అభిజిత్‌పై బిజెపి విద్వేషం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* కేంద్రం విధానాలను విమర్శించారని మాటల దాడి
న్యూఢిల్లీ : దేశంలోని మేధావులు చెప్పే నిజాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోంది. తమకు, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతోంది. వ్యక్తిగత విషయాలపై కూడా మాటల దాడి చేస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి సందర్భాలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ఆభిజిత్‌ బెనర్జీపైనా బిజెపి నేతలు తమ విద్వేషాన్ని ప్రదర్శించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, పేదల ఆర్థిక స్థితిగతులపై ఆయన మాట్లాడటమే తప్పు అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌, బిజెపి నేత రాహుల్‌ సిన్హా అభిజిత్‌పై విమర్శలు గుప్పించారు. అభిజిత్‌ బెనర్జీ వామపక్ష భావాలున్న వ్యక్తి అని, ఆయన అలాగే మాట్లాడతారని గోయల్‌ వ్యాఖ్యానించారు. 2019లో సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం ఆయన రూపొందించిన కనీస ఆదాయ పథకాన్ని(న్యారు)ను ప్రజలు తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. బిజెపి నేత రాహుల్‌ సిన్హా వ్యక్తిగత విమర్శలకు దిగారు. అభిజిత్‌ బెనర్జీకి నోబెల్‌ బహుమతి ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. విదేశీ భార్య ఉంటేనే నోబెల్‌ బహుమతి వస్తుందేమోనని వ్యంగ్యంగా మాట్లాడారు.
అభిజిత్‌ బెనర్జీపై బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పలువురు నేతలు పార్టీలకు అతీతంగా ఖండించారు. తనపై బిజెపి నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు తనను చాలా బాధించాయని అభిజిత్‌ శనివారం ఒక మీడియా సంస్థతో అన్నారు. తాను ఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించినా ప్రశ్నిస్తానని, ఇదే పనిని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ చేశానని పేర్కొన్నారు.

ద్వేషంతో వారి కళ్లు మూసుకుపోయాయి : రాహుల్‌ గాంధీ
అభిజిత్‌ బెనర్జీపై బిజెపి చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఖండించారు. విద్వేషంతో వారి కళ్లు మూసుకుపోయాయని, మేధావుల పట్ల ఎలా వ్యవహరించాలో కూడా వారికి తెలియదని మండిపడ్డారు. అటువంటి వారికి ఎంత చెప్పినా వ్యర్థం అని అన్నారు. అభిజిత్‌ బెనర్జీకి నోబెల్‌ బహుమతి రావడం పట్ల భారతజాతి అంతా గర్విస్తోందని అన్నారు. ‘అభిజిత్‌ బెనర్జీ తన పని తాను నిజాయితీగా చేశారు. కుప్పకూలిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం బిజెపి ప్రభుత్వ విధి. ‘కామెడీ సర్కస్‌’ చేయడం మాని మీ పని మీరు సక్రమంగా చేయండి’ అంటూ ప్రియాంకా గాంధీ బిజెపి నేతలపై ట్విట్టర్‌లో మండిపడిన విషయం తెలిసిందే.

బిజెపి నుంచి ఇంతకంటే ఊహించలేం : సుజన్‌ చక్రవర్తి, సిపిఎం నేత
బిజెపి వంటి మతతత్వ, కార్పొరేట్‌ సన్నిహిత పార్టీకి చెందిన నేతల నోటి వెంట ఇంతకంటే విరుద్ధమైన వ్యాఖ్యలను ఊహించలేం అని బెంగాల్‌కు చెందిన సిపిఎం సీనియర్‌ నేత సుజన్‌ చక్రవర్తి విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుపరం చేయడంలోనే వారి దృష్టి అంతా ఉందని, దాన్ని వ్యతిరేకించిన వారిపై మాటల దాడి చేయడం పనిగా పెట్టుకున్నారని అన్నారు. పియూష్‌, రాహుల్‌ సిన్హా వంటి బిజెపి నేతలు సహజంగానే అభిజిత్‌ బెనర్జీ వంటి వ్యక్తులను ఇష్టపడరని, వారిని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశానికి గౌరవం తెచ్చిన వ్యక్తిపై విమర్శలు మానుకోవాలని బిజెపి నేతలకు ఆయన హితవు పలికారు.

Courtesy prajashakti

RELATED ARTICLES

Latest Updates