పులివెందుల ప్రాంతంలో పుట్టడమే.. ఎన్నో జన్మల పాపమా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

By:Rallapalli Rajavali

Rallapalli Rajavali

మ‌న‌మంతా బాగుండాం..
ట‌యానికి తిండి త‌ని, నీళ్లు తాగి..
సినిమాలు, షికార్లు,
పండ‌గ‌లు, ప‌బ్బాలు చేసుకుంటాండాం.
రోంత న‌గుతానాం.

కానీ…
అక్క‌డి నేల‌మ్మ‌..
నెత్తురుగ‌డ్డ‌లు క‌క్కుతాంది..
మ‌నుషుల్నీ, జంతువుల్నీ, జివాల్నీ చూడ‌లేక‌..
మ‌న్నుతిని బ‌ల‌వంతంగా స‌చ్చినాది..
త‌న క‌డుపులోని పిండం(యురేనియం)..
ఇంత ప‌నిచేసినాద‌ని.

ఏందా..
మారణహోమం?
అక్క‌డి మ‌నుషులు ఏం త‌ప్పుచేశారు?
నీళ్లు తాగ‌లేకుండారు…
కూడుతిన‌లేకుండారు..
గాలి పీల్చ‌లేకుండారు..
పంట పండిచ్చుకోలేక‌పోతానారు..
వాళ్ల‌కాడ ఒక‌వేళ కూర‌గాయ‌లు పండినా..
పండ్లు కాసినా, కోడి కోసినా..
అంతా విష‌ము తిండే.
ఆడోళ్లు ఆడోళ్లు కాలేక‌పోతానారు..
మ‌గోళ్లు మాయ‌మైపోతానారు.
ఇంటికాడుండే ..
కుక్క‌,కోడి, ఎనుముల్నీ, జీవాల్నీ..
బ‌త‌కించ‌లేకుండారు..
ఏడ్చి ఏడ్చి క‌న్నీళ్లూ అయిపోగొట్టుకున్యారు.

వాళ్ల‌కు వాళ్లే బ‌తుక్కోలేక‌..
వాళ్ల ఆడ‌పిల్ల‌ల క‌డుపులో కాయ‌..
కాయ‌కుంటేనే..
బాగుంటాద‌ని ..
లేని దేవుల్ల‌ను ముక్కుంటానారు.
(అక్క‌డ అబార్ష‌న్ల సంఖ్య పెరుగుతాంది)

ఉగ్ర‌వాదచ‌ర్య‌కంటే ఉన్మాద‌చ‌ర్య ఇది..
మ‌నిషిని చంపుకుతినే..
రాక్ష‌స‌కాండ అది.
ఈ ఘోర‌ప‌రిస్థితి..
ఆఫ్రిక‌న్ దేశాల్లోనో..
ఏ దిక్కూమొక్కూలేని..
అనాగ‌రిక‌దీవుల్లోనో కాదు.
అందరూ సంక‌లుగొట్టుకుంటా..
*వాళ్లు గ‌ట్టోళ్లు.. వామ్మో వాళ్లా* అని ..
తెలుగోళ్లంతా గున‌కొట్టుకుండే..
రాజ‌కీయ‌నాయ‌కుల‌కు గుండెకాయ అయిన‌..
మా ప్రాంతంలోని బాధే ఇది.
క‌డ‌ప‌జిల్లా..
పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని..
వేముల మండలంలో..
యురేనియం తొగిన..
క‌నంకింద కొట్టాల‌, తుమ్మ‌ల‌ప‌ల్లె..
మ‌బ్బుచింత‌ల‌ప‌ల్లె, క‌నుమ‌ప‌ల్లె..
భూమయ్య‌గారిప‌ల్లె, రాచ‌కుంట‌ప‌ల్లెల్లో ఉంది.

