ప్రజారవాణా బరువు ప్రభుత్వానిదే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కె. శ్రీనివాస్

ప్రభుత్వ కార్పొరేషన్లు తమ నిర్వహణను తామే సొంతంగా చేసుకోవాలన్నది ఒక సంప్రదాయమే అయినప్పటికీ, ప్రజారవాణాను ఆ కోవలోకి చేర్చకూడదు. సింగపూర్‌లో అనేక ప్రైవేట్‌ సంస్థల చేతిలో ప్రజారవాణా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏటా 400 కోట్ల సింగపూర్‌ డాలర్ల మేరకు సబ్సిడీలు ఇస్తున్నది. ఆర్థికాభివృద్ధి ప్రజారవాణాతో ముడిపడి ఉంటుంది. ఆర్థికచక్రం వేగవంతంగా తిరగాలంటే, ప్రజారవాణా ఉండాలి. వినియోగదారుడిని దుకాణానికి, విద్యార్థిని పాఠశాలకు, ఉద్యోగిని కార్యాలయానికి వారి జేబులను పెద్దగా బాధించకుండా తరలించగలిగే సాధనాలు ఉన్నప్పుడే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం.

మెట్రో చార్జీలు 30 పెసోలు పెరిగాయని చిలీలో ఉద్యమం రాజుకున్నది. మెరుగైన జీవితం కోసం, ప్రజాస్వామ్యం కోసం మహాపోరాటంగా అది మలుపు తిరుగుతున్నది. ఇంతకీ 30 పెసోలు అంటే ఎంత, రెండు రూపాయల ఎనభై పైసలు. చిలీ ఆర్థికవ్యవస్థలో ఆ మొత్తమే జీవితాలను అతలాకుతలం చేయగలదు. సోషలిస్టు అలెండీ ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో కూల్చివేసి, దేశాన్ని పెద్ద బందిఖానాగా మార్చిన నియంత పెనోచెట్‌ 1980లలో తానే ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రాసి దేశం మీద రుద్దాడు. అమెరికాకు అత్యంత ప్రియమైన, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చాడు. బంగారం లాంటి రాగిగనులను ధారాదత్తం చేశాడు. అయినా అతని పతనం తప్పలేదు. ప్రజాస్వామ్యం అంటూ ఒకటి రాకతప్పలేదు. రాజ్యాంగం మాత్రం సైనిక నియంత రాసిందే కొనసాగుతున్నది.

పెడతోవ పట్టకుండా దారికి వచ్చిన లాటిన్‌ అమెరికన్‌ దేశంగా చిలీని అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంస్థలు బాగా ముద్దు చేస్తున్నాయి. వృద్ధిరేటును బాగా చూపుతున్నాయి. కానీ, చిలీలో సగం జనాభా 550డాలర్లు (అంటే 4లక్షల పెసోలు) నెలవారీ ఆదాయం మీద బతుకుతున్నది. భారతీయ ప్రమాణాల ప్రకారం నెలకు 36వేల రూపాయల జీతం అధికం కావచ్చును కానీ, అక్కడ మాత్రం మూడు రూపాయల చార్జీ హెచ్చింపునకు కూడా దేశం అతలాకుతలమయ్యేంత దుస్థితి. దేశంలో ప్రైవేటీకరణ ఎంతగా విశ్వరూపం తీసుకున్నా, శాంటియాగో మెట్రో మాత్రం ప్రభుత్వరంగంలోనే ఉన్నది. నిర్వహణ వ్యయం పెరిగితే ప్రభుత్వం ఆ లోటును భర్తీచేయాలి తప్ప చార్జీలు పెంచడానికి వీలు లేదని జనం కోరుతున్నారు.

