‘వెలుగు’ రాని పల్లె

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తెల్లావారక ముందే పల్లెలు నిద్ర లేస్తున్నాయి. పూరిపాకలో పెండను ఎత్తేసి.. బర్లకు మేతేసి రైతులు పాలు పిండుతున్నరు. ఆ పాలను క్యాన్లలో నింపుకొని పట్నంలో అమ్ముకొచ్చేందుకు తయారైతున్నరు. ఇంకొందరు మందురోజు రాత్రి కోసిన కూరగాయలను టౌనులో అమ్ముకొద్దామని నిలబడ్డరు. అప్పటికీ కొక్కొరొక్కో అంటూ తొలి కోడి కూసింది. ఆ కోడికూతతో పాటు ‘పోంయ్‌.. పోంయ్‌’ అంటూ బస్సు హారనే వినిపిస్త లేదు. పాల క్యాన్లు, కూరగాయల గంపలతో బసెక్కి పట్నం పోయి మధ్యాహ్నానికే మరో బస్సుల తిరిగొచ్చే సౌలతు ఇప్పుడు లేకపాయెనని రైతులు రంది పడుతున్నరు. పొద్దు పొద్దున్న లేత కిరణాలతో పలకరించే సూర్యుడి తీరుగనే వచ్చే ‘పల్లె వెలుగు’ బస్సు రాక 22 దినాలైంది. 

  • పొద్దు పొద్దున్నే వచ్చే పల్లె వెలుగు బస్సులేవి?
  • పాలు, కూరగాయలమ్మే రైతులు, వ్యాపారులకు సమస్య..
  • ఆర్టీసీ సమ్మెతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ

నాగర్‌కర్నూల్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పల్లె బతుకులు ఆగమాగమైతున్నయి. పల్లెలో 90శాతం మందికి యవుసమే ఆధారం. ఆ పంట ఉత్పత్తులు చేతికొచ్చి అమ్ముకునేదాంక రోజూ పాలు, కూరగాయలను అమ్ముకుంటూ వచ్చే పైసలతోనే బతుకును నడిపిస్తరు. బస్సుల బంద్‌తో ఇట్లాంటి రైతులకు ఇబ్బందులెదురవుతున్నయి. బస్సులు నడవకపోవడంతో రైతులు, చిన్న వ్యాపారులు ప్రైవేటు వాహనాలను ఎక్కుతున్నరు. ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్ల 50 కిలోల దాకా లగేజీని ఫ్రీగా అనుమతించేవారు. ఆపైన ఉన్న లగేజీకి వంద కిలోమీటర్ల దూరానికి 12రూపాలే తీసుకునేటోళ్లు. బస్సుల బంద్‌తో ఇపుడా ఆ పరిస్థితి లేదు. 50 కిలోల టమాటలను 20కిలోమీటర్ల దూరంలోని పట్నానికి తీసుకుపోయేందుకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో రూ.150 దాంకా తీసుకుంటున్నరు. అంతంత కిరాయి ఇస్తే తామెట్లా బతకాలె? అని రైతులు అంటున్నరు.

పాడి రైతుల పరిస్థితీ అంతే. రవాణా ఖర్చు పెరగడం, పాత ధరకే పాల అమ్మకాలను కొనసాగిస్తుండటంతో పాడి రైతులు కూడా నష్టపోతున్నరు. పట్నాల నుంచి సరుకులు తెచ్చుకొని చిన్న చిన్న కిరాణ దుకాణాలను నడిపేటోళ్లు.. పట్నంల జరిగే అంగళ్లలో గొర్రెలు, మేకలు, కోళ్లను అమ్ముకునే బడుగులు.. పంటలకు ఎరువులను పట్నాల నుంచి తెచ్చుకునే రైతులు.. శుభకార్యాలు, అశుభకార్యాలకు బంధువుల ఇళ్లకు పోవాల్సిన వారు.. రోగం, నొప్పితో దవాఖానాకు పోవాలనుకున్న వారు.. బడులు, కాలేజీలకు పోయే పిల్లలు బంద్‌తో గోస గోస పడుతున్నరు. ప్రైవేటు వాహనదార్ల చేతుల్లో దోపిడీకి గురవుతున్నరు.

ఆటో కిరాయి 800 అయింది
పల్లిపంటకు ఎరువులు తెచ్చుకునేందుకు దసరా మండగ ముందు కందనూలు (నాగర్‌కర్నూల్‌)కు పోయిన. బస్సులు నడ్వకపోవడంతో ఆటోలోనే తెచ్చిన. కందనూలుకు మా ఊరు 15 కిలోమీటర్ల దూరం. దానికి ఆటోవోడు సంచికి వంద రూపాల లెక్కన రూ.800 తీసుకున్నడు. అదే ఆర్టీసీ బస్సులో తెచ్చుంటే నా బస్‌ కిరాయి, లగేజీ చార్జీ అంతా రూ.100లోపే అయ్యేది. బస్సులు నడ్వకపోవడంతో మేం ఇట్లా ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలె.
– రామస్వామి, రైతు,చంద్రకల్‌, పెద్దకొత్తపల్లి మండలం

గిట్టుబాటైత లేదు
నేను ఎకరం పొలంల టమాట, పచ్చిమిర్చి, బెండకాయ, గోకరకాయ సాగు చేసిన. కూరగాయలు అమ్ముకునేందుకు రోజూ నాగర్‌కర్నూల్‌ రైతు బజారుకు బస్సుల వస్తుంటా. దసర పండుగ ముందు నుంచి మా ఊరికి బస్సులు బంద్‌ అయినయి. దీంతో ఆటోలోనే కూరగాయలను తీసుకపోతున్న. దినాం నాలుగైదు మూటలను మార్కెట్‌కు తెస్తుంటా. ఏమీ గిట్టుబాటైత లేదు.
– అలివేలు, చందుబట్ల, నాగర్‌కర్నూల్‌ మండలం

Courtesy Andhra Jyothy

RELATED ARTICLES

Latest Updates