ఆదుకోని పంట బీమా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఖరీఫ్‌లో నిలిచిన రూ. 5వేల కోట్ల చెల్లింపులు
– పీఎంఎఫ్‌బీవైలో బయటపడుతున్న అక్రమాలు
– అన్నదాతల సొమ్ము పోగేసుకుంటున్న ఇన్సూరెన్స్‌ కంపెనీలు
న్యూఢిల్లీ : వేసిన పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి కన్నెర్రజేస్తే పెట్టిన పెట్టుబడే కాదు.. రైతులు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కదు. అందుకే ఏదైనా విపత్తు సంభవిస్తే.. నష్టాన్ని కొంతైనా పూడ్చుకునేందుకు రైతులు పంట బీమా చెల్లిస్తారు. అయితే, రైతుల భయాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. 2016లో మోడీ సర్కారు ప్రవే శపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనా(పీఎంఎఫ్‌బీవై) ఈ దోపిడీని మరింత ముమ్మరం చేసింది. పీఎంఎఫ్‌బీవై అమల్లో బయటపడుతున్న అవకతవకలే ఇందుకు నిదర్శనం. తాజాగా గతేడాది ఖరీఫ్‌ పంటకు చెల్లించాల్సిన బీమాలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయని తేలింది. అంతేకాదు, జరిగిన చెల్లింపులు కూడా కొన్ని జిల్లాల్లోనే అధికంగా ఉండటమూ పలు అనుమానాలకు తావిస్తున్నది. కాగా, పంట నష్టాన్ని అంచనా వేస్తున్న పద్ధతుల్లోనూ అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతున్నది.
చెల్లించాల్సినదెంతా.. చెల్లించినదెంతా?
2018 డిసెంబర్‌కల్లా ముగిసిన ఖరీ ఫ్‌ కాలానికి సంబంధించి రూ. 14,813 కోట్ల విలువైన పంట నష్టం జరిగినట్టు క్లెయిమ్స్‌ వచ్చాయి. ఇందులో జులై నాటికి ఈ పథకం కింద రూ. 9,799 కోట్ల చెల్లింపులు జరిగాయి. పీఎంఎఫ్‌బీవై ప్రకారం.. ఖరీఫ్‌ కాలం ముగిసిన రెండు నెలల్లోపు(ఫిబ్రవరిలోపు) చెల్లింపులు పూర్తవ్వాలి. కానీ, దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు మధ్య జరి గిన చర్చలకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా ఓ పత్రిక వెలుగులోకి తెచ్చింది. క్లెయి మ్స్‌లోనూ తేడాలున్నాయనీ, అలాగే, మొ త్తం చెల్లింపుల్లో సగం(50శాతం) మేరకు కేవ లం 30 నుంచి 45 జిల్లాల్లోనే జరిగాయని ఈ వివరాలు తెలుపుతున్నాయి. అయితే, ఆ కొన్ని జిల్లా ల్లోనే పెద్దమొత్తంలో చెల్లింపులు జరగడానికి గల కారణా లపై వివరణ కోరుతున్నట్టు దస్త్రాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి లోపే పూర్తవ్వాల్సిన చెల్లింపులు ఇప్పటికీ పూర్తికాలేదు.
ఇందుకు రాష్ట్రాలనే బాధ్యులుగా చిత్రించేందుకు కేంద్రం యత్నిస్తున్నది. అయితే, కేంద్రం చెబుతున్న కారణా లతో పాటు, ఇన్సూరెన్స్‌ కంపెనీల అలసత్వమూ ప్రధానం గానే ఉన్నట్టు తెలుస్తున్నది. ఉదాహరణకు కందిపప్పును కవర్‌ చేస్తున్న ఇన్సూరెన్స్‌ కంపనీ ఇఫ్కో టొకియో (ఖరీఫ్‌ క్లెయిమ్స్‌)ఇప్పటికీ క్లెయిమ్స్‌ను సెటిల్‌ చేయలేదు. మహారాష్ట్రలోని ఒక్క పర్బని జిల్లాలోనే దాదాపు 47వేల రైతులకు పీఎంఎఫ్‌బీవై కింద పేమెంట్లు రావాల్సి ఉంది.
సీసీఈపైనా సందేహాలు
2018 ఖరీఫ్‌ పంట అంచనా కోసం క్రాప్‌ కట్టింగ్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌(సీసీఈ)ను దేశంలోని చాలా చోట్ల నిర్వహించింది. ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో నిర్దేశిత వైశాల్యంలో సాగు చేస్తారు. ఆ కాలానికి పంట దిగుబడిని ఈ పద్ధతిలో అంచనా వేస్తారు. నష్టాలను ఈ పద్ధతిలో పండించిన పంటతో పోలుస్తారు. అయితే, సీసీఈ సాగు అంచనాల్లోనూ అవకతవకలు జరిగినట్టు వచ్చిన సమాచారం ఆందోళన కలిగిస్తున్నది. పర్బనిలో సీసీఈ సమాచారాన్ని రెండు దఫాలుగా(మార్చ్‌ 19న, మే 4న) సూపరింటెండెంట్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌నుంచి సేకరించిన సమాచారంలో వ్యత్యాసం కనిపించింది. కందిపప్పునకు సంబంధించి జాంబ్‌ మండలంలో తొలుత.. హెక్టార్‌ భూమిలో 410 కిలోల సాగు అంచనా ఉండగా, రెండోసారి సేకరించిన సమాచారంలో 471 కిలోలకు ఈ అంచనా పెరిగింది. సాధారణంగా పంటకాలం చివరిలో (రైతుల కంటే ముందు) సీసీఈ అంచనాను లెక్కగడతారు. అలాంటిది.. రెండు సార్లు సేకరించినప్పుడు అంచనాలు ఎలా తారుమారయ్యాయన్న ప్రశ్న ముందుకొస్తున్నది.
ప్రీమియంల దోపిడీ
పీఎంఎఫ్‌బీవై ప్రవేశపెట్టాక ఈ పథకంలో రైతుల చేరిక ఏమంత ఆశాజనకంగా లేదు. కేవలం 0.42శాతం మాత్రమే పెరిగారు. కానీ, వారు చెల్లించే ప్రీమియంలు మాత్రం దాదాపు 350 శాతం మేరకు పెరిగాయి. 2015-16లో రైతుల నుంచి రూ. 5,614 కోట్ల ప్రీమియంలను ఇన్సూరెన్స్‌ కంపెనీలు కలెక్ట్‌ చేసుకోగా.. 2016-17లో రూ. 22,362 కోట్లు, 2017-18లో రూ. 25,046 కోట్లు సేకరించాయి. 2016-17లో ఈ పథకం కింద లబ్దిదారులు 5.72కోట్ల మంది ఉండగా.. 2017-18లో ఈ సంఖ్య 4.87 కోట్లకు పడిపోవడం గమనార్హం.

Courtesy Andhrajyothy..

 

RELATED ARTICLES

Latest Updates