వ్యాన్‌ డోర్లలో ఇరికి తెగిన వేలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • బాధతో విలవిల్లాడిన సీపీఐ ఎంల్‌ న్యూడెమోక్రసీ నేత రంగారావు
  • పోలీసుల అత్యుత్సాహంతో ప్రమాదం
  • బంద్‌కు మద్దతు పలికిన వాణిజ్య, వ్యాపార వర్గాలు
  • హోటళ్లు, థియేటర్లు, బంకులూ మూత
  • తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సంఘీభావం
  • ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తిన తెలంగాణ
  • నిర్మల్‌లో మహిళా కండక్టర్‌కు గాయాలు
బంద్‌ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో పోలీసులు న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావును వ్యానులో ఎక్కించి బలంగా తలుపులు మూశారు. ఆ సమయంలో రంగారావు ఎడమ చెయ్యి బొటనవేలు, వ్యాను డోర్లలో ఇరుక్కుని నలిగి తెగిపోయింది.

చిక్కడపల్లి/హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల బంద్‌కు సంఘీభావంగా ఆందోళన నిర్వహిస్తున్న నేతల అరెస్టు విషయంలో పోలీసుల అత్యుత్సాహం ఓ నేతను ఆస్పత్రిపాలు చేసింది. ఆయన్ను అదుపులోకి తీసుకొని వ్యాన్‌లో ఎక్కిస్తున్న క్రమంలో డోర్ల మధ్య ఎడమచేతి బొటనవేలు ఇరికి సగం దాకా తెగిపోయింది. వేలి నుంచి చిమ్మిన రక్తం ఆయనతో పాటు అక్కడున్న మిగతా నేతలపైనా పడింది. బాధితుడు.. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఆందోళనలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భరించలేని బాధతో రంగారావు విలవిల్లాడిపోయారు. హైరానా పడ్డ పోలీసులు వెంటనే ఆయన్ను వ్యాన్‌ నుంచి కిందికి దించారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ దాదాపు గంటసేపు ఉన్నా వైద్యులు సరిగా స్పందించకపోవడంతో సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు సోమవారం తెగిపోయిన బొటనవేలుకు శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నన్ను కేసీఆర్‌ చంపమన్నాడా?
అంతకుముందు వేలికి తీవ్రగాయంతో విలవిల్లాడిపోయిన రంగారావు ఘటనాస్థలంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను కేసీఆర్‌ చంపమన్నాడా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందుడి పోరాడానని, జైలుకు కూడా వెళ్లానని.. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల తరఫున పోరాడుతున్నందుకు ఇది తనకు కేసీఆర్‌ ఇచ్చిన బహుమాన మా? అని అవేదన వ్యక్తం చేశారు. కార్మికుల తరఫున పోరాడుతున్నవారిని భయబ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం సబబు కాదన్నారు.
Courtesy Andhra jyothy

RELATED ARTICLES

Latest Updates