నుదుటిపై నవ్వే నాగేటి చాళ్ళ నుండి…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
చల్లపల్లి స్వరూపరాణి

సాయుధుడూ, స్వాప్నికుడూ అయిన కంభం జ్ఞాన సత్యమూర్తి( శివసాగర్) వెళ్ళిపోయి ఏడు సంవత్సరాలు దాటింది. ఆయన మీద రకరకాల అంచనాలు వచ్చాయి. కొందరు ఆయన నిబద్ధతను కొలవడానికి తమ దగ్గర సరైన తూనికరాళ్ళు లేవంటే, మరికొందరు ఆయన కంట్లో వేలుబెట్టి కెలికే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బతికున్నప్పుడు వర్గ కుల శత్రువులతో బోలెడంతమంది అభిమానుల్ని, ప్రేమికుల్ని పొందిన శివసాగర్ అనే సత్యమూర్తి నిజానికి తాను భౌతికంగా ముగిసిపోయాక మరింతగా జనానికి చేరువవుతున్నాడు. శివుడిని నిర్మూలించడం అంత తేలికైన పనేమీ కాదు. ఎందుకంటే ఆయన మేడల్లో కాక పూరి గుడిసెల్లో, పేద మనుషులతో బతికాడు. తనకోసం ఉండడానికి ఇల్లు, బతకడానికి నాలుగు రాళ్ళు సంపాదించుకోలేని నిబద్ధుడైన ప్రేమికుడిని ‘రాలిపడిన పువ్వులూ, గాయపడిన పిట్ట’లే ప్రాణమిచ్చి కాపాడుకుంటాయి. గొల్లోళ్ళ చిన్నమ్మ పాలు తాపుతుంది… కురుమోడు, గోండోడు గటక తాపుతారు…

సుమారు రెండు వందల ఏళ్ల సుదీర్ఘమైన పోరాట చరిత్ర ఉన్న కుటుంబం నుంచి సత్యమూర్తి ఒక గొప్ప ఉద్యమ వారసత్వాన్ని పొందాడు. బస్తర్ అడవుల నుంచి ఖమ్మం మీదుగా కోస్తాంధ్రలోని కృష్ణా జిల్లాకు వలస వచ్చిన ఒకానొక ఆదివాసీ కుటుంబం ఆయన పూర్వీకులది. వలస క్రమంలో అది స్థానిక ‘మాల’ దళిత కులంలో, క్రైస్తవంలో కలసిపోయి తన పాత అస్తిత్వాన్ని కోల్పోయినప్పటికీ మూడవ తరానికి చెందిన సత్యమూర్తిలో ఆ పోరు వారసత్వం మరింత చురుకుగా పదునెక్కింది తప్ప చదువుతో, సంపదతో వొనగూడే భోగలాలసత వైపు మొగ్గు చూపలేదు. ఎనభై ఏళ్లకు పైగా జీవించిన ఆయన నిండు జీవితంలో దాదాపు యాభై ఏళ్ళు ప్రజా జీవితంలో, ప్రజల కోసం బతికి తనకంటూ వ్యక్తిగత ఆస్తి గానీ, జీవితం గానీ లేకుండా గడిపాడు. ఆయన ఏ రాజకీయాలలో ఉన్నప్పటికీ నిరంతరం పీడిత ప్రజల విముక్తి కోసం పరితపించాడు. ఒక చేత్తో కత్తి, మరో చేత్తో కలం పట్టుకుని విప్లవం, ప్రేమ వేరుకాదని, విప్లవకారుడంటే ప్రజలమీద, సమాజం మీద రాజీలేని ప్రేమికుడని తన కార్యాచరణతో చాటి చెప్పాడు.

సత్యమూర్తి భారత విప్లవోద్యమంలో అగ్రగణ్యుడు, నెలబాలుడిగా ఉన్న విప్లవోద్యమానికి తన సిద్ధాంత పరిపుష్టితో పెంచి పెద్ద చేశాడు. విప్లవం విజయవంతమైతే పీడిత ప్రజల జీవితంలో వెలుతురు విరబూస్తుందని కలగన్న స్వాప్నికుడు శివసాగర్. ఆయన మార్క్స్ ని గొప్ప ప్యాషన్ తో చదువుకుని మార్క్సిజాన్ని తన మార్గంగా ఎంచుకున్నాడు. మావో ఉద్యమ ఎత్తుగడలతో పాటు ఆయన కవిత్వాన్ని ప్రేమించాడు. ఫూలే, అంబేద్కర్ ల సామాజిక విప్లవ సిద్ధాంతాన్ని గుండెలకు హత్తుకున్నాడు. ఫక్తు మార్క్సిస్టుల మాదిరి అంబేద్కర్ ని ఉదారవాదిగా భావించక ఆయనలోని విప్లవ కోణాన్ని సీరియస్ గా అధ్యయనం చేశాడు. ఆయన దృష్టిలో మార్క్స్, అంబేద్కర్ వేరు కాదు. వారిద్దరి సిద్ధాంత వెలుగులో భారత సమాజం ‘వర్గ కుల సమాజం’ అని అర్ధం చేసుకుని ఈదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే కుల వర్గ పోరాటాలు జమిలిగా జరగాలని, మార్క్సిజం, అంబేడ్కరిజం చేతిలో చెయ్యి వేసుకుని నడవాలని భావించాడు.

