బీసీ హాస్టల్లో బువ్వేది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • 5 నెలలుగా విడుదల కాని బిల్లులు
  • అరువుపై సరుకులు తెస్తున్న వార్డెన్లు
  • బిల్లుల కోసం ప్రతినెలా ప్రతిపాదనలు
  • పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
  • ఒక్కో హాస్టల్‌కు లక్షల రూపాయల బాకీ
  • ఇక అప్పు పుట్టేట్టు లేదంటున్న వార్డెన్లు
  • అద్దె, కరెంట్‌, నల్లా బిల్లులూ బకాయి

హైదరాబాద్‌, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లలో విద్యార్ధులకు బువ్వ కరువయ్యే పరిస్థితి నెలకొంది. ఐదు నెలలుగా బీసీ హాస్టళ్ల మెస్‌ బిల్లులు పేరుకుపోయాయి. కొన్ని జిల్లాల్లో లక్షల్లో, మరికొన్ని జిల్లాల్లో కోట్లలో బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పైసా విడుదల కాలేదు. ఇన్నాళ్లూ రోజువారీ అప్పులు చేసి.. ఉన్న బంగారం కుదువ పెట్టి, సరుకులు తెచ్చి, విద్యార్థులకు భోజనం పెట్టిన వార్డెన్లు చేతులెత్తేశారు. అప్పుల్లో కూరుకుపోయామని.. తమకు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి బిల్లులు నిలిచిపోయాయి. సగటున ప్రతి హాస్టల్‌కు

రూ.1.5లక్షల నుంచి రూ.2 లక్షల వరకు బకాయిలను సర్కారు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 696 బీసీ హాస్టల్స్‌లో 68,315 మంది పిల్లలున్నారు. ప్రతి నెలా హాస్టళ్ల బకాయిలపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళుతూనే ఉన్నా స్పందన కరువవుతోందని వార్డెన్లు వాపోతున్నారు. సూర్యాపేట, ఖమ్మం, నిజామాబాద్‌, మేడ్చల్‌, సిద్దిపేట, మెదక్‌ లాంటి జిల్లాల్లోనైతే రూ.కోటి పైగానే బిల్లులు పేరుకుపోయాయి. కాగా 76 ప్రి మెట్రిక్‌ బీసీ హాస్టల్స్‌, 223 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లకు ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమానులు వార్డెన్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కరెంటు బిల్లులు, కొన్నిచోట్ల నీళ్ల బిల్లులు, డైట్‌ బిల్లులు, కాస్మోటిక్‌ చార్జీలు ఇలా అన్ని బకాయిలు పేరుకుపోయాయని వార్డెన్లు చెబుతున్నారు.

బంగారం తాకట్టుతో అప్పు తెచ్చి..
జూన్‌ నుంచి బిల్లులు రావడం లేదు. నిర్వహణ కష్టంగా ఉంది. ఊరికే ఉండలేం కదా. అప్పు తెచ్చి వండి పెడుతున్నాం. కొంతమంది వార్డెన్లకు అప్పులు పుట్టక ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో హాస్టల్స్‌ను నడిపిస్తున్నారు.
– ఓ హాస్టల్‌ వార్డెన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా

బకాయిలున్న మాట వాస్తవమే
బీసీ హాస్టళ్లకు బకాయిలున్న మాట వాస్తవమే. నాలుగు రోజుల క్రితం మూడు నెలల బకాయి డబ్బు విడుదల చేశాం. నేడో రేపో చేరతాయి. బిల్లుల కోసం మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. వారు ఎటువంటి ఫుడ్‌ ఇస్తున్నారో కూడా తనిఖీలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం.. ఇన్‌టైమ్‌లో వారికి బిల్లులివ్వకపోవడమే.
– బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారి

Courtesy AndhraJyothy..

RELATED ARTICLES

Latest Updates