అపురూప దక్షిణ భారత అస్తిత్వం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సింధూ, హరప్పా నాగరికతలో ద్రావిడ సంస్కృతే ఉందని నిన్నటి కీ జాడితవ్వకాలలో బయటపడిన సంగంసంస్కృతికి పూర్వం నుండి వున్న పురావస్తు అంశాల ద్వారా నిరూపించబడింది. అంటే, వేల సంవత్సరాలుగా ఈ నేల మీద నివసిస్తూ నాగరికత నిర్మాతలైన దక్షిణ, ద్రావిడ ప్రజలు స్థానికులు. సంస్కృతంహిందీ ఆర్య భాషా కుటుంబీకులు విదేశాల నుండి రావడమే కాకుండా మన కంటే చారిత్రక వయసులో చిన్న వారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాది సంస్కారాన్ని, సంపదను, అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. దేశం మధ్యలోనే కాకుండా, దక్షిణాదికి ప్రవేశద్వారంగా ఉన్న హైదరాబాద్‌ నగరం అందుకు ముందుకు రావాలి.

ఇప్పుడున్న దక్షిణ భారత దేశం అంటే డెక్కన్‌ ప్రాంతాలైన హైదరాబాదు మహారాష్ట్రతో సహా నర్మదా నదికి దిగువనున్న ద్రావిడ ప్రాంతాలు. వీటిని క్రీస్తుపూర్వం నుంచి ప్రత్యేక అస్తిత్వం గల ప్రాంతంగానే పురాణాలు, ఇతిహాసాలే కాకుండా విదేశీ యాత్రికులూ పేర్కొన్నారు. ప్రపంచానికి తెలిసిన భారతీయ సంస్కృతిలోని కట్టుబొట్టుతో సహా నమ్మకాలన్నీ దక్షిణ ప్రాంతం వారివే. భౌగోళికంగా మన దేశం రెండు భాగాలుగానే వుంది. ఉత్తరాన హిమాలయ, హిందుకుష్‌ పర్వతాల ఆధారంగా ప్రవహించే నదుల ద్వారా జరిగిన వ్యవసాయం, పశు పక్ష్యాదులు – తూర్పు, పశ్చిమ కనుమల ఆధారంగా ఉన్న నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, మహానదుల ఆలంబనగా పరిఢవిల్లిన నాగరికత, సంస్కృతి, భాష, సాహిత్య వికాసం వేరువేరుగానే ఉన్నాయి. ఇదే ఈ దేశ వైవిధ్యానికి, ఔన్నత్యానికి కారణం. దీన్నే మన దేశ నాయకులు, మేధావులు, పరిశోధకులు ప్రత్యేకంగా పేర్కొంటూ వస్తున్నారు. ఇటీవల ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేని కొంత మంది, ముఖ్యంగా అవగాహన లేని రాజకీయ నాయకులు ఏకత్వం పేరుతో ఏ కొద్దిమందికో సంబంధించిన భాష, సంస్కృతి జీవన విధానాలను అందరికీ ఆపాదించాలని చూస్తున్నారు. తదనుగుణంగా వైరుధ్యాలు, వైషమ్యాలు ఏర్పడి దేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి మంచిది కాదు. భారత దేశంలో ఉన్నన్ని జంతుజాతులు, మానవ జాతులు, వాటిపై ఆధారపడి ఏర్పడ్డ భాషలు, పంటలు, వంటలు మిగతా ఎక్కడా కనపడవు. విదేశాల నుండి యవనుల ద్వారా వచ్చిన గోధుమ ఉత్తర దేశాన ఉంటే, దక్షిణాన వరి, అనేక రకాల కాయధాన్యాలు, చిరుధాన్యాలు నిత్యం లభిస్తూనే ఉన్నాయి. ఇది ఒక విధంగా బ్రిటిష్‌ వారి కాలంలో పేర్కొన్న బాలాసోర్‌ నుంచి బరూచ్‌ (గుజరాత్‌) వరకు గల ఆర్యవర్తం లేక హిందుస్థాన్‌కు, దక్షిణాదికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. నిజానికి బెంగాల్‌, బీహార్‌ నుండి కన్యాకుమారి వరకు వరి మీద ఆధారపడి జీవించే ప్రజలంతా ఒకే కుదురుకు చెందిన వారేమోనన్న అనుమానం శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతూనే వున్నారు. అందుకే భాషల విషయం వచ్చినప్పుడు బ్రిటిష్‌ వారు తమ పరిపాలన సౌలభ్యం కోసం మీరట్‌ ప్రాంతంలో మాట్లాడే ‘ఖరీబోలి’ని హిందూస్థానీ, హిందీగా ప్రచారం చేయటంతో ఉత్తరాదిలో గల మాగధి, మైథిలి, రాజస్థానీ, హర్యాన్వి వంటి హిందీకి దగ్గరగా గల భాషలను కలిపేసుకుని హిందీగా రికార్డ్ చేయటం ప్రారంభించారు. ఆ రోజు రాజకీయాలలో రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో ఉన్నవారు అందరూ హిందీ భాషకు దగ్గరగా వున్న మరాఠీ, గుజరాతీ, దక్షిణాది సంస్కృత భూయిష్టమైన భాషా ప్రేమికులుండబట్టి హిందీ కావాలని కోరుకున్నారు. కానీ, అది ప్రజల అంగీకారంతో ఏర్పడింది కాదు. కాబట్టే దక్షిణాది వారు తిరుగుబాటు చేశారు. చదువుకున్న ఏ కొద్దిమందో తప్పిస్తే మరాఠీ, ఒరియా, గుజరాతీ, బెంగాలీ వంటి భాషల వారు కూడా హిందీని అంగీకరించరు. ఆ భాషలోనే మాట్లాడాలి, హిందీలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వాలి అంటే తిరగబడతారు. దక్షిణాదిలో పెరిగి పెద్దదయిన ఉర్దూ కూడా హిందీకి దగ్గరగా వుంటుంది. అందుచేత ఆ భాషను రాజభాష చేయమని అడగలేము కదా! ఈ సమస్య ఎప్పుడో వస్తుందని Official language Act 1963 చట్టాన్ని చేసి 1976లో సవరణ ద్వారా ఇంగ్లీష్‌ భాషను official work కోసం వాడాలి అన్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని గ్రహించిన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆనాటి నాయకులు భాషా సమస్యకు ఆ విధంగా పరిష్కారం చూపారు. విద్యా విధానంలో త్రిభాష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ముందుచూపుతో చేసిన విధానం. కానీ, ఉత్తరాదిలో ఒక్క రాష్ట్రంలో కూడా తెలుగు, తమిళం వంటి భాషల ప్రచారం గాని, బోధనగానీ లేదు. అందుకే హిందీ ఒంటెద్దు పోకడగా మారింది.

