ఆర్టీసీ కార్మికులకు దీపావళి లేనట్లే!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • కోర్టు సూచించినా… అందని వేతనాలు
  • 21వ రోజూ కొనసాగిన కార్మికుల దీక్షలు

ఆర్టీసీ కార్మికులకు దీపావళి వెలుగులు లేనట్లే. దసరా పండుగను ఎలాగూ జరుపుకోలేకపోయారు. కనీసం దీపావళి నాటికైనా సమ్మెకు విరమణ లభిస్తుందని భావించారు. కానీ… ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు. సెప్టెంబరు నెల వేతనాలు ఇప్పటివరకు అందలేదు. దీంతో దీపావళి పండుగ కూడా కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపలేని పరిస్థితి నెలకొంది. శుక్రవారం నాటికి సమ్మె 21వ రోజుకు చేరింది. ఇంత సుదీర్ఘంగా సమ్మె కొనసాగుతుండడం పట్ల కార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సమ్మెను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మరో పక్క కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబరు నెల వేతనాలను కూడా చెల్లించలేదు. పని చేసిన కాలానికి తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు కూడా సూచించింది. కానీ… వేతనాల కోసం రూ.230 కోట్లు కావాలని, అంత డబ్బు ఆర్టీసీ వద్ద లేదని, కేవలం రూ.7 కోట్లు మాత్రమే నగదు ఉందంటూ కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది. కానీ… కార్మిక సంఘాలు మాత్రం దీనితో విభేదిస్తున్నాయి. కార్మికులు, అధికారులందరికీ కలిపి ప్రతి నెలా వేతనాల కోసం రూ.110 కోట్లే వెచ్చిస్తారని వివరిస్తున్నాయి.

మరోవైపు ఆర్టీసీ సమ్మె 21వరోజూ ఉధృతంగా సాగింది. ఆర్టీసీని కాపాడడం ప్రపంచంలో ఎవరివల్లా కాదంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వాఖ్యలపై కార్మికులు భగ్గుమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద దీక్షలు కొనసాగించారు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం డిపో పరిధిలో వంటావార్పు కార్యక్రమాలతో నిరసన తెలిపారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. సంగారెడ్డిలోని ప్రధాన రహదారి గుండా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ వెళ్తుండగా ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. సిద్దిపేటలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కార్మికులకు దీక్షా శిబిరం వద్ద సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. నల్లగొండజిల్లా నర్సాపురం గ్రామానికి చెందిన రమావత్‌ దీప్లా హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమ్మెపై ప్రభుత్వం స్పందించక పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యచేసుకునేందుకు సెల్‌టవర్‌ ఎక్కగా స్థానికులు నచ్చజెప్పి దింపారు.

Courtesy Andhra jyothy..

RELATED ARTICLES

Latest Updates