కృష్ణపట్నం అదానికేనా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* 70 శాతం షేర్లు అమ్మకం
* కొనసాగుతున్న సంప్రదింపులు

* ఉద్యోగుల్లో ఆందోళన
– నెల్లూరు ప్రతినిధి : ఆసియాలోనే అతి పెద్దదైన కృష్ణపట్నం పోర్టు త్వరలో అదాని చేతిలోకి వెళ్లనుంది. నవయుగ సంస్థ యాజమాన్యంలో లాభాల్లో దూసుకుపోతున్న ఈ పోర్టులోని అత్యధిక షేర్లను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే నవయుగ, అదాని గ్రూపుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో అదాని ప్రతినిధిలు కృష్ణపట్నం వచ్చి పలు అంశాలను పరిశీలించి వెళ్లారు. ఈ నెలాఖరుకు మొత్తం వ్యవహారం కొలిక్కివస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇంత భారీ ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఎందుకు తప్పుకుంటుందనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. రాజకీయ కక్ష సాధింపులే కారణమా? ఆర్థిక ఇబ్బందులా? మరేమైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.
నెల్లూరుకు 25 కిలోమీటర్లు దూరంలో ముత్తకూరు వద్ద ఉన్న ఈ పోర్టు ఆసియాలోనే అతి పెద్దది. 42 బెర్త్‌ల సామర్థ్యంతో దీన్ని నిర్మించాల్సి ఉంది.ప్రస్తుతం పది బెర్త్‌లు అందుబాటులోకి వచ్చాయి. 1.2 మిలియన్లు టిఇయు కెపాసిటీ కలిగిన కంటైనర్‌ టెర్మినల్‌ను ఏర్పాటు చేశారు. 1996లో దీని శంకుస్థాపన జరిగినా 2008 నుంచి ఇక్కడ పనులు ఊపందుకున్నాయి. నవయుగ కంపెనీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. అనతికాలంలోనే భారీ లాభాలును గడించింది.
హైదరాబాద్‌ కేంద్రంలోని సివిఆర్‌ (చింతా విశ్వేరరావు) గ్రూపు నుంచి నవయుగ పేరుతో చింతా విశ్వేశ్వరరావు, ఆయన కుమారుడు చింతా శ్రీధర్‌, చింతా శశిధర్‌ భాగస్వామ్యులుగా కంపెనీ నడుస్తోంది. 6,800 ఎకరాల్లోని ఈ పోర్టు 18.5 మీటర్లు డీఫ్‌ వాటర్‌ పోర్టుగా ప్రసిద్ధికెక్కింది. ఎపి ఎస్‌ఇఎస్‌ కింద నమోదైన ఈ పోర్టుకు తొలుత ప్రభుత్వం 30 ఏళ్లు లీజ్‌కు ఇచ్చింది. అటు తరువాత మరో 20 ఏళ్లు పొడిగించింది. 40 నుంచి 45 మిలియన్‌ టన్నుల కార్గో దిగుమతి అవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడాదికి రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తే అందులో 70 శాతం కృష్ణపట్నం పోర్టు ద్వారానే వస్తోంది. పోర్టుకు అనుసంధానంగా ధర్మల్‌ ప్రాజెక్టులు, మరో ఎనిమిది పామాయిల్‌ పరిశ్రమలు వచ్చాయి.

పోర్టు పై అదాని గ్రూపు కన్ను..!
కృష్ణపట్నం పోర్టును దక్కించుకోడానికి దేశంలో అతిపెద్ద వ్యాపార దిగ్గజం గౌతమ్‌ అదాని ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ విషయం బయటకొచ్చింది. నవయుగ కంపెనీలోని చింతా విశ్వేశ్వరరావు, చింతా శ్రీధర్‌కు చెందిన 70 శాతం షేర్లు అమ్మకానికి పెట్టారని ప్రచారం సాగుతుంది. చిన్న కుమారుడు శశిధర్‌కు చెందిన 30 శాతం షేర్లు మాత్రం అలానే ఉంటాయని తెలుస్తోంది. అదాని గ్రూపు సుమారు రూ.5500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కంపెనీ మారితే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయా,? లేదా ఇతర ప్రాంతాలకు బదిలీలు చేస్తారా ? ఉద్యోగ భద్రత ఉంటుందా ? ఇలాంటి అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.

courtesy Prajashakti.

RELATED ARTICLES

Latest Updates