ చట్టం ప్రకారమే ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలను రెండు రాష్ట్రాల మధ్యన పంచవచ్చని ఏజీ సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ నుంచి సాంకేతికంగా వేరు పడనప్పటికీ బస్సులను చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించారన్నారు.

చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీని ఏర్పాటు చేశామని, అలాంటి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పారు. టీఎ్‌సఆర్టీసీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. ఏజీ వాదనలు విన్న ధర్మాసనం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌ తరుపున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదించారు.

1994లో సిండికేట్‌ బ్యాంక్‌ వర్సెస్‌ అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమా? కాదా? అని తేల్చే అధికారం హైకోర్టుకు లేదని చెప్పారు. దాన్ని లేబర్‌ కోర్టే తేల్చాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సమస్యను లేబర్‌కోర్టుకు రిఫర్‌చేస్తే… నిర్ణీత కాలంలో సమస్యకు పరిష్కారం చూపగలదా? అని ఏజీని ఉద్దేశించి ప్రశ్నించింది. ఇది ముఖ్యమైన సమస్య అయినందున లేబర్‌కోర్టు కూడా ఎక్కువ సమయం తీసుకోదని హైకోర్టుకు నివేదించారు. కోర్టు సమయం ముగియడంతో ఈ వ్యాజ్యాల విచారణను గురువారానికి వాయిదా వేస్తామని తెలిపింది. తన సోదరుని కుమార్తె వివాహం ఉన్నందున గురువారం విచారణకు రాలేనని, 18కి వాయిదా వేయాలని కార్మిక సంఘాల న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి కోరారు. వ్యాజ్యాల విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అయితే 5,100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

కేసును రెఫర్‌ చేయండి..ఆర్టీసీ కేసును లేబర్‌ కమిషనర్‌కు కేసును రెఫర్‌ చేయాలని ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. కేసు లేబర్‌ కమిషనర్‌కు చేరితే సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నాయి. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం లేబర్‌ కమిషనర్‌ సమ్మెను చట్ట విరుద్ధమని ప్రకటిస్తూ లేబర్‌ కోర్టుకు నివేదిస్తారని అంటున్నాయి.

Courtesy Andhrajyothy..

RELATED ARTICLES

Latest Updates