ఆర్టీసీకి 47 కోట్లు ఇవ్వలేం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఎన్నిసార్లు ఆదుకోవాలి!?
  • ఆగస్టునాటికే నష్టాలు రూ.5,269 కోట్లు
  • చెల్లించాల్సిన బకాయిలు రూ.2,209 కోట్లు
  • నష్టాల్లో ఉందని తెలిసీ సమ్మెకు వెళ్లారు
  • చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే ఆందోళన
  • అయోధ్య తీర్పునాడే చలో ట్యాంక్‌బండ్‌
  • పారిశ్రామిక వివాదాల చట్టప్రకారం చర్యలు
  • తీసుకుంటాం.. తగిన ఆదేశాలు ఇవ్వండి
  • 18 అంశాలతో ప్రభుత్వం అఫిడవిట్‌
  • నేడు హైకోర్టుకు సమర్పణ

ఆర్టీసీ కార్మికుల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేసేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేయనుంది. ఆర్టీసీ కార్మికులు చేసిన నాలుగు ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించాలని హైకోర్టు కోరింది. కోర్టు సూచనలను సానుకూల దృక్పథంతో పూర్తిస్థాయిలో పరిశీలించాం. అయితే, ఆర్టీసీకి పెద్దఎత్తున బకాయిలు ఉన్నాయి. చట్టబద్ధమైన చెల్లింపులు చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు నష్టాలు వస్తున్నాయి. భారీ నష్టాలు, అప్పులతో సతమతమవుతున్న ఆర్టీసీకి రూ.47 కోట్లు ఏ మూలకూ సరిపోవు. గతంలో ఆర్టీసీని ప్రభుత్వం కాపాడింది. కానీ, ప్రస్తుత బడ్జెట్‌ పరిమితుల నేపథ్యంలో రూ.47 కోట్లను కూడా కేటాయించే పరిస్థితిలో లేము. అయినా.. ఎన్నిసార్లు.. ఎంత వరకూ ఆర్టీసీని ప్రభుత్వం కాపాడగలదు అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న! అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలపనుంది. ఆర్టీసీ కేసు సోమవారం మరోసారి విచారణకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుకు సమర్పించేందుకు ప్రభుత్వం కౌంటర్‌ సిద్ధం చేసింది. సీఎస్‌ ఎస్కే జోషి 18 అంశాలతో అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించనున్నారు. చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని మధ్యవర్తి (కన్సీలియేషన్‌ అధికారి)నివేదిక ఇచ్చారు. అయినా, ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే, పారిశ్రామిక వివాదాల చట్టం కింద చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వండిఅని అఫిడవిట్‌లో సర్కారు కోర్టును కోరింది.

సాధ్యం కాదన్నా.. విలీనమంటున్నారు..టీఎ్‌సఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని, ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వం సహకరిస్తూనే ఉందని నివేదికలో పేర్కొన్నారు. నష్టాలు తగ్గకపోగా.. సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని తెలిసి కూడా యూనియన్లు సమ్మెకు దిగాయి. విలీనం అసాధ్యమని చెప్పినా.. చర్చల్లో అదే అంశంపై పట్టుబట్టాయి. సంస్థకు సంబంధించిన విషయాలన్నీ యూనియన్లకు తెలియనివి కావు. అయినా, ప్రజలకు అసౌకర్యం కలిగించడమే లక్ష్యంగా బతుకమ్మ, దసరా, దీపావళి సమయంలో సమ్మెకు దిగాయిఅని పేర్కొన్నారు. సమ్మె చట్టవిరుద్ధమని కార్మిక శాఖ చెప్పినా కొనసాగిస్తున్నారని తప్పుబట్టారు. ఆగస్టు 31నాటికి ఆర్టీసీ రూ.5,269 కోట్ల నష్టాల్లో ఉందని, బ్యాంకులు, ఇతర సంస్థలకు రూ.1,786 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు.

ప్రమాదకరంగా 2,609 బస్సులు..ఆర్టీసీలో బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల కిలోమీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 13 లక్షల కి.మీ. లేదా 15 ఏళ్లకు మించి ఉపయోగించడానికి వీల్లేదని, టీఎ్‌సఆర్టీసీ ఏర్పడే నాటికి మొత్తం 10,460 బస్సులు ఉండగా వాటిలో 2,609 బస్సులు కాలం చెల్లినవని అఫిడవిట్‌లో నివేదించారు. వీటిని వెంటనే మార్చాల్సి ఉందని, లేకపోతే, ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడడమే కాకుండా పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ బస్సులు మార్చాలంటే వెంటనే రూ.750 కోట్లు అవసరం. మరో ఐదు నెలల్లో ఇంకో 476 పాత బస్సులు మార్చాల్సి ఉంటుంది. కానీ, బస్సులను మార్చడం నిధులతో కూడుకున్న ప్రక్రియ. ఆర్టీసీకి ఆదాయ వనరులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులను మార్చడం పెద్ద సవాలుగా ఉంది అని పేర్కొన్నారు.

అయోధ్య తీర్పు రోజే..ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన చలో ట్యాంక్‌బండ్‌ ఆందోళనను ప్రభుత్వం తప్పుపట్టింది. ఈనెల 9న అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు వస్తుందని తెలిసినా అదే రోజు చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం తలపెట్టడం సరి కాదని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌ సున్నిత ప్రాంతం కావడంతో ఇక్కడి పోలీసులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో వారు నిమగ్నమయ్యారు. అదే రోజు చలో ట్యాంక్‌బండ్‌ చేశారు అని తప్పుబట్టింది. ప్రజలకు రవాణా సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందిని నియమించిందని, విధులు నిర్వర్తించకుండా ఆర్టీసీ యూనియన్లు వారిని అడ్డుకుంటున్నాయని కోర్టుకు నివేదించింది.

బకాయిలు రూ.2,209 కోట్లు…టీఎ్‌సఆర్టీసీ ఈనెల 8వ తేదీ వరకు మొత్తం రూ.2,209.66 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అఫిడవిట్‌లో సర్కారు స్పష్టం చేసింది.

కండక్టర్‌.. కటింగ్‌ షాపు!….ఆర్టీసీ సమ్మె మొదలై నెలరోజుల పైనే అయినా ఎటూ తెగడం లేదు. జీతాల్లేక రెండు నెలలపైనే అయింది. కార్మికులకు కుటుంబ పోషణ భారమైపోతోంది. ఇంటి అద్దెలు కట్టలేక.. పిల్లలకు స్కూలు ఫీజులు కట్టలేక వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మరి.. బతుకుదెరువు కోసం వారు ఏంచేయాలి? నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కండక్టర్‌ భోజన్న మాత్రం తన కులవృత్తిలోకి మారాడు. ఊర్లో నాయిబ్రాహ్మణ వృత్తి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. –  భైంసా

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates