మంత్రిగా లాభాలు తెచ్చి సీఎంగా తేలేరా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కేసీఆర్‌కు నాగేశ్వర్‌ ప్రశ్న
– ఆర్టీసీ నష్టాలెన్నో అధికారులు ప్రకటించాలి
– 1,200 కోట్లన్న సీఎం,రూ.928 కోట్లన్న రవాణామంత్రి
– ప్రజారవాణాపై పన్నుల భారం తీసేస్తే లాభాలు
– సమ్మె కార్మికుల రాజ్యాంగహక్కు : హరగోపాల్‌
– హైదరాబాద్‌
రవాణా శాఖ మంత్రిగా అదీ చంద్రబాబు హయాంలో ఆర్టీసీకి లాభాలు తెచ్చినపుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా సర్వసత్తాక అధికారాలున్నపుడు ఎందుకు తేలేరని కె చంద్రశేఖర్‌రావును మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ ప్రశ్నిం చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ సమ్మె-వక్రీకరణలు-వాస్తవాలు’అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన నాగేశ్వర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలు ఏటా రూ.1,200 కోట్లని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ అధికారులు రవాణామంత్రికి పంపిన నివేదికలో నష్టాలు రూ.928 కోట్లని పొందుపరిచారని చెప్పారు. ఆర్టీసీ నష్టాలెన్నో అధికారులు వాస్తవాలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ నాశనమైందని సీఎం అంటుంటే, 2014 తర్వాత ప్రగతిపథంలో నడుస్తున్నదని ఆ నివేదికలో ఉందని గుర్తు చేశారు. సీఎం చెప్పిన లెక్కలా? లేక మంత్రికి ఇచ్చిన నివేదికలో అంశాలు వాస్తవమా?అన్నది ప్రకటించాలన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో ఆర్టీసీ లేదని చెప్తున్న సీఎం, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి చేస్తున్న సాయం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అమెరికాలోనూ ప్రజారవాణాకు ప్రభుత్వం నిధులిస్తుందని వివరించారు. ఆర్టీసీకి రూ.4,250 కోట్లు ఇచ్చామంటున్నారని చెప్పారు. కానీ డీజిల్‌ వ్యాట్‌, ఎంవి ట్యాక్స్‌, టైర్లు, విడిభాగాల పన్నుల రూపంలో ఏటా ప్రభుత్వం ఎంత తీసుకుంటున్నదో చెప్పడం లేదన్నారు. 2018-19లో ఆర్టీసీ డీజిల్‌పై రూ.1,383 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇందులో వ్యాట్‌ పేరుతో రూ.350 కోట్లు ప్రభుత్వానికి చెల్లించిందని వివరించారు. ఎంవి యాక్ట్‌ పేరుతో రూ.300 కోట్లు ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లిస్తుందని అన్నారు. టైర్లు, విడిభాగాల కొనుగోలుపై రూ.150 కోట్లు పన్నుల రూపంలో కడుతుందన్నారు. ఏటా ప్రభుత్వానికి రూ.800 కోట్లు చెల్లిస్తుందని వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఆర్టీసీ ఏటా రూ.180 కోట్ల వరకు బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సి వస్తున్నదని అన్నారు. మొత్తం రూ.980 కోట్లు ఆర్టీసీ ప్రభుత్వానికి, బ్యాంకులకు కడుతుందని వివరించారు. డీజిల్‌పై వ్యాట్‌, ఎంవీ యాక్ట్‌ పేరుతో ఎక్సైజ్‌ డ్యూటీ, టైర్లు విడిభాగాలకు పన్నులను తీసేస్తే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు. ప్రజారవాణాపై పన్ను ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులను వస్తురవాణాకు వినియోగిస్తే రూ.200 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.
సీఎం మాటలకు భయపడొద్దు : హరగోపాల్‌
ప్రజాస్వామ్యంలో చర్చలు పునాది అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. నియంతృత్వం, అప్రజాస్వామికంగా చర్చించే ప్రసక్తే లేదని ప్రకటిస్తే ఆంధ్ర పాలకులకు సీఎం కేసీఆర్‌కు తేడా ఏంటని ప్రశ్నించారు. ఆదర్శమైన నమూనా తెలంగాణను నిర్మించాలని సూచించారు. ఎలాంటి తెలంగాణను నిర్మించిందో చరిత్రలో లిఖించబడుతుందని చెప్పారు. ఉమ్మడి పాలన కంటే తెలంగాణలో విధ్వంసం జరిగిందని రాయడం ఇష్టమా?అని అడిగారు. రాజ్యాంగాన్ని ఖాతరు చేయనంటే ఎలా?అని అన్నారు. తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు సమ్మె హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. తెలంగాణ ఉద్యమం రాజ్యాంగబద్ధమేనా?అని అడిగారు. ఆ ఉద్యమాన్ని ఏ హక్కుతో చేశారో, ఆర్టీసీ కార్మికులు అదే హక్కుతో సమ్మె చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ మాటలతో కార్మికులు భయపడొద్దని చెప్పారు. బలహీనులే భయపెట్టాలని చూస్తారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ నష్టాలకు సీఎం బాధ్యత వహించాలని కోరారు. ప్రజారవాణాను లాభన ష్టాలతో పోల్చొద్దని సూచించారు. రూ.1.46 లక్షల కోట్లలో ప్రజల కోసం ఆర్టీసీకి రూ.500 కోట్లు ఇవ్వల ేరా?అని ప్రశ్నించారు. ఎన్నికలే ప్రజాస్వామ్యం కాద ని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ భాగమని అన్నారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఈనెల 30న సకల జనుల సమరభేరి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజరుకుమార్‌యాదవ్‌ (ఐఎన్‌టీయూసీ), విఎస్‌ బోస్‌ (ఏఐటీయూసీ), ఎం సాయిబాబు (సీఐటీయూ), కె సూర్యం (ఐఎఫ్‌టీయూ), బాబురావు (ఏఐయూటీయూసీ), ఎం శ్రీనివాస్‌ (ఐఎఫ్‌టీయూ), ఎంకె బోస్‌ (టీఎన్‌టీయూసీ), విఎస్‌ రావు, ఎస్‌ బాబు (ఆర్టీసీ జేఏసీ), చావ రవి (టీఎస్‌యూటీఎఫ్‌), భుజంగరావు, సదానందంగౌడ్‌ (ఎస్టీయూ), రఘునందన్‌ (టీటీఎఫ్‌), వై అశోక్‌కుమార్‌ (టీపీటీఎఫ్‌), భూపాల్‌, జె వెంకటేశ్‌, పాలడుగు భాస్కర్‌ (సీఐటీయూ) తదితరులు పాల్గొన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates