నమ్ముకున్న వృత్తి.. నడిరోడ్డుపై జీవితాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పెద్ద దిక్కు కోల్పోయిన ఆర్టీసీ కుటుంబాలు
– పిల్లల భవిష్యత్తు.. చదువులపై ఆందోళన
– జీతాలు రాక భారమైన పోషణ
– ఒక్కో ఇంటిది ఒక్కో గాథ.. తీరని వ్యథ
ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోజురోజుకూ ఆగమవుతున్నాయి. ఇప్పటికే పెద్దదిక్కులను కోల్పోయిన బాధిత కుటుంబాలు పిల్లల భవిష్యత్తు, కుటుంబ పోషణ తలుచుకుంటూ ఆందోళనకు గురవుతున్నాయి. సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో మనస్తాపానికి గురై గుండెలు పగిలి కొందరు.. ఆత్మహత్యలు చేసుకొని ఇద్దరు మృతిచెందడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. గత నెల జీతాలు రాక దినదిన గండంగా వెళ్లదీస్తుండగా.. మృతుల కుటుంబాల్లో ఒక్కోక్కొరిది ఒక్కో గాథ వినిపిస్తున్నది. ‘నవతెలంగాణ’ వారిని పలకరించగా కన్నీటి కథలే కనిపిస్తున్నాయి.
నవతెలంగాణ-మొఫిసిల్‌ యంత్రాంగం
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం గీసుకొండ మల్లయ్య నల్లగొండ డిపోలో ఏడీసీగా పని చేస్తున్నాడు. 1987లో యాద గిరిగుట్ట డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేపట్టాడు. వృత్తినే నమ్ముకున్న మల్లయ్య అంకితభావంతో పనిచేసి 2009లో అడిషనల్‌ డిపో క్లర్కుగా నల్లగొండ డిపోలో విధులు నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఆయనకు ప్రతి నెలా కటింగులు రూ.25 వేలు మాత్రమే వస్తుంది. మల్లయ్యది పేద కుటుంబం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. ఎంతో
కష్టపడి కూతుళ్ల పెండ్లి చేశాడు. భార్యకు చికిత్స చేయించేందుకు రూ.2 లక్షలు, కుమారుల చదువుల కోసం మరో లక్ష కలిపి మొత్తం 6 లక్షల వరకు అప్పులు ఉంది. పెద్దబ్బాయి డిగ్రీ, చిన్నబ్బాయి ఇంటర్‌ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. అక్టోబర్‌ 15న సమ్మె వార్తలు చూసి మనో వేదనకు గురయ్యాడు. నార్కట్‌పల్లి, అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని గాంధీకి తరలించగా పరిస్థితి విషమించి 19న మరణించాడు. కుటుంబం స్థిర పడకపోవడం కలచివేస్తున్నది.
అందరి మేలు కోరి.. ఉద్యమాన్ని రగిల్చి..
50 వేల మంది ఆర్టీసీ కార్మికులు బాగుండాలని ఆశించిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన డి.శ్రీనివాసరెడ్డి తన ఆత్మహత్యతో ఉద్యమాన్ని రగిల్చాడు. 29 ఏండ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నా అతి తక్కువ వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. కుటుంబ పోషణ కోసం డబుల్‌ డ్యూటీలు, ఓవర్‌ టైం డ్యూటీలు సైతం చేసేవారు. ఇంటిల్లిపాదితో ఆనందంగా గడిపిన ఆయన సీఎం కేసీఆర్‌ వైఖరితో ఆందోళనకు గురై పెట్రోల్‌ పోసుకుని అక్టోబర్‌ 12న బలిదానమయ్యాడు. ఇతరుల క్షేమాన్ని కోరే ఇంటి పెద్ద లేకుండా పోయాడని కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది.
కుమారుడు నిరుద్యోగి.. పెండ్లి కూడా కాలేదు..
జగ్గయ్యపేటలోని డాంగీనగర్‌కు చెందిన షేక్‌ ఖాజామియా (55) 1989లో డ్రైవర్‌గా చేరాడు. సమ్మెలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. ఉద్యోగం ఉంటుందో పోతుందోననే ఆందోళనతో ఆదివారం గుండెపోటుతో మరణించడంతో ఇల్లు ఒంటరైంది. ఇద్దరు కుమారులున్నప్పటికీ కష్టపడి ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చేమార్గం లేకుండా పోయిందని మృతుని భార్య కరీమూన్‌ ఆవేదనకు గురవుతున్నారు. చిన్న కుమారుడికి ఇంకా వివాహం కాలేదనీ, నిరుద్యోగి కావడం వల్ల ఇంటిని ఎలా నెట్టుకొచ్చేదనీ వాపోతున్నది.