వాళ్లు చ‌రిత్ర‌లో..
రాజుల్లా ఎవ్వ‌రినీ క‌త్తి ప‌ట్టి సంప‌లేదు..
బ్రిటీష‌ర్ల‌లా..
త‌గ‌రారు పెట్టి దేశాల్ని నాశ‌నం చేయ‌లేదు.
దేశంకోసం బ‌ల‌హీనులు, రోగిష్టులు త‌రంగార‌ని..
హిట్ల‌ర్‌లా ఊచ‌కోత కోసి చంప‌లేదు.
*డ‌బ్బుకోసం, ఇంధ‌నంకోసం, ప్రాభ‌వంకోసం..
అంద‌రినీ మ‌ట్టుపెట్టి…
అణుబాంబుల్ని విసిరేసి..
అంద‌రి పొట్ట‌గొట్టి..
మిడిల్ఈస్ట్‌ని కాల్చిన అమెరివోళ్లు కాదు*.

పాపం..
ఏమీ తెలీని అమాయ‌కులు.
*యురేనియం* వ‌చ్చాందంటే..
ఇంట్లో మ‌గ‌పిల్లోల్లకు ఉద్యోగాలొచ్చి..
ఇంటివార‌యితారని మురిసిపోయినారు.
పేద‌రికం ఎల్ల‌బారిపోతాద‌ని క‌ల‌గ‌న్యారు.
వాళ్ల ఉనికే పోతుంద‌ని..
వాళ్ల బ‌తుకులు శ్మ‌శానం అయితాద‌ని..
అనుకోని అమాయ‌క జీవులు..
ఆ పులింద‌ల తిక్కోళ్లు.

టీడీపీ హ‌యాంలో యురేనియం స‌ర్వే చేసి..
రాజ‌శేఖ‌ర్ రెడ్డిహ‌యాంలో..
తుమ్మ‌ల‌ప‌ల్లె యురేనియం ప్రాజెక్టు ప్రారంభమైన‌..
ఈ పాశ‌విక చ‌ర్య‌..
మ‌న ఘ‌న సీమ పాల‌కుల పాప‌మే.
అంతా అయిపోయింది…
ఆరేళ్ల స‌మ‌యం..
అక్క‌డివాళ్ల జీవితాల్నీ, త‌రాల్నీ..
మింగేసినాది..
ఇంకేమీ లేదు!

జాలాడిగుంత‌లోని మురికిని తోడి..
కుంట‌లో పోసిన‌ట్లు..
*యురేనియం వ్య‌ర్థాల‌ను..
రెండు కొండ‌ల‌మ‌ధ్య చెరువులోకి పోసినారు*
ప్ర‌పంచంలోనే అత్యాధునిక..
యురేనియం శుద్ధి పాండ్ అని..
త‌ప్పుడు కూత‌లు కూసింది..
మన అత్య‌ద్భుత‌మైన..
యుసిఐఎల్ ప్ర‌భుత్వ‌సంస్థ‌!

కేవ‌లం ఇర‌వైశాతం క‌రెంటుకోసం..
అప్ప‌టి కేంద్ర‌కాంగ్రేసు, ఇప్ప‌టి బీజేపీ..
పార్టీలేదైతేనేం..
అణుకుంప‌టి బాధ‌లు తెలిసి..
తుమ్మ‌ల‌ప‌ల్లిలో కుపంటి ర‌గిల్చినారు.

మ‌నుషులంటే…
ప‌శువుల‌కంటే హీనంగా చూసే..
అడ్డ‌గోలు అనుమ‌తినిచ్చిన..
మ‌న ప్ర‌భుత్వాల‌ను ఏమ‌నాల‌.

యుసిఐల్‌ సంస్థ అధికారుల‌నూ,
దేశ పాల‌కుల‌నూ, రాష్ట్ర‌పాల‌కుల‌నూ..
ఎన‌కాల ఉండే అమెరికా కార్పొరేట‌ర్ల‌ను..
ఉద్యోగాలొచ్చాయ‌నీ..
ఏమీకాద‌ని మ‌భ్య‌పెట్టిన బ్రోక‌ర్లు..
స‌ర్పంచులు, ఎమ్మార్వోలు, ఐఎఎస్‌లు,
పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు..
లోక‌ల్ రాజ‌కీయ‌నాయ‌కుల‌నూ..
కేవ‌లం ఒకే ఒక్క‌రోజు..
ఈ యురేనియం మైన్‌కు తీసుకొచ్చి..
ఉండ‌లు నోట్లోపెట్టి..
మూడుపూట్ల తినిపిచ్చితేకానీ..
నా కోపం చ‌ల్లార‌దు.

