ప్రజల తిరస్కారమిది..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆర్టికల్‌ 370 రద్దు, కాశ్మీర్‌పై ఓటర్ల తీర్పు !
– మోడీ సర్కార్‌కు మొదటి హెచ్చరిక!
– ఎన్నికల ఫలితాల్లో వ్యక్తమైన ఆర్థిక సంక్షోభం : రాజకీయ విశ్లేషకులు
– బెడిసికొట్టిన… ఆర్థికసంక్షోభాన్ని దాచే ప్రయత్నం

రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పు బీజేపీకి మింగుడుపడటం లేదు. ఎన్‌ఆర్‌సీ, ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌ విభజన, పాకిస్తాన్‌తో వైరం…వంటి అంశాలపై ప్రజలిచ్చిన ‘రెఫరెండం’ ఇది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన స్థానాల్నే కాదు, ఓటింగ్‌ శాతాన్ని సైతం కోల్పోయింది. జాతీయ అతివాదంతో ఆర్థిక సంక్షోభాన్ని దాచే ప్రయత్నం చేసిన అమిత్‌ షా, ప్రధాని మోడీలకు ప్రజలు జారీచేసిన మొదటి హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

న్యూఢిల్లీ : పోల్‌ సర్వేలు, రాజకీయ పండితులు సైతం ఊహించని తీర్పును మహారాష్ట్ర, హర్యానా ఓటర్లు ఇచ్చారు. 11 కోట్లకుపైగా జనాభా ఉన్న పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర ఇచ్చిన తీర్పు బీజేపీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు. ఎన్‌ఆర్‌సీ తీసుకొస్తాం, ఆర్టికల్‌ 370 రద్దు, కాశ్మీర్‌ విభజన, పాకిస్థాన్‌తో పోరు…వీటికి ఓటర్లు లొంగలేదు. బీజేపీ సీట్లను, ఓట్లను తగ్గించారు. బీజేపీకి 2014లో 27.8 శాతం, 2019లో 25శాతం వచ్చాయి. సీట్లు సైతం గణనీయంగా తగ్గాయి. మిత్రపక్షం శివసేన ఓట్ల శాతం కూడా 19.4 శాతం నుంచి 17శాతానికి తగ్గింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు ప్రస్తావించిన అంశాలు ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌ విభజన, పాకిస్థాన్‌ అంశాలు…ఓటర్లు అంగీకరించ లేదని స్పష్టంగా తేలింది.
హర్యానాలో కనీసం మెజార్టీని కూడా నిలబెట్టుకోలేకపోయారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వంలోని ఏడుగురు మంత్రులు ఓడిపోయారు. సహజంగా ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ అంశాలకు హర్యానా ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌ విభజన, ఎన్‌ఆర్‌సీ…లతో తమ విజయం నల్లేరుమీద నడక అన్నట్టు అమిత్‌ షా, ప్రధాని మోడీ భావించారు. కానీ వారి విధానాలు తప్పు అని ప్రజలు తీర్పు చెప్పారన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

ఓటర్లు ఎవరి మాట నమ్మారు?
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రచారాన్ని, ప్రతిపక్షాల ప్రచారాన్ని ఒకసారి పోల్చిచూస్తే, బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్లు అనదగ్గ అమిత్‌ షా, ప్రధాని మోడీ ఉన్నారు. ప్రతిపక్షాల్లో అలాంటి వ్యక్తులు లేరు. ప్రతిపక్షాల నాయకులు స్థానిక అంశాలనే ప్రస్తావించారు. అయినా…ప్రతిపక్షాల వైపే ఓటర్లు ఎక్కువగా మొగ్గుచూపారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఉగ్రవాదం, పాకిస్థాన్‌, ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌ విభజన…అంశాలతో ఆర్థికమాంద్యం దాచే ప్రయత్నం బీజేపీ చేసింది. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలుజేసి, అక్రమ వలసదారుల్ని వెళ్లగొడతామనటం, వీర్‌ సావర్కార్‌కు భారతరత్న ఇస్తామనటం ద్వారా మహారాష్ట్రలో భావోద్వేగాల్ని రగలించే ప్రయత్నం చేశారు.

ఆర్థిక సంక్షోభం కనపడటం లేదా?
మోడీ సర్కార్‌ అనుసరించిన ఆర్థిక విధానాలు దేశాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నది అందరికీ తెలిసిందే. అయితే దీనిని దాచిపెట్టేందుకు అధికార బీజేపీ రకరకాల ఫీట్లు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్థికంగా అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిది. ఇక హర్యానా చిన్నరాష్ట్రమే అయినా, ఆర్థికపరంగా దేశంలో 13వ స్థానంలో ఉంది. పారిశ్రామికంగా ముందున్న రాష్ట్రాలు ఇవి. అందుకనే ఆర్థిక సంక్షోభ ప్రభావం ప్రజలపై నేరుగా పడిందనీ, అది ఓట్లరూపంలో స్పష్టంగా కనపడిందనీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక, చేతిలో డబ్బులులేక ప్రజలు నానా అవస్త పడుతున్నారు. ఇవేమీ పెద్ద విషయాలు కాదన్నట్టుగా అమిత్‌ షా, ప్రధాని మోడీ చేసిన ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆలోచనలో పడేసింది. ఓటుతో సమాధానం చెప్పాలనుకున్నారు.

Courtesy: NT..

RELATED ARTICLES

Latest Updates