మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న కెసిఆర్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* ఆర్టీసి కార్మికులను ఆదుకోవాలి
* ఎన్‌హెచ్‌ఆర్సీకి సిపిఐ నేతలు డి.రాజా, నారాయణ లేఖ

ఆర్టీసి కార్మికులు సమ్మె నేపథ్యంలో తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ మానవవాక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)కు సిపిఐ ఫిర్యాదు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మానవ హక్కులనూ, కార్మికుల ప్రాథమిక హక్కులనూ ఉల్లంఘించా రని, కనుక దీనిపై ఎన్‌హెచ్‌ఆర్సీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం నాడు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె.నారాయణలు ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌కు లేఖ రాశారు. తెలంగాణలోని ఆర్టీసి కార్మికుల సమ్మెపై జోక్యం చేసుకొని, ఆర్టీసి ఉద్యోగులు, కార్మికుల జీవితాలను కాపాడాలని కోరారు. కార్మికుల సమ్మె 14 రోజులకు చేరుకుందని, ఆర్టీసి అనేది వ్యాపార కంపెనీ కాదని, ప్రజా రవాణా అని పేర్కొన్నారు. అలాంటి ప్రజా రవాణాపై వ్యాట్‌ వేయడమేంటని ప్రశ్నించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని, డీజిల్‌పై వ్యాట్‌ను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసి నష్టాల బారిన పడటానికి కారణం అధిక స్థాయిలో పన్నులు విధించడమేనని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణా ఆర్టీసి కార్మికులు అక్టోబర్‌ 5న సమ్మె నోటీసు ఇచ్చారని, కానీ ప్రభుత్వం కనీసం కార్మికులతో మాట్లాడలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కార్మికులందరిని ”అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌” అని ప్రకటించారని, 48 వేల మంది కార్మికులను సిఎం కెసిఆర్‌ డిస్మిస్‌ చేశారని, దీంతో వారి కుటుంబాలు షాక్‌కు గురయ్యాయని తెలిపారు. అలాగే పని చేసిన కాలానికి వేతనాలు చెల్లించలేదని, దీంతో ఆవేదన చెందిన ఇద్దరు ఆర్టీసి కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ ఏపి, తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు నిజాం తరహాలో వ్యవహరిస్తూ, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసి కార్మికుల డిమాండ్‌లు న్యాయబద్ధమైనవని, తమ డిమాండ్ల సాధన కోసమే వారు సమ్మె చేస్తున్నారని తెలిపారు. సమ్మె నోటీస్‌ ఇచ్చి చట్టం ప్రకారం వారు సమ్మెకు సిద్ధమయ్యారని, కానీ ప్రభుత్వం వారి సమస్యలను పెడచెవిని పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం తీరును నిరశిస్తూ కార్మికులంతా ఐక్యంగా సమ్మె చేస్తున్నారని, ఆర్టీసికి ఎండిని నియమించి ఉంటే, కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేవని అన్నారు. కెసిఆర్‌ ముఖ్యమంత్రి కావడానికి కారణం సకల జనుల సమ్మె అని, అందులో ఆర్టీసి కార్మికుల పాత్ర ప్రధానంగా ఉందని తెలిపారు. కెసిఆర్‌ ఆర్టీసిని ప్రైవేట్‌ పరం చేసి, వాటి ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

(Courtesy Prajashakti)

RELATED ARTICLES

Latest Updates