బీఎస్ఎన్ఎల్లో పదినెలలుగా జీతాల్లేవ్..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కాంట్రాక్టు కార్మికుల దుస్థితి
– ఇప్పటి వరకు ఏడుగురు ఆత్మహత్య
– పట్టించుకోని కేంద్రం, బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం

న్యూఢిల్లీ : మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయింది. ఇప్పుడు అందులోని కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. పదినెలలుగా జీతాల్లేక వారు అల్లాడుతున్నారు. రోజువారి జీవితం గడవక.. ఇంటి పోషణ కార్మికులకు తలకు మించిన భారంగా మారిపోయింది. దీంతో ఈ పదినెలల కాలంలోనే ఏడుగురు కాంట్రాక్టు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమకు పెండింగ ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలంటూ కేంద్రానికి, బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యానికి కార్మిక సంఘాలు ఎన్ని సార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ విషయంలో కేంద్రం, బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయి.

కార్మిక వ్యతిరేక విధానాలు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ కాంట్రాక్టు వర్కర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కొత్త పాలసీ ప్రకారం.. ఖర్చును తగ్గించుకునే పేరుతో సంస్థలోని 30శాతం కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని సర్కిళ్లలో 30శాతం కార్మికులను విధుల నుంచి తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కేరళ సర్కిల్‌లో దాదాపు ఆరువేలకు పైగా కాంట్రాక్టు కార్మికులుంటారు. వారిలో దాదాపు వెయ్యి మంది కార్మికులను బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం తొలగించింది. దీంతో, ఇటు కార్మిక వ్యతిరేక విధానాలు.. అటు కొన్నినెలల నుంచి జీతాలు అందక ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ఏడుగురు కాంట్రాక్టు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

జీతాలూ తక్కువే..!
దేశవ్యాప్తంగా అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్కిళ్లలోని దాదాపు లక్ష మందికి పైగా కాంట్రాక్టు కార్మికులకు పదినెలలుగా జీతాలు అందలేదు. ఉద్యోగ భద్రత లేని కాంట్రాక్టు కార్మికులకు అందే జీతం కూడా చాలా తక్కువ. కేరళ సర్కిల్‌లో కాంట్రాక్టు కార్మికులకు నెలకు అందే జీతం పదివేల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. ఇక ఉత్తరాది సర్కిళ్లలో కార్మికులకు అందే జీతాలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ రూ.2000 నుంచి 3000 వరకు మాత్రమే వారికి అందుతుంది. అయితే కాంట్రాక్టు కార్మికులకొచ్చే జీతాల్లో మిగతా మొత్తం అధికారులు, పెద్ద కాంట్రాక్టర్ల చేతికే చేరుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌కు చెందిన నంబూదిరీ తెలిపారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో మాత్రం బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్మికులకు 16 నెలల నుంచి జీతాలు అందకపోవడం గమనార్హం. దీనిపై కార్మికులు, యూని యన్లు ప్రధానికి, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు, బీఎస్‌ఎన్‌ఎల్‌ యజమాన్యానికి లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందనా రాలేదు. మరోపక్క, బకాయిలను చెల్లించకుండానే కొందరు కార్మికులను బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం వారిని విధుల నుంచి తొలగించింది. దీనిపై కేరళ సర్కిల్‌కు చెందిన ఎనిమిది మంది కార్మికులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో దిగివచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ యజమాన్యం వారికి రావాల్సిన బకాయిలను చెల్లించింది.

‘వీఆర్‌ఎస్‌’తో కార్మికులను పంపే యత్నం
మరోపక్క, ‘బీఎస్‌ఎన్‌ఎల్‌ వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీం-2019’తో కాంట్రాక్టు కార్మికుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద 50 ఏండ్లు దాటిన ఉద్యోగులు, కార్మికులు వీఆర్‌ఎస్‌కు అర్హులు. దీంతో దాదాపు 57వేలకు పైగా కార్మికులు, ఉద్యోగులపై వీఆర్‌ఎస్‌ ప్రభావంపడింది. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలకు సాయం అందించేందుకు రూ.69వేల కోట్ల మొత్తాన్ని అందించాలని గతనెలలోనే ఆమోదించినట్టు కేంద్రం చెబుతున్నది. కానీ, తమ వద్ద నిధులు లేవని బీఎస్‌ఎన్‌ఎల్‌ అంటున్నది. మోడీ సర్కారు.. చర్యలతో కాంట్రాక్టు కార్మికులు నలిగిపోతున్నారని యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీతాలు అందక కనీస ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేక బాధలను అనుభవిస్తున్న కార్మిపట్ల కేంద్రం ఉదాసీనతను ప్రశ్నిస్తున్నాయి.

Courtesy Navatelangana..

RELATED ARTICLES

Latest Updates