తీర్పే తరువాయి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అయోధ్య భూ వివాదం కేసులో ముగిసిన వాదనలు
నవంబరు 11లోగా తేలనున్న భవితవ్యం
వాదనల చివరి రోజు సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు
కోర్టు గదిలోనే పటాన్ని చించేసిన ముస్లిం పక్షాల న్యాయవాది

దిల్లీ: యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక తీర్పు వెలువడేందుకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూ వివాదం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనల పర్వం బుధవారంతో ముగిసింది. రాజకీయపరంగా, ప్రజల మనోభావాలపరంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. వచ్చే నెల 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ చేయనున్నారు. ఆలోగా తీర్పు వెలువడనుంది. వాదనల చివరి రోజు న్యాయస్థానంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముస్లిం పక్షాల తరఫు న్యాయవాది.. మరోపక్షం న్యాయవాది సమర్పించిన ఓ పత్రాన్ని కోర్టు గదిలోనే చించేసి అందర్నీ విస్మయానికి గురిచేశారు. రామ – జన్మభూమి-

బాబ్రీ మసీదు భూ వివాదం(అయోధ్య భూ వివాదం) కేసులో అలహాబాద్ హైకోర్టు 2010లో వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన 14 అపీళ్లపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి రోజువారీ వాదనలు ఆలకించింది. 40 రోజులపాటు హిందూ, ముస్లిం పక్షాలు తమ వాదనలు వినిపించాయి. నిర్దిష్టంగా ఏ విషయాలను న్యాయస్థానం పరిష్కరించాలని కోరుకుంటున్నారో రాతపూర్వకంగా తెలియజేసేందుకుగాను కక్షిదారులకు మరో మూడు రోజుల గడువు మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం తాజాగా వెల్లడించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్లే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.ఎ.నజీర్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

అనుమతి కోరి చించేశా‘ : పటాన్ని చించివేయడంతోనే నాటకీయతకు తెరపడలేదు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఆ అంశాన్ని ధవన్ తిరిగి ప్రస్తావించారు. తానే సొంతంగా నిర్ణయం తీసుకొని పటాన్ని చించేసినట్లు బయట వార్తలు గుప్పుమంటున్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ పటాన్ని విసిరిపారేయొచ్చా అని ధర్మాసనం అనుమతిని తాను కోరానని తెలిపారు. “అది పరిగణించదగినది కాకపోతే, మీరు దాన్ని చించేయొచ్చు” అని సీజేఐ బదులిచ్చారని వెల్లడించారు. సీజేఐ మాటను ఆదేశంగా భావించి తాను ఆ పని చేశానని వివరించారు. వెంటనే జస్టిస్ గొగొయి స్పందిస్తూ.. “ధవన్ అంటున్నది వాస్తవమే. నేను చెప్పాను.. అందుకే ఆయన చించేశారు. ఈ వివరణ కూడా విస్తృతంగా ప్రచారంలోకి రానివ్వండి” అని వ్యాఖ్యానించారు.

బాబర్ నిర్మించారని నిరూపించలేకపోయారు: వైద్యనాథన్ : అంతకుముందు, హిందూపక్షాల తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. ఆ అయోధ్యలో మసీదును మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించారని, అది తమ(ముస్లింల) స్థలమేనని ముస్లిం పక్షాలు వాదించిన సంగతిని గుర్తు చేశారు. మసీదును బాబర్ నిర్మించినట్లు రుజువు చేయడంలో మాత్రం – వారు విఫలమయ్యారని ధర్మాసనానికి నివేదించారు. అయోధ్యలో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు చాలా ప్రాంతాలు ఉండొచ్చని.. హిందువులకు మాత్రం ‘రామ జన్మభూమి’ ఒకటేనని, అది మారదని వ్యాఖ్యానించారు. నిర్మోహి అఖాడా, నిర్వాణీ అఖాడా తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. వివాద కేంద్రంగా ఉన్న భూమి 1885 నుంచి తమ అధీనంలోనే ఉందన్నారు. ముస్లిం పక్షాలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయని గుర్తుచేశారు.

అందరూ అవాక్కయిన వేళ.. : అఖిల భారత హిందూ మహాసభ(ఏఐ హెచ్ఎం) విభాగం తరఫున బుధవారం వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. శ్రీరాముడి జన్మస్థలాన్ని స్పష్టంగా సూచించే పత్రమంటూ ఓ  సచిత్ర పటాన్ని ధర్మాసనం ముందుంచారు. అది బిహార్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి కిశోర్ కునాల్ రాసిన ‘అయోధ్య రీవిజిటెడ్’ అనే పుస్తకంలోనిది. సున్నీ వక్స్ బోర్డు, ఇతర ముస్లిం  పక్షాల తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ పటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడి జన్మస్థలానికి సంబంధించిన అంశంపై అలహాబాద్ హైకోర్టులో వేరే పత్రాల ఆధారంగా చర్చ జరిగిందని… ఇప్పుడు ఈ పటంపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పటాన్ని కచ్చితమైన ఆధారంగా పరిగణనలోకి తీసుకోవాలని తాను ఒత్తిడి చేయబోనని వికాస్ చెప్పడంతో.. ధవన్ దాన్ని చించేశారు. న్యాయవాదులు, సందర్శకులతో కిక్కిరిసిన కోర్టు గది ఆ పరిణామంతో ఒక్కసారిగా వేడెక్కింది.

ఇలాగైతే వెళ్లిపోతాం : చివరి రోజు వాదనలు కొనసాగుతున్నప్పుడు న్యాయవాదులు పరస్పరం గట్టిగా అరుచుకోవడంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాగే గందరగోళం కొనసాగితే మేం వాదనల పర్వాన్ని ముగిస్తాం. లేచి వెళ్లిపోతాం” అని అన్నారు. “మాకు సంబంధించినంత వరకు వాదనలు ఇప్పటికే ముగిశాయి. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారేమోనని కాస్త సమయమిస్తున్నాం. అంతే” అని వ్యాఖ్యానించారు.

తీర్పును గౌరవించాలి : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును ఆందరూ అంగీకరించాలని అఖిల భారత ఉలేమా మండలి ప్రధాన కార్యదర్శి మౌలానా మెహబూబ్ దర్యాదీ పేర్కొన్నారు. మతపరమైన మనోభావాల  ప్రాతిపదికన కాకుండా సాక్ష్యాధారాలను బట్టి కోర్టు తీర్పును వెలువరించాలని కోరుకుంటున్నట్లు  చెప్పారు. తొలుత అయోధ్య భూ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని సుప్రీంకోర్టు  భావించి, జస్టిస్ ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, న్యాయవాది శ్రీరామ్ పంచూలతో కమిటీని ఏర్పాటుచేసింది. 4 నెలల తర్వాత కూడా పరిష్కారం దిశగా ముందడుగు పడకపోవడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 6 నుంచి  స్వయంగా వాదనలు ఆలకించింది.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates