ఉమెన్ ఫ్రీ బస్ పథకానికి భారీ స్పందన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆప్‌ సర్కార్‌ నిర్ణయంపై మహిళల్లో హర్షం
– వ్యక్తిగత వాహనాలు తగ్గించి… బస్‌ల వైపు పరుగులు
– మహిళా సాధికారత హీరోగా సీఎం కేజ్రీవాల్‌కు కితాబు
– న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతత్వంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ఉమెన్‌ ఫ్రీ బస్‌ పథకానికి నగరవాసుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఢిల్లీ సర్కారుకు అన్నివర్గాల మహిళల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణాని దెబ్బకొట్టే ఎంవీ యాక్టుని సవరించినా… ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ధైర్యంగా ఇటువంటి నిర్ణయాన్ని అమలు పరచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజా రవాణా వ్యవస్థని పరిరక్షించడంతో పాటు మహిళల భద్రత, సాధికారితకు భరోసా కల్పిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో మహిళలు పెద్ద ఎత్తున వ్యక్తిగత వాహనాలు తగ్గించి బస్‌ల వైపు పరుగుపెడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా నిర్వహించే భారుదూజ్‌ (అన్నా చెల్లెల్ల) పర్వదినం సందర్భంగా కేజ్రీవాల్‌ సర్కార్‌ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేజ్రీవాల్‌ మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. యాదచ్చికంగా అదేరోజు రక్షాబంధన్‌ కావడంతో ఢిల్లీ సోదరీమణులకు రక్షా బంధన్‌ కానుకగా ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ పథకం కోసం సంవత్సర కాలానికి దాదాపు రూ. రెండు వేల కోట్లను కేటాయించినట్టు కేజ్రీవాల్‌ వివరించారు. ఇందులో రూ. వెయ్యి కోట్లు మహిళల ఉచిత ప్రయాణ టికెట్లపై ఖర్చు చేయనుంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(డీటీసీ) బస్సులు, క్లస్టర్‌ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్యను లెక్కిం చారు. ఇందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌ కూర్పులోనూ, పథకం అమలులో కోర్టుల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఢిల్లీ ప్రభుత్వం జాగ్రత్తలు సైతం తీసుకుంది. ఢిల్లీ లో ప్రస్తుతం 4కోట్ల 50లక్షలకు పైగా ప్రజలు నివసిస్తు న్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా, ప్రస్తుతం కేజ్రీవాల్‌ సర్కార్‌ ప్రారంభించిన ఈ పథకం వల్ల ఎన్సీఆర్‌ పరిధిలోని ఘజియాబాద్‌, గుర్‌గావ్‌, ఫరీదాబాద్‌, బహ దూర్‌ఘర్‌, గ్రేటర్‌ నోయిడా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ వరకు మహిళ లు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ను పక్కన పెడితే, లక్షలాదిమంది మహిళలు కూలి పనులు చేసేవారే. ఇలాంటి వారికి ఈ పథకం భరోసా కల్పిస్తోంది.
ఢిల్లీ మహిళలను ఆకట్టుకున్న పథకం
సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేపట్టిన ఉచిత ప్రయాణ పథకం నగరంలోని మహిళలను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నది. స్కూటీ, క్యాబ్‌లను ఉపయోగించే మహిళలు బస్‌ల వైపు మళ్ళుతున్నట్టు డీటీసీ అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజుల్లో మహిళలు సొంత వాహనాలు వాడటం బాగా తగ్గించినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. యావత్‌ ఢిల్లీలో మొత్తం 6 నుంచి 8 వేల ద్విచక్రవాహనాలు రోడ్డుపైకి రాలేదని నగర ట్రాఫిక్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. ట్రాఫిక్‌ పెద్దఎత్తున తగ్గి, కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుం దని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్‌ 4 నుంచి 15 వరకు అమలులోకి రానున్న సరి, బేసి విధానానికి ఈ పథకం మరింత ఉపయోగపడుతుందని అంచనాలు వేస్తున్నారు
మహిళల రక్షణకు భారీ భద్రత
దేశంలో అతి పెద్ద నగరమైన ఢిల్లీలో ట్రాఫిక్‌ సమస్య తర్వాత ఎక్కువగా ప్రభుత్వానికి సవాలు అయ్యేది మహిళల భద్రత అంశమన్న విషయం తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు మార్షల్స్‌తో భద్రతను కల్పి స్తోంది. ఇప్పటికే మహిళల భద్రత కోసం ఢిల్లీ హౌంగార్డ్స్‌ ను వినియోగిస్తోన్న రాష్ట్ర సర్కార్‌, మార్షల్స్‌ పేరుతో కొత్తగా సివిల్‌ డిఫెన్స్‌ దళాలను నియమించింది. ఈ నిర్ణయం మహిళల్లో మరింత భద్రతా భావాన్ని పెంచే అవకాశం ఉంది. దీంతో, సీఎం కేజ్రీవాల్‌ మహిళల అభిమానాన్ని చూరగొంటారని గురుచరణ్‌కౌర్‌ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అన్నారు.
బస్సులెన్నీ… ఫ్రీ విధానం ఎలా?
ప్రస్తుతం డీటీసీ పరిధిలో ఉన్న బస్సులు సుమారు ఆరు వేలు అని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణానికి ముందు కొన్ని మార్గాల్లో మాత్రమే బస్సులు తిరిగేవని… తాజాగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టడంతో డీటీసీ బస్సుల అన్ని మార్గాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ 3 వేల 781 బస్సులు, క్లస్టర్స్‌ 1808 బస్సులను నడుపుతున్నాయి. ఇందులో ఏసీ, నాన్‌ ఏసీ బస్సులు వేర్వేరుగా ఉన్నాయి. నాన్‌ఏసీ టికెట్‌ చార్జీలు అతి తక్కువ దూరానికి 10 రూపాయలు కాగా, చివరిస్టాప్‌కి 15 రూపాయలు. ఏసీ టికెట్‌ ధర అతి తక్కువ దూరానికి 15 రూపాయలు కాగా, చివరి స్టాప్‌కి 25 రూపాయలు.
స్పందన ఎంత శాతం?
ఈ పథకాన్ని ప్రభుత్వం అక్టోబర్‌ 28న ప్రారంభించింది. కాగా, తొలిరోజు మొత్తం 13,65,230 టిక్కెట్టులు అమ్ముడుపోగా, కేవలం మహిళలవే 4,77,066 ఉన్నట్టు అధికారులు తెలిపారు. 34.94 శాతం మొదటి రోజే ఉచిత టికెట్లని అంచనా. ఇక రెండోరోజు 14,84.187 మొత్తం టెక్కెట్లు కాగా, మహిళల ఉచిత టికెట్లు 5,14,378. అంటే 36.78 శాతమని డీటీసీ అధికారు చెబుతున్నారు. ఇక మూడో రోజు 13,48,781 టిక్కెట్లు అమ్ముడుపోగా, మహిళలవే 4,96,705 ఉన్నట్టు చెప్పారు. కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఎన్నికల స్టంట్‌ అని విమర్శించినా, ప్రభుత్వ చర్యలకు నగరవాసుల నుంచి మద్ధతు లభిస్తుందని చెప్పక తప్పదు.

Courtesy NavaTelangana..

RELATED ARTICLES

Latest Updates