మనసు రగిలి.. గుండె పగిలి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • పిట్టల్లా రాలుతున్న ఆర్టీసీ సిబ్బంది
  • ఇప్పటికే ఇద్దరు డ్రైవర్ల ఆత్మహత్య..
  • ఏడుగురు గుండెపోటుతో మృతి
  • కుటుంబ సభ్యులూ మృత్యువాత
  • పెరుగుతున్న మానసిక ఆందోళన, ఒత్తిడి
  • సెప్టెంబరు వేతనాలు రాక ఆర్థిక సమస్యలు
  • పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేక సతమతం
హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌ గ్రామానికి చెందిన సిద్దగోని రమేశ్‌ గౌడ్‌ ముషీరాబాద్‌-1 డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 18 రోజులుగా జరుగుతున్న సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నాడు. సెప్టెంబరు నెల వేతనం అందకపోవడంతో ఆయన కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో రెండు మూడు రోజులుగా రమేశ్‌ తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నాడు. సమ్మెపై ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం.. వేతనం అందకపోవడంతో బుధవారం మానసికంగా మరింత కుంగిపోవడంతో గుండెపోటుతో మృతి చెందాడు.
ఇది ఒక్క రమేశ్‌ పరిస్థితి
మాత్రమే కాదు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న 48 వేల మంది కార్మికుల గోస! ఇన్నాళ్లుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మా గోసను పట్టించుకోదా? అంటూ ఆవేదన, ఆగ్రహంతో వారి మనసు రగిలిపోతోంది! సమ్మెలో భాగంగా పైకి బిగ్గరగా నినాదలు చేస్తున్నప్పటికీ వారి మనసులో ఎన్నో ప్రశ్నలు! ఈ సమ్మెకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుంది? సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? పరిస్థితి ఇట్లాగే ఉంటే మా బతుకులు ఎట్లా? అని మథనపడుతున్నారు. బీపీ, హైపర్‌టెన్షన్‌, షుగర్‌ వంటి సమస్యలు ఉన్నవారైతే ఆరోగ్య సమస్యలతో సొమ్మసిల్లి పడిపోతున్నారు. అక్కడి నుంచి ఏ రాత్రికో ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వారికి అదే మానసిక ఆందోళన, ఒత్తిడి తప్పడం లేదు. సెప్టెంబరు నెల వేతనం అందక కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి అద్దెలు, పాలు, టీవీ, పేపర్‌ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నారు. దీంతో మానసికంగా కుంగిపోతూ గుండెపోటుతో మరణిస్తున్నారు. సమ్మె మొదలైన 18 రోజుల్లో రాష్ట్రంలో ఇద్దరు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోగా, ఏడుగురు సిబ్బంది గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులూ మానసిక ఒత్తిడికి లోనై చనిపోతున్నారు.
ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి: నిపుణులు
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం నుంచే భరోసా లభించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సమస్యల పరిష్కారాన్ని పక్కన పెడితే… కార్మికులను రెచ్చగొట్టేలా, ఒత్తిడికి గురయ్యేలా ప్రకటనలు, వ్యాఖ్యలు ఉండకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని చెబుతున్నారు. మంత్రులు కూడా ఏది పడితే అది మాట్లాడకుండా అదుపు చేయాలని అభిప్రాయపడుతున్నారు. 48 వేల మంది సమ్మెను సులభంగా తీసుకోకూడదని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ఆత్మహత్యలు
శ్రీనివా్‌సరెడ్డి, ఖమ్మం డిపో డ్రైవర్‌
సురేందర్‌గౌడ్‌, రాణిగంజ్‌-2 డిపో డ్రైవర్‌
గుండెపోటు మరణాలు
1 ఖలీల్‌ మియా, హెచ్‌సీయూ డిపో డ్రైవర్‌
2 కొమురయ్య, చెంగిచర్ల డిపో డ్రైవర్‌
3 లక్ష్మణ్‌గౌడ్‌, మియాపూర్‌-1 డిపో డ్రైవర్‌
4 గఫ్రొద్దీన్‌, నిజామాబాద్‌-2 డిపో డ్రైవర్‌
5 మల్యయ్య, ఏడీసీ, నల్గొండ డిపో
6 రమే్‌షగౌడ్‌, ముషీరాబాద్‌-1 డిపో డ్రైవర్‌
7 షేక్‌ ఖజామియా సత్తుపల్లి డిపో డ్రైవర్‌
8 హకీంపేట డిపో కండక్టర్‌ పద్మ భర్త రఘు
9 నర్సంపేట డిపో కండక్టర్‌ రణధీర్‌ భార్య
10 సంగారెడ్డి డిపో కండక్టర్‌ నాగమణి భర్త
Courtesy Andhra Jyothy

RELATED ARTICLES

Latest Updates