ఇదేం… జీఎస్టీ?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– బడా కంపెనీల యజమానులకు పన్ను మినహాయింపులు
– అన్నంపెడుతున్న రైతన్నపై పన్ను మోతలు
– బడా పెట్టుబడిదారులకు ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ క్లెయిమ్‌
– పక్షపాతంగా, అసమానంగా జీఎస్టీ పన్ను విధానం : ఆర్థిక నిపుణులు
ఒక బడా పారిశ్రామికవేత్త ముడి సరుకుపై కట్టే జీఎస్టీని మోడీ సర్కార్‌ తిరిగి (ఇన్‌పుట్‌ క్రెడిట్‌ ట్యాక్స్‌ క్లెయిమ్‌ రూపంలో) ఇస్తోంది. అదే 135 కోట్లమందికి అన్నం పెడుతున్న రైతన్నకు మాత్రం ఉత్తచేయి చూపుతోంది. విత్తనాలు, క్రిమిసంహారక మందులు, యంత్రపరికరాల కొనుగోలు చేస్తున్న దేశ రైతాంగం నుంచి రూ.14,500కోట్లు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇలా కట్టిన పన్నును తిరిగి క్లెయిమ్‌ చేసుకునే సౌలభ్యం రైతులకు లేకుండా జీఎస్టీ పన్నుల విధానముందని ఆర్థిక, వ్యవసాయరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
న్యూఢిల్లీ : పప్పులు, ధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు…ఇవన్నీ రైతు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉత్పత్తి చేస్తున్నాడు. ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. కష్టనష్టం వస్తే ఆదుకొనే దిక్కులేదు. సమస్యల సుడిగుండల్లో చిక్కుకున్న రైతు నుంచి కూడా మోడీ సర్కార్‌ 18శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. బడా పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయంపులు, ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇదీ ఈ దేశంలో పాలకులు తీసుకొచ్చిన పన్ను సంస్కరణలు. దేశ రైతాంగం పట్ల జీఎస్టీ పన్నుల విధానం తీవ్ర వివక్షపూరితంగా ఉందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.
ముడి సరుకుల కొనుగోలుపై జీఎస్టీ పన్ను కట్టాను, కాబట్టి దీనిని మినహాయించుకోండి అని బడా వ్యాపారవేత్త కోరితే…’జీఎస్టీ’ అందుకు అనుమతిస్తోంది. రైతు కూడా విత్తనాలు, ఎరువులు, యంత్రాలు(ముడి సరుకులు) తదితరమైనవాటిపై 18శాతం జీఎస్టీ కడుతున్నాడు. కానీ తాను ఉత్పత్తి చేసిన పంటలపై మాత్రం పన్ను మినహాయింపు (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌)అడిగే అవకాశం లేకుండా జీఎస్టీ విధానముంది.
జీఎస్టీ లోపభూయిష్టం…
దీని గురించి ‘సౌత్‌ ఏసియా బయోటెక్నాలజీ సెంటర్‌'(ఎస్‌ఏబీసీ) స్థాపకుడు, డైరెక్టర్‌ భగీరత్‌ చౌదరీ మాట్లాడుతూ…”కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ పన్నుల విధానంలో చాలా సంక్లిష్టత కనపడుతోంది. ఒకరికి ఒకలా, మరొకరికి ఒకలా అమలు తీరు నిర్దేశించారు. పన్నుల చెల్లింపు అసమానంగా ఉంది. ముడి సరుకుల కొనుగోలుపై రైతులు ‘ఇన్‌పుట్‌ క్రెడిట్‌’ను క్లెయిమ్‌ చేసుకోలేక పోవటం జీఎస్టీలో ఉన్న పెద్ద లోపం. పన్నుల విధానం స్ఫూర్తిని దెబ్బతీసేలా జీఎస్టీని రూపొందించారు” అని అన్నారు.
ప్రతిఏటా ముడి సరుకుల కొనుగోళ్లపై రైతుల నుంచి కేంద్రం వసూలు చేస్తున్న జీఎస్టీ రూ.14,500కోట్లుగా ఉందని చౌదరీ గుర్తుచేస్తున్నారు. ఇందులో ఒక్క రూపాయి కూడా ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ రూపంలో రైతుకు లబ్ది చేకూరటం లేదని ఆయన అన్నారు. 135కోట్ల మంది కడుపు నింపుతున్న దేశ రైతంగం పట్ల అనుసరించాల్సిన విధానం ఇది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు నుంచి 18శాతం జీఎస్టీ వసూలు!
ఉదాహరణకు…ఒక కంపెనీ పెన్నులు తయారుచేస్తున్నాడనుకుంటే, ఆ పెన్ను తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల్ని ముందుగా కొనుగోలు చేయాలి కదా! ఈ ముడిసరుకుల కొనుగోలుపై జీఎస్టీ కడతాడు. ఎ, బి, సి…అనే ముడి సరుకుల కొనుగోలుపై రూ.300 జీఎస్టీ కట్టాడనుకుందాం. వీటి నుంచి తయారైన వస్తువులు(పెన్నులు) అమ్మాలి కదా ! అమ్మకం చేసేప్పుడు కట్టాల్సిన జీఎస్టీ రూ.450 అయిందునుకుంటే, మొదట ముడి సరుకులపై కట్టిన రూ.300 మినహాయింపును కోరే అవకాశం కంపెనీకి ఉంది. మిగిలిన రూ.150 కడితే చాలు. రైతు కూడా విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహాకరక మందులు, యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తున్నాడు. ఇక్కడ రైతు నుంచి కేంద్రం 18శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. దీనిని మళ్లీ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ప్రస్తుత జీఎస్టీలో లేదు.

శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడి, వ్యయప్రయాసలకు ఓర్చి రైతు పంటను ఉత్పత్తి చేస్తున్నాడు. ముడిసరుకుల కొనుగోలుపై ఒక పారిశ్రామికవేత్త జీఎస్టీ ఎలా అయితే కడుతున్నాడో, రైతు కూడా పన్ను కడుతున్నాడు. పారిశ్రామికవేత్తకు ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ ఇస్తున్నారు. కానీ రైతులు క్లెయిమ్‌ చేసుకోవడానికి లేదు. ఈ విధానం వల్ల ప్రతిఏటా దేశ రైతాంగం రూ.14,500కోట్లు పన్ను మినహాయంపును కోల్పోతున్నది.
– డాక్టర్‌ సి.డి.మేయీ, ప్రెసిడెంట్‌ ఆఫ్‌ సౌత్‌ ఏసియా బయోటెక్నాలజీ సెంటర్‌-న్యూఢిల్లీ

Courtesy Navatelangana..

RELATED ARTICLES

Latest Updates