ఆర్థిక స‌ర‌ళీక‌ర‌ణ‌లు..
అగ్మెంటెడ్ రియాలిటీతో..
హౌలా పోడీ.
ఎర్రిపు.. చంద్ర‌యాన్‌..
దేశం వెలిగిపోతోంది..
ప్ర‌పంచంలోనే మ‌.. ప్ర‌జాస్వామ్యం.
మేకిన్ ఇండియా..
ఎవురు ఎట్ల‌యినా బ‌తుక్కోవ‌చ్చు..
ఇక్క‌డ స్వేచ్ఛ జీవితం అంటూ..
ట‌ప్ప‌ట్లు కొట్టేవాళ్ల‌ని..
ఈ ఆరుగ్రామాల‌కు పిల్చ‌క‌చ్చి..
ఒక్క‌పూట నీళ్లు తాపిచ్చి పంపాల‌.

*పులింద‌ల‌కు ఏ శ‌నీలేదు..
సీమోళ్లు ముఖ్య‌మంత్రులైనారు..
నీళ్లు పారి భ‌విష్య‌త్తుబాగుప‌డ‌తాది..
ఫ్యాక్ట‌రీల కాలుష్యంలేదు.. *అని
సంబ‌ర‌ప‌డే మా వోళ్ల‌కు..
రెండువంద‌ల ఏళ్ల‌పీడ‌ను త‌గిలించి..
ఇక్క‌డి వాళ్ల‌నూ..
కేవ‌లం గాలితోటే..
చుట్టుప‌క్క‌న ఉండే 150 కిలోమీట‌ర్లు..
పీనుగ‌ల్ని లేపి శ‌వ‌యాత్ర‌ల్నిచేసి…
ఊర్ల‌కు ఘోరీలుక‌ట్టే..
యురేనియం విధ్వ‌స్వం..
చ‌రిత్ర‌లో ఎక్క‌డాలేదేమో!

ఈ ఆరుప‌ల్లెలోల్ల‌కు..
ఒంటిమింద అలివిగాని పుండ్లు..
కాళ్ల‌కు, చేత‌ల‌కు, ఈపుల‌కు గ‌డ్డ‌లు క‌డ్తానాయి..
క‌డుపులోప‌ల తిప్పిన‌ట్లుంటాంది..
త‌ల‌కాయ‌, క‌డుపు క్యాన్స‌ర్లొచ్చి మంచులు పోతానారు..
ఎంటిక‌లు ఊసిపోతానాయి..
గ‌ర్భ‌వ‌తులు క‌డుపులోనే పిల్లోల్ల‌ను పోగొట్టుకుంటానారు..
కిడ్నీల‌ల్లో రాళ్లూ, శ్వాస ఆడ‌క బుస ఆడ‌లా..
ఇన్ని రోగాల‌తో అల్లాడుతుండారు.
అనారోగ్య రాచపుండ్ల‌నీ…
ఇక్క‌డి ప్ర‌కృతినీ, జీవులనూ..
అణురియాక్ట‌రులో పోసుకుని..
భార‌జ‌లంతో క‌ట్ట‌డిచేస్తూ..
మా వాళ్ల దేహాల్నీ..
నెత్తురుల‌నూ, ప్రాణాల్నీ, ఆత్మ‌ల్నీ..
అణువిద్యుత్‌గా మార్చుకుని..
అంద‌రి ఇండ్ల‌ల్లో ..
క‌రెంటుబ‌ల్బులు ఎలిగించ‌టానికి..
ఈ దేశం తొంద‌ర‌ప‌డుతోంది.

