వాడుతున్న కమలం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– బీజేపీ కబంధ హస్తాల నుంచి బయటపడుతున్న రాష్ట్రాలు
– సొంతంగా అధికారంలో ఉన్నది పది రాష్ట్రాల్లోనే
– మహారాష్ట్ర చేజారే అవకాశం..!
– స్థానికాంశాలకే ప్రాధాన్యమిస్తున్న ప్రజలు

ఆరేండ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఐదు. కానీ 2014లో మోడీ ప్రధాని అయ్యాక నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి గెలిచిన కమలనాథులు.. మరికొన్ని చోట్ల వారికి అవకాశం లేకున్నా ఎమ్మెల్యేలను ‘తమవైపునకు తిప్పుకుని’ వాటినీ హస్తగతం చేసుకున్నారు. అయితే 2017 తర్వాత ఈ పరిస్థితి మారింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తిన్నది. ప్రస్తుతం తన రాజకీయ క్షేత్రమైన మహారాష్ట్రనూ కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులవాదన.
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి నెగ్గిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దారుణంగా చతికిలపడుతుంది. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అయితే, 2017కు ముందు దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారం చేపట్టిన ఆ పార్టీ.. తర్వాత జరుగుతూ వస్తున్న శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంటున్నది. దేశంలో ప్రస్తుతం కమలనాథులు సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు పది మాత్రమే. మిగిలిన చోట్ల మిత్ర పక్షాలతోనో.. అవీ వినని పక్షంలో నయానో భయానో వాటిని బెదిరించి అక్కడా అధికారం చెలాయిస్తున్నది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వరుసగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానా మాత్రమే. మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాషాయవాదులు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. మహారాష్ట్రలో శివసేనతో, పంజాబ్‌లో అకాళీదళ్‌తో కలిసి అధికారం చేపట్టారు. అనంతరం జరిగిన జమ్మూకాశ్మీర్‌ ఎన్నికల్లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీపీ)తో, ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనూ అక్కడి స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. 2016లో బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి దారుణ పరాజయం మూటకట్టుకున్న కమలనాథులు.. తర్వాత ఆ కూటమిని చీల్చి నితిశ్‌ను తమ వైపునకు తిప్పుకున్నారు. దీంతో అక్కడ బీజేపీతో కలిసి ఆయన అధికారాన్ని పంచుకుంటున్నారు. ఇక గోవాలో తమకు అవకాశం లేకున్నా బాహాటంగానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే.

2017 తర్వాత మారిన పరిస్థితి
కానీ, 2017 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రాగా.. గతేడాది జరిగిన కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటములు మూటగట్టుకుంది. కర్నాటకలో మెజారిటీ లేకున్నా అధికారం ఏర్పాటుచేయాలని భావించి విమర్శలెదుర్కున్నది. కానీ ఏడాది తిరుగకముందే అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుట్రలు చేసి పడగొట్టింది. జమ్మూకాశ్మీర్‌లో పీడీపీతో తెగదెంపులు చేసుకుని అక్కడ గవర్నర్‌ పాలన విధించింది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నా.. ఒడిషా, సిక్కీం, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.
ఇక పదిహేను రోజుల క్రితం విడుదలైన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి మింగుడుపడలేదు. ఎన్నికల ప్రచార సభల్లో జాతీయవాదం, దేశ భద్రత వంటి అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మోడీ, అమిత్‌ షాతో పాటు బీజేపీ పరివారమంతా ప్రచారం చేసింది. కానీ ప్రజలు జాతీయవాదం కంటే స్థానిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. స్థానిక సమస్యలను మరిచిన బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టారు. జాతీయవాదం రెచ్చగొట్టినా హర్యానాలో మెజారిటీ మార్కు చేరుకోలేదు. కానీ జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుశ్యంత్‌ చౌతాలా సాయంతో అక్కడ గట్టెక్కింది. ఇక మహారాష్ట్రలో విజయం నల్లేరు మీద నడకే అనుకున్నా అక్కడా అనుకున్న స్థానాలు రాలేదు. దీంతో అప్పటిదాకా అణిగిమణిగి ఉన్న శివసేన.. ఒక్కసారిగా జూలు విదిల్చింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమకు హామీ ఇచ్చిన విధంగా సీఎం పీఠాన్ని చెరో రెండున్నరేండ్లు పంచుకుంటే తప్ప ప్రభుత్వంలో చేరేది లేదని భీష్మించింది. దీనికి బీజేపీ అధినాయకత్వమూ ఒప్పుకోవడం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ప్రస్తుతం అక్కడ రెండు పార్టీల మధ్య చెడిందనే వార్తలూ వస్తున్నాయి. దీంతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమంటే బీజేపీకి సాహసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

జార్ఖండ్‌, ఢిల్లీలోనూ ఇవే ఫలితాలా..?
మహారాష్ట్ర, హర్యానాతో పాటు జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. కానీ, అక్కడ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవు. ఆకలిచావులు, మూకదాడులతో అక్కడ ప్రజలు అల్లాడుతున్నారు. అంతేగాక ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ ప్రభుత్వంపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. గిరిజనులు అధికంగా ఉన్న ఇక్కడ అటవీ చట్టాలపై మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా గిరిపుత్రులు పోరాటాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. జార్ఖండ్‌తో పాటు ఢిల్లీలోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తీరు చూసిన తర్వాత ఇక్కడా అదే విధంగా ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Courtesy Navatelangana..

RELATED ARTICLES

Latest Updates