ఏది ప్రామాణికం?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎవర్ని నమ్మాలి?

  • అసెంబ్లీలో మంత్రి చెప్పిన లెక్కలా?.. అధికారుల లెక్కలు నమ్మాలా?
  • తప్పుడు వివరాలతో అఫిడవిటా?.. ఆర్టీసీ ఎండీపై భగ్గుమన్న హైకోర్టు
  • అధికారులు ఇచ్చిన సమాచారమా?
  • ఇద్దరు ఐఏఎస్‌లపై ఆగ్రహం వివరాలివ్వాలని
  • విచారణ 7కు వాయిదా
  •  ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని రవాణా శాఖ మంత్రి రెండు నెలల కిందే అసెంబ్లీలో చెప్పారు. రాయితీ బస్సు పాసులు, రుణాలు, ఇతర మొత్తాలు కలిపి ప్రభుత్వం నుంచి రూ.1492.70 కోట్లు రావాల్సి ఉందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇప్పుడు తాజాగా అధికారులు కొత్త లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని పద్దుల కింద 2018-19 సంవత్సరానికి 644.51 కోట్లు మంజూరు చేసిందని, ఈ మొత్తం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువని తేల్చేశారు. రెండింటిలో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నిలదీసింది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారా? లేక మంత్రిని మీరు తప్పుదారి పట్టించారా? బాధ్యతగల ప్రజాప్రతినిధిగా మంత్రి అసెంబ్లీలో చెప్పిన వివరాలు అబద్ధాలుగా పరిగణించాలా?అని ఆర్టీసీ ఎండీని ప్రశ్నించింది.

మీరు ఆర్టీసీకి ఎండీ. జీహెచ్‌ఎంసీ తరఫున వకాల్తా ఎందుకు తీసుకుంటున్నారు? అంటూ ఎండగట్టింది.ఇదేమీ క్లరికల్‌ తప్పిదమో, టైపింగ్‌లో దొర్లిన పొరపాటో కాదు.. బాధ్యతగా ఉండాలి అని హితబోధ చేసింది. త్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన వాస్తవం కాదా? అని నిలదీసింది. ఏఎస్‌ అధికారులు నిజాయితీగా అఫిడవిట్‌ వేస్తారని భావించాం కానీ… ఇద్దరు అధికారులు ప్రమాణం చేసిన దాఖలు చేసిన అఫిడవిట్లలో వాస్తవాలు లేవు. అసంబద్ధంగా ఉన్నాయి అని ఎత్తిచూపింది. ప్రమాణం చేసి కోర్టుకు తప్పడు సమాచారం ఇస్తే ఏమౌతుందో తెలియదా? అని నిలదీసింది. పరస్పర విరుద్ధంగా అఫిడవిట్లు ఇచ్చారన్న ధర్మాసనం తదుపరి విచారణకు వాస్తవాలను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

వాస్తవాలను మరుగునపరిచేలా కౌంటర్‌..సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి, గుర్తింపు పొందిన ట్రేడ్‌ యూనియన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఆర్‌.సుబేందర్‌సింగ్‌, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ, ఇతర అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవాలు మరుగుపరిచే విధంగా కౌంటర్‌ ఉందని ఆక్షేపించింది. ఆర్టీసీకి 644.51 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇది ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువేనని ఆర్టీసీ అఫిడవిట్‌లో తెలిపారని ప్రస్తావించింది.

ఏ పద్దు కింద ఇచ్చారో కూడా స్పష్టం చేయలేదని ఎత్తి చూపింపింది. ఆ నిధులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పరిశీలించిన ధర్మాసనం ఈ మొత్తం బస్సు పాస్‌ రాయితీల కింద ఇచ్చింది కాదని, కొత్త బస్సుల కొనుగోలుకు రుణం కింద ఇచ్చిందని ప్రస్తావించింది. రీయింబర్స్‌మెంటు కింద కేవలం 130 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపింది. గత విచారణ సందర్భంగా బస్‌పాసు రాయితీల కింద 2018-19 వరకు రూ.1,375 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. రూ.130 కోట్లే ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిపారు. సునీల్‌ శర్మ వివరణ ఇస్తూ… ఆర్టీసీకి సిటీలో తిరుగుతున్న బస్సుల వల్ల వచ్చే నష్టం రూ.1,786.06 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇందులో 2015-16 సంవత్సరంలో రూ.108 కోట్లు, 2016-17లో రూ.228.40 కోట్లు మొత్తం రూ.336.40 కోట్లు జీహెచ్‌ఎంసీ చెల్లించిందన్నారు. మిగిలిన బకాయిలు చెల్లించడానికి జీహెచ్‌ఎంసీకి తగిన ఆర్థిక స్థోమత లేదని, ప్రభుత్వానికి లేఖ రాసిందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు సంస్థ అవసరాలకు అనుగుణంగా వినియోగించామన్న ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ వివరణను తప్పుబట్టింది.

49 కోట్లు ఇస్తే నాలుగు డిమాండ్ల పరిష్కారం..ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిల్లో తక్షణమే రూ.49 కోట్లు ఇస్తే… కార్మికుల ప్రధాన డిమాండ్లలో నాలుగు పరిష్కారమవుతాయి. కానీ ప్రభుత్వమేమో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని, 49 కోట్లు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి వేసిన అఫిడవిట్‌ మొత్తం పేలవంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సిటీలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులకు నష్టాలు వస్తే దాన్ని జీహెచ్‌ఎంసీ భర్తీ చేయాల్సిన అవసరం లేదని చట్టం చెబుతోందని ఎండీ సునీల్‌శర్మ కోర్టుకు తెలిపారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఆర్థికంగా బలంగా ఉందనుకున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ వద్ద తగిన నిధులు లేవని చెబుతున్నప్పుడు 2015-16 సంవత్సరాలకు 108 కోట్లు, 2016-17 సంవత్సరానికి 228.40 కోట్లు ఎలా చెల్లించారని ప్రశ్నించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో నష్టాలు వస్తున్నప్పుడు సిటీలో బస్సులు ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించింది. సామాన్య ప్రజల కోసం తిప్పుతున్నామని, రోజూ 33 లక్షల మంది నగరంలో బస్సుల్లో ప్రయాణం చేస్తారని సునీల్‌శర్మ బదులిచ్చారు. కార్మిక సంఘాల న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి కల్పించుకుంటూ.. ఆర్టీసీ ఎండీ తప్పుడు అఫిడవిట్‌ను కోర్టుకు ఇచ్చారన్నారు. సంస్థ ఎండీగా ఉన్న అధికారి దాని సంక్షేమం చూడాలని, ఆయన జీహెచ్‌ఎంసీ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

జీహెచ్‌ఎంసీ తరఫున వకాల్తా ఎందుకు?…ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ జోక్యం చేసుకుంటూ… సిటీలో తిరిగే బస్సులకు వచ్చే నష్టాలకు జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమాధానంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఆర్టీసీకి ఎండీ, సంస్థ మనుగడ చూడాలి, జీహెచ్‌ఎంసీ తరుపున ఎందుకు వకాల్తా తీసుకుంటున్నారు అని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు రిలీజ్‌ చేయమని ఎప్పుడు కోరారని నిలదీసింది. దీనిపై ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు వివరాలు ఇవ్వమని అడిగాం… ఇద్దరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుంది. ఐఏఎస్‌ అధికారులు కోర్టు పట్ల నిజాయితీగా వ్యవహరించాలి. ప్రమాణం చేసి ఇలాంటి పత్రాలు ఎలా ఇస్తారని నిలదీసింది. జీహెచ్‌ఎంసీ ఆర్టీసీ బకాయిలను ఇవ్వలేమని ఎప్పుడు లేఖ రాసిందని ప్రశ్నింది.

అక్టోబర్‌ 30న రాసినట్లు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఒక రోజు తర్వాత బకాయిలు ఇవ్వలేమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ ఎప్పుడు రాశారని ధర్మాసనం ప్రశ్నించగా… ఆయన కూడా అక్టోబర్‌ 30న రాశారని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ కోర్టుకు తెలిపారు. తిరిగి కల్పించుకున్న ధర్మాసనం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే లేఖలు రాస్తారా? అని నిలదీసింది. ఈ వివరాలు పూర్తిగా అయోమయానికి గురిచేశాయని వ్యాఖ్యానించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ సమర్పించిన అఫిడవిట్‌లోని పేరా 4లో చెప్పిన అంశాలకు, పేరా 5లో చెప్పిన దానికి పొంతన లేదని ఎత్తిచూపింది.

కోర్టు వైపే దృష్టి కేంద్రీకరించాలి..కోర్టు విచారణ జరగుతుండగా ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ పక్కకు తిరగడంపై ధర్మాసనం తప్పుపట్టింది. కోర్టు ప్రశ్నిస్తున్నప్పుడు కోర్టువైపే దృష్టి కేంద్రీకరించాలని సూచించింది. దీంతో సునీల్‌శర్మ కోర్టుకు క్షమాపణలు కోరారు. తిరిగి కల్పించుకున్న ధర్మాసనం సెక్షన్‌ 112 కింద జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి నిధులు చెల్లించాల్సిన అవసరం లేనపుడు 2015-16 సంవత్సరానికి రూ.108 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు జారీచేసిన మీదట లేఖలు ఎలా రాస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారం మొత్తం అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. సిటీలో తిరుగుతున్న బస్సులకు నష్టాలు వస్తుంటే ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించింది. ప్రజల సౌకర్యం కోసమే నగరంలో బస్సులు తిప్పుతున్నామని సునీల్‌శర్మ చెప్పారు.

ఆర్టీసీ యూనియన్‌ తరుపు సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కల్పించుకుంటూ.. పల్లె వెలుగుబస్సులకు నష్టాలు వస్తున్నాయని తెలిపారు. సిటీలోనూ, మారుమూల గ్రామాలకు వెళ్లే సర్వీసుల్లో 73 శాతం నష్టాలు ఉన్నాయన్నారు. సిటీలో తిరిగే బస్సులకు జీహెచ్‌ఎంసీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తేనే సంస్థ మనుగడ ఉంటుందన్నారు. కాగా మంత్రి ఆర్టీసీకి డబ్బులు రావాలని చెబుతుంటే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే ఎక్కువ ముట్టాయంటున్నారని ధర్మాసనం ప్రస్తావించింది. ఆర్టీసీ ఎండీ కల్పించుకుని కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని అభ్యర్థించారు. వ్యాజ్యాల విచారణను ఈనెల 7కి వాయిదా వేసింది.

Courtesy Andhajyothi…

RELATED ARTICLES

Latest Updates