ఈ అభివృద్ధిని చూడ‌టంకంటే..
గొంతు కోసుకోని చావ‌టం మేలు.
చంద్ర‌యాన్ 2 త‌ప్పోయినందుకుకాదు..
ప్రకృతిని నాశనం చేసి..
పురుగుల‌కంటే హీనంగా..
మ‌నుషుల్ని చంపి..
అభివృద్ధి అని చంక‌లు గుద్దుకుంటున్న మ‌నం..
భార‌తీయులుగా పుట్టినందుకు..
వెక్కి వెక్కి ఏడుద్దాం!
క‌న్నీళ్ల‌తో….

మబ్బుచింతల పల్లె నీలవతి, వెంకటలక్ష్మి 8 నెలలుగా వచ్చిన గడ్డలు. ఇంత వరకు ఏ పరీక్షలు ఎవ్వరూ చేయలేదు. వాళ్లకు చేయించు కొనే శక్తి లేదు. ఎప్పుడూ ఈ యురేనియం బాధిత గ్రామాలకు పోయినా కొత్త కొత్త సమస్యలు కనపడతాయి. ప్రభుత్వాలకు మాత్రం ఏమి కనపడవు. కంటి పరీక్షలు ముందుగా అధికారులకు, నేతలకే అవసరమనుకొంటా

 

అడ్వకేట్ జయశ్రీ కధనం ప్రకారం – మూగ జీవాలు : చదువు, సంపాదన, కుట్రలు, కుతంత్రాలు ఏమి ఎరుగని “బలి” జీవాలు.
చెంగు చెంగున ఎగిరి గెంతులేస్తూ,
హాయిగా తిరగాడాల్సిన పసికూనలు
నిర్జీవమైన చూపులతో,
నిసత్తువుగా కాళ్ళు ఈడ్చుకొంటూ ,
చావు కోసం ఎదురుచూస్తూ,
చావు రాక , బతకలేక కొట్టుమిట్టాడుతున్నాయి.

ఎన్నో ఏళ్ల నుండి జీవాల పెంపకం తో బతుకుతున్న ,
చెన్నకృష్ణా రెడ్డి, .” వేల రూపాయల మందులు పోసినా ,
వీటిని బతించుకోలేకున్నా, ఆ మాయరోగమెంటో,
ఒక్కసారి చంపినా బాధపడనేమో,
నా కళ్ల తో వాటి తనకలాట చూడలేక ,
చస్తున్నవాటిని పారేయలేక ,
ఏమి చేయాల్నో దిక్కు తోచటం లేదు,
మీరన్నా ఏదో ఒకటి” చేయండంటూ,
అందర్ని ప్రాధేయపడ్తున్నాడు.

యురేనియం ప్రాజెక్టు రాకముందు,
లేని జబ్బులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో చెప్పండని ప్రశ్నిస్తున్నారు. మనుషులకే కాదు,
జీవాలకు, పచ్చని పొలాలకు,
వస్తున్న మాయరోగాలకు విరుగుడు చెప్పమంటున్నారు.

యుద్ద విమానాలకు నిమ్మకాయల మంత్రాలున్నట్టు,
మా కోస్తున్న మాయ రోగాలకు ఏ మంత్రాలు లేవా ?
మీ చదువులు,చట్టు బండలు కాను,
మీ అభివృద్ది అంతా మా జీవితాలు బలి పెట్టడానికేనా?
మేమేమి పాపం చేశాము? మాకెందుకు ఈ శిక్ష ?

మీ ఇంట్లో దీపాలు వెలగాలంటే,
మేమారిపోవాల్సిందేనా?
ఇందుకేనా మీ చదువులు ?
థూ , మీదీ ఒక బతుకేనా?
అని మూస్తున్నారు.

పతంజలి క్రీమ్ తో కప్పెసుకొంటాము ,
అంతేగా ! అంతేగా!

RELATED ARTICLES

Latest Updates