రాజధాని స్టార్టప్‌ ఏరియాలోనే 1230 ఎకరాల అమ్మకం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* స్విస్‌ ఛాలెంజ్‌ ఒప్పందంలో ఇదే కీలకం
– అమరావతి బ్యూరో:
రాజధాని స్టార్టప్‌ ఏరియాలో అభివృద్ధికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందం ఫక్తు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమని తేలిపోయింది. ఈ ప్రాంతంలో 1691 ఎకరాల్లో అభివృద్ధికి పోనూ 1230.58 ఎకరాలు పూర్తిగా అమ్మకాలు నిర్వహించనున్నారు. ఇది సింగపూర్‌ కన్సార్టియం, అమరాతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పడిన అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌ ఆధ్వర్యాన జరగనుంది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారేగానీ ఎన్ని ఎకరాలు అమ్ముతారనే విషయం ఇంతవరకూ బయటకు రాలేదు. ఇటీవల అధ్యయన కమిటీ పర్యటన అనంతరం అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. మూడుదశల్లో 20 ఏళ్ల పాటు ఈ భూముల అమ్మకాలు జరుగుతాయి. స్టార్టప్‌ ఏరియా అభివృద్ది కోసం అక్కడ ఐకానిక్‌ టవర్లను నిర్మించి అనంతరం భూముల విలువను పెంచి వ్యాపారాలు సాగిస్తారు. ఒప్పందంలోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2017 మూడోతేదీన టెండర్లు పిలవగా, మే 15న కన్సార్టియంకు అవార్డు చేశారు. జూన్‌ ఏడోతేదీన కన్సెషన్‌ అగ్రిమెంటు చేసుకున్నారు. పిపిపి పద్ధతిలో సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్స్‌ (ఎస్‌ఎఐహెచ్‌) ద్వారా స్టార్టప్‌ ఏరియాను నిర్వహించనున్నారు. మొత్తం 1691 ఎకరాల్లో 459.62 ఎకరాల్లో సదుపాయాల కల్పన జరుగుతుంది. మిగిలిన 1230.58 ఎకరాలను మూడు దశలుగా అమ్ముతారు. తొలిదశలో 655.77 ఎకరాలు, రెండోదశలో 513.95 ఎకరాలు, మూడోదశలో 521.45 ఎకరాలు అమ్మనున్నారు. దీనిపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌, ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో ఉండటంతో భూమిని ఇంకా వారికి కేటాయించలేదని తెలిపారు. దీనిపై రెండు రోజుల క్రితం హైకోర్టు కూడా తీవ్రంగా వ్యాఖ్యానించింది. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని, పొడిగించడం కుదరదని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రభుత్వమూ సింగపూర్‌ కన్సార్టియంతో చర్చలు జరుపుతోంది. దీన్ని కొనసాగించాలా? వద్దా అనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కన్సార్టియం ప్రతినిధులూ ప్రభుత్వ అభిప్రాయం ఏమిటో చెప్పాలని కోరారు. రాజధాని పరిధిలో భూ అమ్మకాలు, లావాదేవీలు, ఒప్పందాల్లో అవకతవకలు ఉన్నాయని, దీనిపై విచారణ జరుపుతున్నామని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నివేదిక అనంతరం విచారణకు ఆదేశించే అవకాశమూ ఉంది. ఇవన్నీ జరిగేటప్పటికి కనీసం మూడేళ్లు పడుతుంది. మరోవైపు హైకోర్టుకు ప్రభుత్వ నిర్ణయం ఏమిటో చెప్పాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం చెబితే కన్సార్టియంకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. దీనిపైనే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గత ప్రభుత్వం అనాలోచితంగా ఒప్పందాలు చేసుకుందని, దీనిలో స్టార్టప్‌ ఏరియా ఒప్పందం ఉందని మంత్రి బొత్స ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విచారణ కమిటీ స్విస్‌ ఛాలెంజ్‌ ఒప్పందాన్ని కూడా పరిశీలించింది. దీనిలోనే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ భూమి మొత్తం అమ్మకానికి తప్ప ప్రభుత్వ ఆధ్వర్యాన గజం నేల కూడా ఉండదని తేల్చేశారు.

Courtesy Prajasakti..

RELATED ARTICLES

Latest Updates