ఆధునిక జీవనంలో ప్రయాణం ఒక అత్యవసర భాగం. పల్లెటూళ్లలో పిల్లలు చదువుకోవాలన్నా, జబ్బుపడితే ఆస్పత్రికి వెళ్లాలన్నా, కొనుగోళ్లకు, పనులకు పట్నం పోవాలన్నా రోడ్లూ ఉండాలి, ప్రయాణ సదుపాయాలూ ఉండాలి. ముఖ్యంగా వ్యవసాయ దినుసులన్నీ మునుపటి వలె స్వావలంబితం కాకపోవడంతో రైతుకు కూడా ప్రయాణం తప్పనిసరి. పట్నాలలో అయితే చెప్పనక్కరలేదు. ఇంటికీ ఉపాధికీ మధ్య ప్రయాణమే. విశ్రాంతికీ వినోదానికీ మధ్య ప్రయాణమే. దూరాభారాలు పెరిగాక చార్జీలు తప్పనిసరి పద్దులు అవుతాయి. రైలో బస్సో ఆ తరువాత ఆటోనో టేక్సీనో, ఇంకా ఎక్కడైనా మిగిలితే రిక్షానో– అవసరమే. మనిషిని తరలించగలిగే సాధనాలు లేనప్పుడు, వ్యాపారం వ్యవహారం ఎట్లా నడుస్తాయి? ప్రజాజీవనానికి జీవనాడి లాంటి జనరవాణా, కొందరు కార్మికులకు, ఒక యాజమాన్యానికీ సంబంధించినది మాత్రమే కాదు. దానికయ్యే ఖర్చు దాని నుంచే రావాలనుకోవడానికి అది ఫక్తు వ్యాపారం కాదు. అది మౌలిక సదుపాయాలలో ఒకటి. అది అనేక ఆర్థిక కార్యక్రమాలకు సానుకూలత కల్పించే వేదిక. ప్రయాణీకులు మాత్రమే కాదు, చిన్న, పెద్ద వ్యాపారులు, దుకాణదారులు, సినిమావినోద కేంద్రాల వారు, వృత్తిపనివారు అందరూ లబ్ధి చెందుతారు. అందరికీ అవసరమైన ఒక ఉమ్మడి వ్యవస్థను, ఉమ్మడిగానే నిర్వహించుకోవాలి

నెలరోజులు కావస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సమ్మె వల్ల ప్రభావితులయినది ఎవరెవరు? కార్మికులు, ఉద్యోగులు సరే. వారిది జీవన్మరణ సమస్య. కలవరంతో భయంతో నిస్పృహతో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. వారు, పరిష్కారం అత్యవసరంగా అవసరమయిన వారు. తక్కిన అన్ని ప్రజాశ్రేణులు కూడా ఈ సమ్మెవల్ల ప్రభావితులవుతున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య సమ్మె కాలంలో 30శాతం తగ్గిపోయిందని ఒక అధ్యయనంలో తేలింది. వారు కాక, మరో ఇరవయి శాతం మంది అయినా ప్రజారవాణాను ఉపయోగించుకునేవారుంటారు, అత్యవసర కారణాలతో ఎక్కువ వ్యయానికి సిద్ధపడి ఆస్పత్రులకు చేరగలిగి ఉంటారు. అట్లాగే, రకరకాల వ్యాపారాలు కూడా ప్రజారవాణా లేమి వల్ల దెబ్బతిని ఉంటాయి. గ్రామీణ జీవనానికి అవసరమైన కనెక్టివిటీ, నగరజీవనానికి అవసరమైన వేగం ఈ రెంటినీ ప్రజారవాణా వ్యవస్థలు నెరవేరుస్తాయి. వాటిని లాభనష్టాల ప్రాతిపదికమీద నిర్వహిస్తారా?

ఇప్పుడు ఆందోళన జరుగుతున్న శాంటియాగోలోనే కాదు, న్యూయార్క్‌, లండన్‌ వంటి మహానగరాలలో ప్రజారవాణావ్యవస్థ ప్రభుత్వ కార్పొరేషన్ల చేతిలోనే ఉన్నది. లండన్‌లో నిర్వహణ వ్యయంలో కేవలం 92 శాతం మాత్రమే ప్రయాణీకుల చార్జీల ద్వారా వస్తున్నది. తక్కిన 8 శాతం ప్రభుత్వమే భరిస్తున్నది. న్యూయార్క్‌లో మెట్రో, సిటీబస్‌, తదితర నగర ప్రజారవాణాసాధనాలన్నీ ఒకే సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఆ సంస్థలో భాగస్వాములెవరంటే, న్యూయార్క్‌ రాష్ట్రప్రభుత్వం, న్యూయార్క్‌ నగరపాలక సంస్థ, న్యూయార్క్‌లోని పోర్ట్‌ అథారిటీ. ఈ బహుళ ప్రజారవాణాసంస్థకు వరుసగా నష్టాలు వస్తున్నాయి. వాటిని న్యూయార్క్‌ రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేస్తున్నది.