ఆయనకి రాజకీయాలు, కవిత్వం, జీవితం వేరుగాదు. మూడూ కలిస్తేనే శివసాగరనే సత్యమూర్తి ఉంటాడు అనేవాడు. నెత్తురు, తూటాల మోతతో కరుకుదేలిన విప్లవ కవిత్వంలోకి వెన్నెలని, పువ్వుల్ని, పిట్టల్ని, సెలయేటి నవ్వుల్ని తీసుకొచ్చాడు. ‘కసితో స్వార్ధం శిరసును/ గండ్రగొడ్డలితో నరకగలిగినవాడే/ నేటి హీరో’ వంటి రక్తం మరిగే అక్షరాలు రాసినా తనకంటే చిన్నవాళ్ళతో, పిల్లలతో చిన్నపిల్లవాడిలా, స్త్రీలతో సూనృతంగా ప్రవర్తించే శివసాగర్ ని చూస్తే మనకి ఆయనలా బతకడం ఒక్కరోజైనా సాధ్యమేనా అనిపిస్తుంది.

సుమారు ఐదు దశాబ్దాల శివసాగర్ కవిత్వాన్ని గాలించి, దండకట్టే పని ఆయన ప్రేమికుడు డాక్టర్ గుర్రం సీతారాములు శివుడు బతికిఉండగానే మొదలుపెట్టాడు. 2004 లో ‘శివసాగర్ కవిత్వం’ శీర్షికన వచ్చిన ఆయన పుస్తకంలో చేరని మరికొన్ని కవితల్ని చేర్చి ఇప్పుడు సుమారు 350 పేజీలతో ఒక సమగ్రమైన కవితా సంపుటిని ‘శివసాగర్ కవిత్వం’ పేరున వేస్తున్నాడు. ఈ పుస్తకానికి ‘కల్లోల కాలానికి టార్చ్ బేరర్ ‘శివసాగర్’’ శీర్షికతో సీతారాములు శివసాగర్ ఉద్యమ జీవితాన్ని, వ్యక్తిగతాన్ని, సాహిత్యాన్ని ఉన్నతంగా పరిచయం చేస్తూ ముందుమాట రాసుకున్నాడు. అందులో ‘ప్రత్యామ్నాయ నిర్మాణాల కోసం వ్యక్తిగతంగా ఏమీ మిగిల్చుకోకుండా జీవితం మొత్తం పనిచేసి డస్సిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు తన పేజీలు ఎక్కడ? ఎవరు రాయాలి? నిష్పాక్షికంగా చరిత్ర గమనాన్ని నడిపిన శివసాగర్ లాంటివాళ్ళ పరంపర ఏం కావాలి?’ అని చదివినప్పుడు అప్రయత్నంగా తెలియని దు:ఖపు పొర ఏదో కళ్ళమీద వాలింది. ఆయన చనిపోయినప్పుడు విజయవాడ బందరు లాకులవద్ద ఉండే స్వాతంత్ర్య సమరయోధుల భవనం ముందు దృశ్యం కళ్ళల్లో కదలాడింది. అక్కడ నిస్తేజంగా పడిఉన్న పరాజితుడూ, విఫల ప్రేమికుడూ, క్షతగాత్రుడైన శివసాగర్ గుర్తుకొచ్చాడు. శిధిల దేవాలయంలో నందనార్ వంటి శివసాగర్ రూపం కళ్ళల్లో మెదిలింది. 2012, ఏప్రిల్ 17 నడివేసవిలోనే వడగాడ్పు జీవితాన్ని చిరునవ్వు చెరగనీకుండా గడిపిన శివసాగర్ వెళ్ళిపోయాడు. ఎవరు తనని ఏడు తాడిచెట్ల లోతున పాతిపెట్టాలని చూసినా నల్లాటి సూరీడు శివసాగర్ తన నిర్వాణం తర్వాత మరింత వెలుగులు చిమ్ముతున్నాడు. ‘నుదుటిపై నవ్వే/నాగేటి చాళ్ళ నుండి /మట్టి వాసనల నుండి/అట్టడుగు నుండి’ ఆయన తిరిగి లేస్తున్నాడు…

శివసాగర్ పంచి వెళ్ళిన సాహిత్య వెలుతురుని గంపలకెత్తి ఆయన అభిమానులకు, భవిషత్ తరాలకు పంచి ఇస్తున్న డాక్టర్ గుర్రం సీతారాములు శివసాగర్ సిసలైన ప్రేమికుడు, చెలికాడు… సీతా, నీ కష్టానికి, శ్రమకు జేజేలు.

చల్లపల్లి స్వరూపరాణి

RELATED ARTICLES

Latest Updates