బీఈఎంఎల్ ప్రయివేటీకరణ వద్దే వద్దు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మోడీ సర్కారు నిర్ణయంపై సంస్థ ఉద్యోగులు, కార్మికుల ఆందోళన
– రిలే దీక్షలతో కొనసాగుతున్న నిరసనలు
– కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాటం ఆపబోమంటూ స్పష్టీకరణ

న్యూఢిల్లీ : కార్మికులు, ఉద్యోగుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. కేవలం ప్రయివేటు వ్యక్తులు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను ఒక్కొక్కటిగా ప్రయివేటీకరిం చేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ‘భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌’ (బీఈఎంఎల్‌)ను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తున్నది. సంస్థలో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకొని అందులో అధిక వాటాను ప్రయివేటు కొనుగోలుదార్లకు అప్పనంగా కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నది. అయితే మోడీ సర్కారు నిర్ణయంపై బీఈఎంఎల్‌ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సంస్థను ప్రయివేటీకరిస్తే తమకు ఉద్యోగ భద్రత ఉండదని కేంద్రం నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంస్థను ప్రయివేటీకరించొద్దని ఈనెల 14 నుంచి పలు యూనియన్లు, అసోసియేషన్‌ల కార్మికులు, ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొంటూ తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.

బీఈఎంఎల్‌.. కార్మికుల ఆస్తి
బీఈఎంఎల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 26న బెంగళూరులోని యూనిట్‌ ముందు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ”బీఈఎంల్‌ కార్మికుల ఆస్తి.. దీనిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే హక్కు ఎవరికీ లేదు” అని ఈ సందర్భంగా కార్మికులు నినాదాలు చేశారు. ”కేంద్రం నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సంస్థను ప్రయివేటీకరిస్తే మాకు ఉద్యోగ భద్రత ఉండదు. ఎస్సీ, ఎస్టీ లు, వికలాంగులు వారికి హక్కుగా దక్కాల్సిన రిజర్వేషన్లను కోల్పోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. 51శాతం వాటాను ప్రభుత్వమే తన అధీనంలో ఉంచుకోవాలి” అని బీఈఎంఎల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డోమ్లూర్‌ శ్రీనివాస రెడ్డి డిమాండ్‌ చేశారు. బెంగళూరు కాంప్లెక్స్‌తో పాటు కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ కాంప్లెక్స్‌, మైసూరు కాంప్లెక్స్‌, పాలక్కడ్‌ కాంప్లెక్స్‌ ల వద్ద నిరసనకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
సీపీఐ(ఎం) ఎంపీ కె.కె రాగేశ్‌ ఈ ఏడాది జులైలో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమాధానమిస్తూ మోడీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించుకోవడం గమనార్హం. ”వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను కేంద్రం ‘సూత్రప్రాయంగా’ ఆమోదించింది. ప్రభుత్వ 54.03శాతం వాటాలో26శాతం వాటాను కొనుగోలుదారుకు అప్పగించాలని అంగీకరించింది” అని కేంద్ర మంత్రి వెల్లడించారు. వాస్తవ మార్కెట్‌ రేటు కంటే తక్కువ మొత్తంలో బీఈఎంఎల్‌ షేర్లు, ఆస్తులను కేంద్రం విక్రయిస్తున్నదనీ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వెనుక కుంభకోణానికి అవకాశం ఉన్నదని పాలక్కడ్‌ మాజీ ఎంపీ ఎంబి రాజేశ్‌ ఆరోపించారు. అంచనా ప్రకారం.. బీఈఎంఎల్‌ ఆస్తుల విలువ రూ. 50వేల కోట్లకు పైమాటే. బీఈఎంఎల్‌.. బెంగళూరులో 205 ఎకరాల భూమిని, మైసూర్‌లో 530 ఎకరాలు, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో 2400 ఎకరాలు, పాలక్కడ్‌లో 375 ఎకరాల భూమిని కలిగి ఉన్నది. కాగా, కేంద్రం నిర్ణయాన్ని కర్నాటకలోని గత సిద్ధరామయ్య ప్రభుత్వం, కేరళలోని పినరయి విజయన్‌ సర్కార్‌లు వ్యతిరేకించడం గమనార్హం.

సంస్థ లాభాల్లో ఉన్నప్పటికీ..
కంపెనీ సామర్థ్యాన్ని పెంచేందుకే పెట్టుబడుల ఉపసంహరణ, మేనేజ్‌మెంట్‌ నిర్వహణ బదిలీ అని కేంద్రం చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దీనికి విరుద్దంగా ఉన్నాయి. ఏడు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలను వెనక్కి నెట్టి అతి తక్కువ బిడ్‌ను కోట్‌ చేసి రూ. 3,015 కోట్ల ముంబయి మెట్రో కారిడార్‌ ఆర్డర్‌ను బీఈఎంఎల్‌ సొంతం చేసుకున్నదని కేంద్రం వెల్లడించిన సమాచారాన్ని బట్టి తెలిసింది. ఇటీవల రూ. 23.56 కోట్లను కేంద్రం పెట్టుబడిగా పెట్టగా.. రూ. 200 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి బీఈఎంఎల్‌ చెల్లించిందని కంపెనీ ఉద్యోగి ఒకరు తెలిపారు. బీఈఎంఎల్‌ ప్రయివేటీకరణ విషయంలో జాతీయ భద్రతపై పలువర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే నిటి అయోగ్‌ సిఫారసుల మేరకే తాము ముందుకు వెళ్తున్నామని తన నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది. బీఈఎంఎల్‌ వ్యాపారాల వాటా దేశ రక్షణ రంగంలో 16.16శాతంగా ఉన్నది. అలాగే, రైల్‌, నెట్వర్క్‌ కంప్రైస్‌(31.12శాతం), మైనింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(52.27శాతం)లలో కూడా బీఈఎంఎల్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ” బీఈఎంఎల్‌ ఉత్పత్తుల గురించి ఆర్టీఐ కింద ప్రశ్నిస్తే.. భద్రతాపరమైన అంశం దృష్ట్యా అధికారులు సమాచారమే వెల్లడించరు. అలాంటిది ఈ సంస్థను ప్రయివేటు వ్యక్తులకు కేంద్రం ఎలా కట్టబెట్టాలనుకుంటున్నది” అని బీఈఎంఎల్‌ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి వరకు బీఈఎంఎల్‌ ప్రయివేటు వాటాదారుల్లో.. రిలయన్స్‌ గ్రూపునకు 11శాతం వాటా, కొటక్‌కు నాలుగుశాతం, విదేశీ పెట్టుబడుదారులకు 13శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీలో ఎల్‌ఐసీ కూడా ఒక వాటాను సొంతం చేసుకున్నది. బీఈఎంఎల్‌ కార్మికులు, ఉద్యోగుల భద్రతా దృష్ట్యా.. ‘ప్రయివేటు’ నిర్ణయాన్ని కేంద్రం పక్కనబెట్టాలనీ, అప్పటి వరకు తమ పోరాటాన్ని ఆపబోమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.

Courtesy: NT..

RELATED ARTICLES

Latest Updates