దేశంలో భౌగోళికంగా తద్వారా సాంస్కృతికంగా ప్రత్యేకంగా వున్న రెండు ప్రాంతాల మధ్య భావసారూప్యత సాధించాలంటే విస్తృతమైన కృషి జరగాలి. విశాల హృదయం కావాలి. అలాగాక, పెత్తందారీతనంతో వ్యవహరిస్తే వ్యతిరేక భావాలను ప్రోది చేసిన వారమవుతాము. సందర్భం వచ్చింది కాబట్టి– ఉత్తరాది వారు దక్షిణాదివారిని ముఖ్యంగా తెలుగు వారిని అక్కున చేర్చుకున్న ఘటనలు తక్కువ. మద్రాసీ వారనో, సాంబార్‌ తాగేవారనో ఈసడింపులే ఉన్నాయి. అనేక కారణాలతో మనం ఉత్తరాదిని ఆరాధిస్తూ గంగ, యమున అని మన పిల్లలకు పేర్లు పెట్టుకుంటాం. ఉత్తరాదిలో ఒక్కరు కూడా గోదావరి, కావేరి, ప్రాణహిత, నాగావళి పేర్లు పెట్టుకోరు. కనీసం అటువంటి నదులు ఉన్న సంగతి పెద్ద పెద్ద నాయకులకే తెలియదు. అందుకే దక్షిణాది భాషా రాష్ట్రాలు, సంస్కృతి ప్రత్యేకంగా ఎల్లప్పుడూ వుండాలి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌, నాటి తెలుగు మాట్లాడే హైదరాబాద్‌ చేరి తరువాత ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది. ఒక్క భాష, సంస్కృతి విషయంలోనే కాదు; పరిశ్రమలు, విద్య, వాణిజ్యం, కష్టపడే గుణం, దేశ భక్తి వంటి విషయాల్లో ఉత్తరాది వారి కంటే దక్షిణాది వారే ముందున్నారు. భౌగోళికంగా గుజరాత్‌ నుండి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు విదేశాలతో సరిహద్దులు గల ప్రాంతాల కంటే దక్షిణాది నుండి వెళ్లి ఆ సరిహద్దుల్లో పోరాటం చేసిన వారు దక్షిణాది దేశభక్తులే ఎక్కువ. ముఖ్యంగా భూమిపై వున్న సరిహద్దులనే గుర్తిస్తున్నారు తప్ప సముద్రమార్గంలో 20 కిలోమీటర్ల తరువాత ఉండే విదేశ సరిహద్దు గల తూర్పు, దక్షిణ రాష్ట్రాలను కాపాడుకుంటూ యుద్ధాల్లో పాల్గొంటున్నది కూడా దక్షిణాది వారే. ఈ విషయాలు అక్కడి సామాన్యులకే కాదు పార్లమెంట్‌ సభ్యులకు కూడా తెలియదనడానికి చాలా ఉదాహరణలు వున్నాయి. అందుకే భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ దక్షిణాది రాష్ట్రాలు తమ ఉనికిని చాటుకోవాలి.

