రగులుతున్న ప్రపంచం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు..
  • అనేక దేశాల్లో ఆందోళనలు
  • ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలు
  • అసమానతలు, ఆర్థిక వృద్ధిలో పతనమే కారణాలు

ఓ చిన్న నిప్పు రవ్వ చాలు.. అసంతృప్తి జ్వాలలు పైకెగియడానికి! ఓ మామూలు ప్రభుత్వ నిర్ణయం చాలు.. ప్రజాగ్రహం పెల్లుబకడానికి! కారణాలనేకం.. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనోద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా అశాంతి, అసంతృప్తి, ఆగ్రహం. ప్రజా వేదన కట్టలు తెంచుకుంటోంది. కొన్నిచోట్ల తాత్కాలికంగా ఆగినా మరికొన్ని దేశాల్లో సాగుతూనే ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో విషయమై ప్రజలు రోడ్లెక్కుతున్నా.. నిశితంగా చూస్తే వీటన్నింటి వెనకా ఒకే ఒక కారణం కనిపిస్తోంది. అది.. ఆర్థిక వృద్ధి మందగించడం! ఉపాధి లేకపోవడం, ఉన్న ఉద్యోగాలు ఊడడం, పోషణ జరగక నిస్సహాయులై ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిరసనలు కొత్త కాకున్నా.. ఈ శతాబ్ది తొలినాళ్లలోనే ఇవి ఉద్ధృతం కావడం రాబోయే కాలంలో పరిస్థితులు విషమించవచ్చన్న దానికి సంకేతాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

హాంకాంగ్‌లో ఆరని చిచ్చు
హాంకాంగ్‌లో ఈ ఏడాది జూన్‌లో మొదలైన ప్రజా ప్రదర్శనలు చల్లారలేదు. నేరగాళ్లను చైనాకు తరలించేందుకు అధికారమిచ్చే ఓ చట్టాన్ని తేవడమే ఇందుకు కారణం. 2037నాటికి హాంకాంగ్‌ పూర్తిగా చైనా వశం కానుంది. స్వేచ్ఛాపిపాసులైన హాంకాంగ్‌వాసులు ఇప్పటి నుంచే చైనా పెత్తనాన్ని అంగీకరించే స్థితిలో లేరు. శనివారం కూడా వేలమంది నల్ల దుస్తులు ధరించి రోడ్లపైకి వచ్చారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా హాంకాంగ్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

పాక్‌ సర్కారుపై యుద్ధం
ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ రాజీనామా చేయాలంటూ పాకిస్థాన్‌లో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. మత గురువు, రాజకీయ నాయకుడు మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ నేతృత్వంలోని జమాయిత్‌ ఉలేమా ఏ ఇస్లాం ఫజల్‌ ఆధ్వర్యంలో సింధ్‌ ప్రొవిన్స్‌లో ప్రారంభమైన ‘ఆజాదీ మార్చ్‌’ గురువారం ఇస్లామాబాద్‌ చేరింది. పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ, అవామీ నేషనల్‌ పార్టీలూ ఇందులో భాగస్వాములయ్యాయి. వేల మంది ఆందోళనకారులను ఉద్దేశించి రెహ్మాన్‌ ప్రసంగించారు. రాజీనామాకు ఇమ్రాన్‌కు రెండు రోజుల గడువు ఇచ్చారు.

ఇరాక్‌లో హింస
ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం మొదలై ఇది రెండో నెల. ఇప్పటిదాకా 250 మంది మరణించారు. 10 వేలమంది గాయపడ్డారు. అవినీతి, నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండడంతో మత గురువు అయతుల్లా అలీ అల్‌ సిస్తానీ నేతృత్వంలో ఇస్లామిక్‌ నేతలు రంగంలోకి దిగారు. ప్రభుత్వ రాజీనామాకు పట్టుబడుతున్నారు.

లెబనాన్‌ నిరంతర అనిశ్చితి
ప్రజల కనీస అవసరాలైన నీరు, ఆహారం, విద్యుత్తు, చమురు వంటి సమస్యలు ఏళ్ల తరబడి తీరలేదు. అవినీతి నేతలు రాజ్యమేలుతున్నారు. దాంతో, మొత్తం రాజకీయ వ్యవస్థను మార్చేయాలని, దేశాన్ని రాజకీయేతర నిపుణుల చేతుల్లో పెట్టాలని కోరుతూ లెబనాన్‌లో ప్రజలు 13 రోజులపాటు నిరసనలతో హోరెత్తించారు. ప్రధాని హారిరి రాజీనామా చేశారు. అనిశ్చితి అక్కడ నిత్యకృత్యంగా మారింది.

