చర్చలకు సై

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరింది. సమ్మెపై 28వ తేదీన హైకోర్టు మలి
విచారణ ఉంది. చర్చల సారాంశాన్ని అప్పటికి నివేదించాలని కోర్టు నిర్దేశించింది.
ఈ నేపథ్యంలో కార్మిక నేతలతో చర్చలకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై పరిమిత చర్చకు
అంగీకరించింది! కార్మిక సంఘాలతో నేడే ఈ చర్చలు జరగనున్నాయి.
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌
  • ఇన్‌చార్జి ఎండీ, ఈడీలకు ఆదేశం.. నేడు 11కు బస్‌ భవన్లో భేటీ
  • విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపైనే చర్చ
  • నివేదిక ఇచ్చిన ఈడీల కమిటీ.. సుదీర్ఘంగా సమీక్షించిన కేసీఆర్‌
హైదరాబాద్: దీపావళి అమావాస్య ముందు ఒక వెలుగు రేఖ! ‘చర్చల్లేవ్‌.. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మిక సంఘాలతో చర్చలకు అనుమతించారు. విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందిగా ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటలకు బస్‌ భవన్‌లో ఈ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ తదితర 26 డిమాండ్లతో కార్మికులు ఈనెల 5వ తేదీ నుంచి సమ్మెను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో 21 డిమాండ్లు పరిష్కరించదగినవేనని, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టి, పరిష్కరించాలంటూ హైకోర్టు ధర్మాసనం సూచించింది.
ఈనెల 28న జరిగే తదుపరి విచారణ కల్లా చర్చల సారాంశాన్ని వివరించాలని నిర్దేశించింది. దాంతో, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఈడీలు, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌తో ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడు రోజులుగా డిమాండ్లపై అధ్యయనం చేసింది. వీటిలో ప్రభుత్వం, యాజమాన్యం పరిధుల్లోకి వచ్చే సమస్యలను విభజించింది. ఆర్థిక చిక్కులున్న సమస్యలు, వాటితో పడే ఆర్థిక భారం తదితర వివరాలను సేకరించింది. ఈ వివరాలతో కూడిన పూర్తి నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మతో భేటీ అయి నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలోనే, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సునీల్‌ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సమీక్షలో తేల్చారు. హైకోర్టు సూచించిన 21 డిమాండ్లలో 12 వరకు డిమాండ్లకు పెద్దగా ఆర్థికపరమైన చిక్కులు లేవన్న నిర్ధారణకు వచ్చారు.
వీటిపై కార్మిక జేఏసీతో చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే.. చర్చల సందర్భంగా, కార్మిక సంఘాలు సూచించే ఇతర డిమాండ్లనూ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. కండక్టర్‌, డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు మార్గదర్శకాల రూపకల్పన, పీఎఫ్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ ట్రస్టుల విభజన, అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం బస్సులను నడపడం, గ్యారేజీ కార్మికులకు పని భారం తగ్గింపు వంటి ఆర్థికపరమైన చిక్కులు లేని సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వడం, ఆసరా పింఛన్ల అందజేత, ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని కల్పించడం వంటి డిమాండ్లపై కార్మిక సంఘాల అభిప్రాయాలు తీసుకోనున్నారు. వీటిపై ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున.. కార్మిక నేతల అభిప్రాయాలను మళ్లీ ప్రభుత్వానికి నివేదిస్తారు. తార్నాక ఆస్పత్రి, ఇతర డిస్పెన్సరీలకు మందుల సరఫరా, తార్నాక ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దడం, రిఫరల్‌ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపు, తల్లిదండ్రులకు వైద్య సదుపాయాల కల్పన, డబుల్‌ డ్యూటీలకు డబుల్‌ వేజెస్‌, పీఎఫ్‌ సొమ్ము నుంచి రుణాలు తీసుకునే వెసులుబాటు వంటి ఆర్థికపరమైన సమస్యలపై సంఘాల నుంచి వివరాలు కోరే అవకాశాలున్నాయి.
Courtesy andhra Jyothy..

RELATED ARTICLES

Latest Updates