ఇటీవలి కాలంలో ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధితో బాటు సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో దక్షిణాది వారు ముందుంటున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలు ఐటీ పరిశ్రమకు ప్రపంచంలోనే పేరెన్నికగన్నాయి. తూర్పు తీర దేశాల్లో దక్షిణాది వారు, వారి సంస్కృతే ఎక్కువగా వ్యాప్తి చెందిన సంగతి మన చరిత్రకారులకు తెలిసినంతగా ఉత్తరాదివారు ఎప్పుడూ ప్రచారం చేయలేదు. శ్రీలంక, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం, బర్మా వంటి దేశాల్లో దక్షిణాదివారు ముఖ్యంగా మన తెలుగు ప్రజలే వున్నారు. అందుకే మన దక్షిణ భారతం గొప్పది, వైవిధ్యమైనది. అలాగే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ్‌, కన్నడ, తుళు, మలయాళం, ఉర్దూ భాషల మధ్య సారూప్యత వుంది. సాహిత్యపరంగా ఒకరి నుండి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. నిజానికి దక్షిణ భారత భాషల్లో ఉన్న సాహిత్య ఔన్నత్యం, హిందీకి ఇప్పటికీ లేదు. సంస్కృతం, పాళి భాషలు వారివి మాత్రమే కాదు, అందరివి. ఇటీవల జరిగిన పరిశోధనలో ముఖ్యంగా జెనెటికల్‌ డీఎన్‌ఏ ఆధారంగా తేల్చిన విషయమేమంటే… సంస్కృతానికి కొన్ని వందల సంవత్సరాల ముందు నుండి ద్రావిడ భాష ఇక్కడ వుంది. సింధూ, హరప్పా నాగరికతలో ద్రావిడ సంస్కృతే ఉందని నిన్నటి ‘కీ జాడి’ తవ్వకాలలో బయటపడిన ‘సంగం’ సంస్కృతికి పూర్వం నుండి వున్న పురావస్తు అంశాల ద్వారా నిరూపించబడింది. అంటే, వేల సంవత్సరాలుగా ఈ నేల మీద నివసిస్తూ నాగరికత నిర్మాతలైన దక్షిణ, ద్రావిడ ప్రజలు స్థానికులు. సంస్కృతం – హిందీ ఆర్య భాషా కుటుంబీకులు విదేశాల నుండి రావడమే కాకుండా మన కంటే చారిత్రక వయసులో చిన్న వారు. మనమే వారికి చాలా పదాలు, సంస్కృతి, వస్త్రాలు, పాలనా, విధానాలు ఇచ్చాము. అవసరమైతే ఎవరి నుండైనా నేర్చుకుంటాం గానీ, వారే మన కంటే ముందు వారంటే అంగీకరించం. చారిత్రక ఆధారాలు, శాస్త్రీయ పరిశోధనలు కూడా మనకే అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దక్షిణాది సంస్కారాన్ని, సంపదను, అస్తిత్వాన్ని కాపాడటానికి ఎవరో ఒకరు ముందుండాలి. దేశం మధ్యలోనే కాకుండా, దక్షిణాదికి ప్రవేశద్వారంగా ఉన్న హైదరాబాద్‌ నగరం అందుకు ముందుకు రావాలి.

ఆచార్య కె.యస్‌. చలం

RELATED ARTICLES

Latest Updates