ప్రభుత్వంలో విలీనం చేయాలి అన్నది ఒక డిమాండ్‌. కానీ, ఆ డిమాండ్‌ వెనుక ఉన్న కారణాలు ఇక్కడ పరిశీలించాలి. నిర్వహణ వ్యయంలో వస్తున్న లోటును భర్తీ చేయడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు పరిహారం ఇవ్వడం, ప్రభుత్వోద్యోగులతో కార్పొరేషన్‌ ఉద్యోగులకు ఉన్న వేతన వ్యత్యాసాలను లేకుండా చేయడం. ఈ కారణాలను భర్తీ చేయగలిగితే, విలీనమే జరగవలసిన పనిలేదు. అది ఒక సాంకేతిక అంశం మాత్రమే. ప్రభుత్వ కార్పొరేషన్లు తమ నిర్వహణను తామే సొంతంగా చేసుకోవాలన్నది ఒక సంప్రదాయమే అయినప్పటికీ, ప్రజారవాణాను ఆ కోవలోకి చేర్చకూడదు. సింగపూర్‌లో అనేక ప్రైవేట్‌ సంస్థల చేతిలో ప్రజారవాణా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏటా 400 కోట్ల సింగపూర్‌ డాలర్ల మేరకు సబ్సిడీలు ఇస్తున్నది. మౌలిక వ్యవస్థల కల్పనలో, కొత్త బస్సుల కొనుగోలులో కూడా పెట్టుబడులు పెడుతున్నది. ఇంగ్లండ్‌లో లండన్‌ మెట్రో ప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నా, సిటీబస్సులను జిల్లాలకు, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల నిర్వహణను 1980లలోనే, థాచర్‌ కాలంలో, ప్రైవేటీకరించారు. అయినా ఇప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం ఏటా 250 కోట్ల పౌండ్లకు మించి సబ్సిడీలు ఇస్తున్నది. ప్రైవేటీకరణ నుంచి వెనుకకు రావాలని, కిలోమీటరుకు ఇంత చొప్పున వేలం ద్వారా నిర్ణయించి, ఆ మేరకు ఆపరేటర్లకు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలని బ్రిటన్‌లో ఆలోచిస్తున్నారు. చార్జీల నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇతర వస్తుసేవల ధరలలాగా, రవాణా చార్జీలను మార్కెట్‌ లేదా నిర్వహణ వ్యయం ఆధారంగా నిర్ణయించడం కుదరదని, అవి అంతిమంగా రాజకీయంగా నిర్ణయించవలసిందేనని బ్రిటన్‌ కూడా గుర్తించింది. రాజకీయ నిర్ణయాల భారాన్ని కార్పొరేషన్ల నెత్తిన పడేయకూడదన్న తెలివిడి కూడా ఆ ప్రతిపాదనలో ఉన్నది.

ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వానికి బరువు తగ్గుతుందనుకోవడం పొరపాటు. ఆర్టీసీని వృత్తిపరంగా సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవడానికి ఎవరూ వ్యతిరేకులు కారు. కార్మికులు ఇప్పటికే నిర్ణీత సమయానికి మించి పని చేస్తున్నారు. ఇంకా చేయగలరు కూడా. వారికి న్యాయమైన వేతనాలు ఇవ్వడం, ప్రజారవాణాలో రాజకీయ అవసరాల కోసం ఇస్తున్న రాయితీలను భర్తీచేయడం, ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తున్న అనవసర ప్రాధాన్యాలను ఉపసంహరించడం– చేస్తే సంస్థ గాడిన పడుతుంది. ప్రభుత్వోద్యోగులతో ఉన్న వేతనాల అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించండి. ప్రజలకు చవుక రవాణా ఇవ్వడం కోసం శ్రమను చవుకగా కొనాలని చూడవద్దు. రెంటి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయండి. రాష్ట్రప్రభుత్వమో, స్థానికసంస్థనో, కార్పొరేషనో ఏదో ఒకటి సమష్టి యాజమాన్యం కింద ఉన్న రవాణావ్యవస్థతో ప్రజలకు ఒక అనుబంధం ఉంటుంది. ప్రగతికి చక్రం చిహ్నమే నిజమే, దానితో పాటు ప్రజాసేవయే మాకర్తవ్యము అన్న నినాదమూ ఆర్టీసీదే. బాధ్యత లేని వ్యాపారస్తుల చేతిలో దాన్ని పెట్టకండి.

ఆర్థికాభివృద్ధి ఆ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్న ప్రజారవాణాతో ముడిపడి ఉంటుంది. ఆర్థికచక్రం వేగవంతంగా తిరగాలంటే, ప్రజారవాణా ఉండాలి. విద్యార్థిని పాఠశాలకు, వినియోగదారుడిని దుకాణానికి, ఉద్యోగిని కార్యాలయానికి వారి జేబులను పెద్దగా బాధించకుండా తరలించగలిగే సాధనాలు ఉన్నప్పుడే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం.

RELATED ARTICLES

Latest Updates