 లిబియాలో అంతర్యుద్ధం
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు లిబియాలో అంతర్యుద్ధానికి దారితీశాయి. గవర్నమెంట్‌ నేషనల్‌ అకార్డ్‌- హఫ్తార్‌ నేషనల్‌ ఆర్మీల మధ్య పోరాటం, బాంబు దాడులతో దేశం దద్దరిల్లుతోంది. లిబియా మాత్రమే కాదు.. జింబాబ్వే, ట్యునీషియా, కోట్‌ డీ లివోరీ, కామెరాన్‌ తదితర దేశాల్లో అవినీతి, అసమర్థ పాలన, సైనిక నియంతృత్వాలు అంతర్గత సంక్షోభానికి దారితీశాయి. ప్రజా ప్రదర్శనలకు వేదికలయ్యాయి.

నెదర్లాండ్స్‌లో రోడ్డెక్కిన రైతన్న
దేశంలో కాలుష్య ఉద్గారాలు పెరిగిపోవడానికి పశువుల కొట్టాలే కారణమని, వాటన్నింటినీ మూసెయ్యాలని పార్లమెంట్‌ వ్యాఖ్యానించడంపై డచ్‌లో రైతులు ఆగ్రహించారు. దేశవ్యాప్తంగా రైతులు తమ ట్రాక్టర్లను తీసుకొని ది హేగ్‌ నగరంవైపు ప్రదర్శన తీశారు. దాదాపు 700 కిలోమీటర్లమేర ఈ నిరసన సాగింది. ఇప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు.

ఇండోనేషియాలో సెక్స్‌ నిషేధ చట్టం
వివాహేతర లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించే ఓ చట్టాన్ని ఇండోనేషియా ప్రభుత్వం తెచ్చింది. సహ జీవనం చేస్తున్న వారికి ఆరు నెలల జైలుశిక్ష ఈ చట్టం ద్వారా విధించవచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడంపై వేలమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

ఫ్రాన్స్‌లోనూ అన్నదాతల ఆక్రోశం
ఫ్రాన్స్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను నిరసిస్తూ వేల మంది రైతులు రోడ్డెక్కారు. కెనడా, ఐరోపా సమాజ దేశాలతో ఫ్రాన్స్‌ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం తమ పొట్టకొడుతోందన్నది వారి ఆక్రోశం.

చిలీ.. ఆగని హోరు
శాంటియాగోలో మెట్రో రైలు చార్జీల పెంపు చిలీలో మహా ఆందోళనకు నిప్పురవ్వగా మారింది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, వైద్య ఖర్చులు మొదలైన అనేక అంశాలపై చిలియన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

బ్రెగ్జిట్‌ కోసం ఇంగ్లండ్‌లో
ఐరోపా సమాజ దేశాల కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలగే అంశం దాదాపు రెండేళ్లుగా ఇంగ్లండ్‌ను కుదిపేస్తోంది. వేలమంది అనుకూల, ప్రతికూలవాదులు ప్రతిరోజూ రోడ్లపై ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు.

ఈజిప్ట్‌ కుతకుత
నిరసనోద్యమాల్ని నిషేధిస్తూ ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫెటా అల్‌ సిసి ఉత్తర్వులివ్వడంతో వేల మంది రోడ్లెక్కారు. వందలమంది నేతలను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఇప్పటికీ కైరోలోనూ, ప్రధాన నగరాల్లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది.

హైతీలో ఆహార కొరత
ఏడాదిగా నిరసనలతో హైతీ అట్టుడుకుతోంది. ఆహారం, చమురు, విద్యుత్తు కొరతతో అల్లాడిపోతున్న జనం దేశాధ్యక్షుడు జోవినెల్‌ మొయిసే రాజీనామాను కోరుతున్నారు.

Courtesy Andhra Jyothy..

RELATED ARTICLES

Latest Updates