21 డిమాండ్ల అధ్యయనానికి ఈడీల కమిటీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • సీఎం నిర్ణయం.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల ఫలితం
  • ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో బృందం
  • ఒకటి రెండు రోజుల్లో నివేదికకు నిర్దేశం
  • కార్మికులతో చర్చలపై ప్రస్తావన కరువు
  • విలీనం డిమాండ్‌ను కార్మికులే వదిలేశారు
  • పట్టుబట్టబోమని హైకోర్టుకు తెలిపారు
  • కోర్టు చెప్పిన 21 డిమాండ్లను చూడండి
  • సమ్మెకు కాంగ్రెస్‌, బీజేపీ మద్దతు అనైతికం
  • ఎంవీ చట్టాన్ని సవరించిందే మోదీ సర్కారు
  • రూట్ల ప్రైవేటీకరణపై రాష్ట్రాలకు పూర్తి హక్కు
  • ప్రగతి భవన్లో కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్‌: టీఎ్‌సఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మిగిలిన అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సమ్మెపై కాస్త సానుకూలంగా స్పందించింది. కోర్టు సూచించినట్లు 21 డిమాండ్లను పరిశీలించడానికి ముందుకొచ్చింది. ఇందుకు ఆర్టీసీకి చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో కమిటీ వేసింది. 21 డిమాండ్లను పరిష్కరించడానికి పెద్దగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేవంటూ హైకోర్టు సూచించిన నేపథ్యంలో కమిటీ వీటిని పరిశీలించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కమిటీకి నిర్దేశించింది. కానీ, కార్మికులతో చర్చలు జరిపే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారానికి 18వ రోజుకు చేరింది. కానీ.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి చర్చల ప్రస్తావన రాలేదు. చర్చలు జరపాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తొలిసారిగా స్పందించారు. మంగళవారం సమీక్ష నిర్వహించారు.
అనంతరం సీఎంవో ఓ ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై పట్టుపట్టబోమని చెప్పారు. కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి కూడా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం డిమాండ్‌ నెరవేరితే తప్ప చర్చలకు రామని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో, విలీనం డిమాండ్‌ను కార్మికులు వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. ఆ డిమాండ్లపై అధ్యయనం చేయండి’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
బీజేపీ ప్రభుత్వమే చట్టం తెచ్చింది
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్‌, బీజేపీ మద్దతు అనైతికమని మండిపడ్డారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్‌, బీజేపీపాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘‘మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌ సింగ్‌ సీఎంగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది’’ అని విమర్శించారు. ఆర్టీసీని, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టం చేసిందని, దానికి వ్యతిరేకంగా ఇక్కడి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ‘‘1950లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్‌ వెహికిల్‌ యాక్టును రూపొందించారు. దాని ప్రకారమే రాష్ర్టాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి.
ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని ఆ చట్టంలో పేర్కొన్నారు. దానిలోని 3వ సెక్షన్లో సవరణలు చేస్తూ మోదీ ప్రభుత్వం 2019 బడ్జెట్‌ సమావేశాల్లో చట్టం చేసింది. ఈ చట్టంలోనే ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అలాంటిది బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు’’ అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే తాము అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తుండటంపై ప్రధాని, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రికి లేఖ రాయాలనే విషయం సమీక్షలో చర్చకు వచ్చింది.
ఆరుగురు సభ్యులతో కమిటీ
ముఖ్యమంత్రి ఆదేశాలతో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్‌కుమార్‌, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్‌.రమేశ్‌ సభ్యులుగా ఈ కమిటీ వేశారు. ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను అందజేయనుంది.
Courtesy Andhra Jyothy

RELATED ARTICLES

Latest Updates