డెంగీ కోరల్లో తెలంగాణ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  •  8,516 కేసులతో దేశంలో రెండో స్థానం
  •  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి
హైదరాబాద్‌: దేశంలో డెంగీ విజృంభణలో తెలంగాణ 8,516 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. పొరుగున ఉన్న కర్ణాటక 13,200 కేసులతో తొలి స్థానంలో ఉంది. ఉత్తరాఖండ్‌ 8,301 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. ఈ వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ సీజన్‌లో 76,000 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. మొత్తం 58 మంది మరణించగా, తెలంగాణలో మాత్రం ఇద్దరే చనిపోయినట్లు వెల్లడించింది. డెంగీ నివారణ విషయంలో హైకోర్టు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టడం తెలిసిందే. ఇదే సమయంలో డెంగీ కేసుల్లో రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న డెంగీ ప్రధానంగా హైదరాబాద్‌లోనే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే ఈ ఏడాది జనవరి 1 నుంచి శుక్రవారం వరకు 1,915 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత 1,733 కేసులతో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ లెక్కల ప్రకారం 40,434 డెంగీ అనుమానిత కేసుల నుంచి నమూనాలను సేకరించగా 8,516 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
డెంగీ కారణంగా చనిపోయిన వారిలో ఒకరు ఆదిలాబాద్‌, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. కాగా, గద్వాల జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 9 కేసులే నమోదు అయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాలు మినహాయించి మిగతా చోట్ల డెంగీ తీవ్రత కనిపిస్తూనే ఉంది. వారం రోజుల నుంచి రోజుకు సగటున 80-85 కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా హైదరాబాద్‌, ఆ తరువాత ఖమ్మం జిల్లాలో నమోదవుతున్నాయి. నవంబరు వస్తున్నా రాష్ట్రంలో ప్రతి రోజూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షపు నీరు నిలిచిపోవడం, దోమల ఉద్ధృతితో డెంగీ కేసుల సంఖ్య తగ్గడం లేదు.
కేంద్ర బృందం రాక
తెలంగాణలో డెంగీ తీవ్రత, రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యుల కేంద్రబృందం శుక్రవారం రాష్ట్రానికి వచ్చింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసింది. ఆ బృందంలో నేషనల్‌ వెక్టర్న్‌బోర్న్‌, డిసీజ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుమన్‌ లతా వటల్‌, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ అధికారి కౌశల్‌ కుమార్‌, ఎన్‌సీడీసీ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రణవ్‌ కుమార్‌ వర్మ, ఎపిడిమాలజీ కన్సల్టెంట్‌ సాహిత్‌ గోయల్‌ ఉన్నారు. సీఎ్‌సతో భేటీ అనంతరం గ్రేటర్‌లో పలు ప్రాంతాలను ఆ బృందం సందర్శించింది. రోజూ వర్షాలు పడుతుండటంతో కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ బాగా పనిజేస్తున్నా, ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ బృందం అభిప్రాయపడింది. డెంగీని అదుపు చేయకపోతే దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
దోమల నిర్మూలనకు కార్యాచరణ: సీఎస్‌
రాష్ట్రంలో కీటక జనిత వ్యాధుల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్‌ జోషి ఆదేశించారు. శుక్రవారం బీఆర్కే భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. దోమల నిర్మూలనకు, జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
Courtesy Andhra Jyothy..

RELATED ARTICLES

Latest Updates