నలుపు చీరతో నిరసన గళాలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికలపై తళుకులీనే నలుపు రంగును మన డిజైనర్లు అస్సలు పట్టించుకోరు. నలుపు అశుభానికి సూచికగా భావిస్తారు. అయితే ‘నలుపూ ఒక రంగేనని, అది నిరసనను బలంగా వ్యక్తం చేస్తుంద’ని అంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్‌ షర్మిలా నాయర్‌. కేరళకు చెందిన షర్మిలా ఇటీవల ‘18 షేడ్స్‌ ఆఫ్‌ బ్లాక్‌’ను థీమ్‌గా తీసుకుని రూపొందించిన చీరలు కట్టుకుని, వివిధ రంగాలకు చెందిన 18 మంది మహిళలు లింగ వివక్షపై తమ గళాన్ని బలంగా వినిపించారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇంతకీ వీటి వెనుక కథేంటీ…

డిజైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే షర్మిలా నాయర్‌ తనదైన ముద్రను ఏర్పరచుకుని అందర్నీ విస్మయానికి గురిచేశారు. మూడేళ్ల క్రితం రంగు రంగుల చీరలు డిజైన్‌ చేసి ‘మజావిళ్‌’ (అంటే ఇంద్రధనస్సు) పేరిట ఒక షో ఏర్పాటు చేశారు. వాటి ప్రదర్శన కోసం ఆమె ప్రముఖ మోడళ్లను ఎంచుకోలేదు. మాయా మీనన్‌, గౌరీ సావిత్రి అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను తన చీరలకు మోడల్స్‌గా ఎంచుకుని సంచలనం సృష్టించారు. ‘‘ఈ షోను నేను ట్రాన్స్‌జెండర్లకు అంకితం చేస్తున్నా. ఎందుకంటే ఇంద్రధనస్సులోని రంగులకు వారే ప్రతినిధులు’’ అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆమె ఆలోచనను ప్రతిబింబించేందుకు ఎంచుకున్న విధానాన్ని, గట్స్‌ను అందరూ మెచ్చుకున్నారు.

18 షేడ్స్‌ ఎందుకంటే…
షర్మిలా సరికొత్త డిజైన్లు లింగ వివక్ష ఆధారంగా రూపుదిద్దుకున్నవే. ఏదైనా ఒక విషయంపై బలమైన నిరసన తెలపాలంటే నలుపును మించిన రంగు లేదు. నలుపు ఒక నిరసన… నలుపు ఒక ధిక్కారం… అందుకే ఆమె ‘18 షేడ్స్‌ ఆఫ్‌ బ్లాక్‌’ పేరిట నలుపును ఎక్స్‌పోజ్‌ చేసే చీరలను డిజైన్‌ చేశారు. వాటి ద్వారా ఆమె ఒక క్యాంపెయిన్‌నే ప్రారంభించారు. వీటి ద్వారా సమాజంలోని మహిళల పట్ల ఉన్న వివక్షను ఎలుగెత్తి చాటాలనుకున్నారు. ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ఆమెకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏమిటంటే… కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.

నెలసరి సమయంలో మహిళలు అపరిశుభ్రంగా ఉంటారనే భావనతోనే వారిని దేవాలయంలోకి అనుమతించరనే విషయాన్ని డిజైనర్‌ షర్మిలా సీరియస్‌గా తీసుకున్నారు. శబరిమల ఆలయంలో 18 మెట్లు ఉంటాయి కాబట్టి, పైగా భక్తులంతా నలుపు దుస్తులు ధరిస్తారు కాబట్టి ఆమె తన చీరల డిజైనింగ్‌కు ‘18 షేడ్స్‌ ఆఫ్‌ బ్లాక్‌’ను థీమ్‌గా ఎంచుకున్నారు. ‘‘నెలసరి సమయంలో మహిళలు ఎక్కడికి వెళ్లరాదని, ఏదీ ముట్టుకోకూడదనే నియమ ని‘బంధనాలు’ ఎప్పటి నుంచో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నా స్నేహితురాళ్లు కొందరు నెలసరి సమయంలో దైవ సంబంధమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. సమాజంలోని ఎన్నో సమస్యలపై ధైర్యంగా పోరాడే మహిళలు ఈ విషయంపై ఎందుకు పోరాడకూడదనుకున్నా. అందుకే ఇదే అంశాన్ని ఎంచుకుని చీరలు డిజైన్‌ చేశా’’ అంటున్నారు షర్మిలా.

చిన్నతనం నుంచే వివక్ష మొదలు…
మహిళలపై వివక్ష చిన్నతనం నుంచే మొదలవుతుందనేది షర్మిలా అభిప్రాయం. రకరకాల వివక్షలను వినిపించేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎంతోమందిని కలిశారామె. అయితే కెమెరా ముందుకు రాలేక చాలామంది వెనక్కి తగ్గారు. అతి కష్టం మీద ఆమె వివిధ రంగాల్లో ఉన్న 18 మంది అభిప్రాయాలను సేకరించారు. వారంతా షర్మిలా డిజైన్‌ చేసిన నలుపు రంగు చీరలు కట్టుకుని మహిళా వివక్షపై గళం విప్పారు.

‘‘ఇప్పటికీ అనేక గ్రామాల్లో ఆడపిల్లలు గట్టిగా నవ్వడానికి కూడా జంకుతారు. ఆడపిల్లకు 18 ఏళ్లు రాగానే పెళ్లి గురించి మాట్లాడతారు. పెళ్లయ్యిందంటే చాలు బిడ్డ గురించి అడుగుతుంటారు. ఒకరు పుట్టగానే రెండో సంతానాన్ని ఎప్పుడు కంటున్నావని ఒత్తిడికి గురి చేస్తుంటారు. ఇలాంటి అనేక ఆంక్షలను నేను ఈ క్యాంపెయిన్‌ ద్వారా ఎత్తి చూపాలనుకుంటున్నా’’ అన్నారామె. ఈ క్యాంపెయిన్‌ ప్రధానంగా ఫ్యాషన్‌ను ఉపయోగిస్తూనే కొన్ని నమ్మకాలను, కాలం చెల్లిన ఆచారాలను ప్రశ్నిస్తుంది. బాడీ షేమింగ్‌, స్కిన్‌ కలర్‌, నెలసరి చుట్టూ అల్లుకున్న అపోహలు, మహిళల కోసం పరిశుభ్రమైన టాయిలెట్స్‌ వంటి అనేక సమస్యలపై గళం వినిపిస్తుంది.

విభిన్న రంగాలకు చెందిన మహిళా గళం…
క్యాంపెయిన్‌లో భాగంగా నలుపు రంగు చీరలు కట్టుకున్న వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము జీవితంలో ఎదుర్కొన్న రకరకాల వివక్షపై గళం విప్పారు. ‘‘మహిళ ఒకరికి భార్యగా మారగానే తప్పకుండా తల్లి కావాల్సిందేననే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. తల్లి కాలేదంటే ఆ మహిళను అదోరకంగా చూస్తారు. తల్లి అయితేనే ఒక మహిళ తన ఉనికిని చాటుకున్నట్టా? తల్లి కావడం అనేది మహిళకు ఒక ఛాయిస్‌ మాత్రమే. అంతేగానీ తల్లి అయితేనే మహిళ అనడం సరికాదు’’ అంటున్నారు రచయిత్రి, డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్స్‌లో నిపుణురాలైనరేమ్యా ససీంద్రన్‌. అదేవిధంగా చాలా విషయాలను తల్లులు తమతో పంచుకునేందుకు అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వరు.

దాంతో అనేక విషయాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియకుండా తమలోనే దాచుకుంటారు. ఇది కూడా సరైన విధానం కాదంటారు సైకాలజిస్టు, లాక్టేషన్‌ కన్సల్టంట్‌ అయిన స్వాతీ జగదీశ్‌. ‘‘నా పిల్లలు ఎలాంటి అభిప్రాయాన్ని అయినా నాతో పంచుకోవాలనే నమ్మకాన్ని వారిలో కలిగించాలనుకుంటా. తల్లి ఎలా ఉండరాదో నా తల్లి నాకు బోధించింది’’ అంటారామె. వీరితో పాటు మరో 16 మంది మహిళలు జీవితంలో తాము ఎదుర్కొన్న వివక్షపై ధైర్యంగా గళం విప్పారు. ఈ నిరసన గళాలకు ఫ్యాషన్‌ను వేదికగా ఎంచుకోవడం వల్లే షర్మిలా మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

‘‘బెంగళూరులోని క్రిస్ట్‌ యూనివర్శిటీ నుంచి లిటరేచర్‌లో పట్టా తీసుకున్నా. నేత పనిపై ఆసక్తి ఉంది. పెళ్లయిన తర్వాత నా మనసుకు నచ్చిన పని మాత్రమే చేయాలనుకున్నా. నేత చీరల డిజైనింగ్‌పై దృష్టి పెట్టి ‘రెడ్‌ లోటస్‌’ను ప్రారంభించా. కంజీవరం, చేనేతలో ప్రత్యేక డిజైన్లతో చీరలను తయారుచేస్తాం. బెనారస్‌లో ఎనిమిది నుంచి పది వరకు మగ్గాలున్నాయి. మూడేళ్ల క్రితం నేను డిజైన్‌ చేసిన చీరలకు ట్రాన్స్‌జెండర్లు మోడల్స్‌గా ఎంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. అదే స్ఫూర్తితో ‘18 షేడ్స్‌ ఆఫ్‌ బ్లాక్‌’ థీమ్‌ను ఎంచుకున్నా.’’

Courtesy AndhraJyothy..

RELATED ARTICLES

Latest Updates