తల్లిని కోల్పోయిన పిల్లలు
జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం కూనూర్‌ గ్రామం రంగు సందీప్‌ హన్మకొండ లోకల్‌ డిపో డ్రైవర్‌. ఆయన భార్య శ్రీలత(30)కు ఇద్దరు కుమారులున్నారు. సీఎం కేసీఆర్‌ సెల్ఫ్‌ డిస్మిస్‌ ప్రకటన ఆ కుటుంబంలో అలజడి రేపింది. భర్త ఉద్యోగం పోతే కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలా అని తీవ్ర మనోవేదనకు లోనైంది. సెప్టెంబర్‌ నెల జీతం కూడా రాకపోవడంతో ఇల్లు గడవడం కూడా కష్టమైంది. ఒత్తిడి ఎక్కువై గుండిపోటుతో 16న మరణించింది. దీంతో చిన్న పిల్లలు కూడా తల్లిలేని వారయ్యారు.
వారికి పాస్‌బుక్‌, రైతుబంధూ దూరమైంది
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌ మండలం గోలిలింగాల్‌కు చెందిన మహ్మద్‌ గఫ్రొద్దీన్‌ (36) కుటుంబం నిరుపేద. భార్య, ఆరు నెలల కూతురుతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు ఆయన సంపాదనమీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఉద్యోగం పోయినట్టేనని ప్రకటన విని మనోవేదనకు గురయ్యాడు. సోమవారం వరకూ వేతనం వస్తుందని ఎదురుచూసినా జీతాల్లేవని చెప్పడంతో ఆర్థిక సమస్యలు తొలగేట్టు లేవని భయాందోళనకు గురయ్యాడు. వార్తలు చూస్తే గుండెపోటుతో కూలిపోవడంతో కుటుంబీకులు గుండెలు బాదుకున్నారు. నాలుగున్నర గుంటల భూమి ఉండగా, భూ ప్రక్షాళన తర్వాత పట్టాపాస్‌పుస్తకం అందజేయలేరు. రైతుబంధూ వారికి దూరమైంది.
ఇప్పటిదాకా బంధువులు, ఇతరులే అండ..
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని బొంబాయి కాలనీకి చెందిన హెచ్‌సీయూ డిపో డ్రైవర్‌ షేక్‌ ఖలీల్‌మియా (50) ఈ నెల 10న గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబం వీధిన పడింది. భార్య, ఇద్దరు కుమార్తెలు, కూమారుల్లో పెద్ద కూతురికి పెండ్లి చేశారు. మిగతా పిల్లల చదువు కోసం రూ.10 లక్షల అప్పులు చేయగా.. ఇల్లు తప్ప మరే ఆస్తిపాస్తుల్లేవు. ఇప్పటివరకు బంధువులు, ఇతరులే ఆదుకుంటున్నారు. నెల జీతం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు.
తండ్రి జీతం చాలక ఆగిన చదువు..
రాణిగంజ్‌-2 డిపోకు చెందిన కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ మరణంతో భార్య బి.జ్యోతి, కొడుకు సంకీర్తన్‌గౌడ్‌, కూతురు సుప్రియా నా అనేవాళ్లు లేకుండా పోయారు. కూతురికి వివాహం కాగా కొడుకు ఇంటర్‌ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. తండ్రి వేతనంతో కుటుంబం గడవటం కష్టమవడంతో చదువు మానేసి ప్రయివేటుగా బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. సురేండర్‌ 15 ఏండ్లుగా విధుల్లో ఉన్నా అద్దె ఇల్లే వారి నివాసం. ఇప్పుడు తండ్రే లేకపోవడంతో కుటుంబ భారం కుమారుడిపై ఉంది.

ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన బూడిద జంగయ్య (52) గుండెపోటుతో ఈ నెల 15న మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురున్నారు. ఇబ్రహీపట్నం డిపోలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భార్య బూడిద సుగుణమ్మ, పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌ బిటెక్‌ చదుకున్నాడు. కూతురు విజయ ఇంటర్మిడియట్‌ చదవుతోంది. చిన్న కుమారుడు వెంకటేశ్‌ పదో తరగతి చదువుతున్నాడు. ఉద్యోగపరంగా ఎవరూ ఆదుకునే స్థితిలో తన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె విన్నవిస్తున్నది.
– బూడిద సుగుణమ్మ

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates