కె.సి.ఆర్ ‘దొర’హంకారం మెడలు వంచి చర్చలకు దిగొచ్చేలా పోరాడిన కార్మిక శక్తికి జేజేలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతన సవరణ చేస్తానన్న కె.సి.ఆర్ తన వాగ్దానాన్ని వెనువెంటనే నెరవేర్చాలి.
టి.ఎస్.ఆర్టీసీని ప్రైవేటీకరించే పన్నాగాన్ని కనిపెట్టి ఎ.పి.ఎస్.ఆర్టీసీలా ప్రజారవాణాగా కొనసాగించాలి.

ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టి.ఎస్.ఆర్టీసీ కార్మికులు తమ జీతాలనేగాక, జీవనాధార ఉద్యోగ జీవితాలను సైతం లెక్క చేయకుండా 27 రోజులపాటు “సకలజనులసమ్మె”లో పాల్గొని, దాన్ని సక్సెస్ చేయటంలో కీలకపాత్ర పోషించినందుకు కె.సి.ఆర్ వారినెంతగానో కొనియాడాడు. అంతేకాదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ కార్మికులకే అధిక ప్రాధాన్యత ఇస్తానని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారిని గుర్తించి, అదేస్థాయిలో వారికి సకల సదుపాయాలు కల్పిస్తానని వాగ్దానం చేశాడు. అందులో భాగంగా 2017 నాటికే వేతన సవరణ చేపడతానని, టి.ఎస్.ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేసి ఆలాభాల్లో కూడా కార్మికులకు వాటా ఇస్తానని నమ్మబలికాడు. టి.ఎస్ఆర్టీసి కార్మికుల కాలికి ముల్లుగుచ్చుకొంటే మునిపంటితో ఆముల్లును తీసి కార్మికుల్ని కంటికి రెప్పలా కాపాడుతానని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఆ మాయమాటలు నమ్మిన ఆర్టీసి కార్మికులు ఆనాడు కె.సి.ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

కానీ “ఓడెక్కేదాకా ఓడమల్లప్పా, ఓడ దిగినంక బోడమల్లప్పా” అన్నట్లు తెలంగాణ వచ్చినంక ఆర్టీసిని లాభాలబాటలో పయనింపజేయటానికి బదులు నష్టాలబాటలో పయనింపజేశాడు. తన దగాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఆనష్టాలకు కార్మికులే కారణం అంటూ వారిని బదనాంచేసి బలిపశువులను చేయాలని చూశాడు.

ఆర్టీసి వాణిజ్యసంస్థ కాదు ప్రజారవాణా సంస్థ. వ్యాపారసంస్థ మీద విధించినట్లు వాణిజ్య పన్నులు ఆర్టీసిపై విధించకూడదు. కానీ ఇందుకు విరుద్ధంగా కె.సి.ఆర్ ప్రభుత్వం 27శాతం పన్నులు విధిస్తోంది. ప్రైవేటు సంస్థ అయిన శంషాబాద్ జి.ఎం.ఆర్ విమానాశ్రయానికి మాత్రం కేవలం ఒక్క శాతమే వసూలు చేస్తోంది. డిజిల్ పై పన్నుల రూపంలో రూ.230 కోట్లు, టోల్ప్లాజాలపై రూ.60 కోట్లు వెరసి ఏడాదికి రూ.1000 కోట్లు ముక్కుపిండి వసూలు చేస్తోంది. లక్షలాదిమంది విద్యార్థులకు, ఉద్యోగులకు, వికలాంగులకు, వృద్ధులకు, బడుగువర్గాల వారికి బస్పాస్లు జారిచేస్తున్న ప్రభుత్వం, ఆరాయితీల వలన ఏర్పడే లోటును భర్తీ చేయటానికి రీయంబర్స్ మెంట్ ఇవ్వాల్సి వుంటుంది. అలాగే ప్రజల సౌకర్యార్థం లాభసాటికాని మారుమూల పల్లెలకు వెళ్లే”పల్లెబాట” బస్సులవల్ల, అంతగా ఆదాయం రాణి సిటీబస్సుల వల్ల వచ్చేనష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాల్సివుంటుంది. ఈ రాయితీల విలువ ఈ ఐదేండ్లలో రూ. 5000 కోట్లు. ఈ పన్నులు మినహాయించి సకాలంలో రాయితీలు చెల్లిస్తే టి.ఎస్.ఆర్టీసి నిజానికి లాభాల బాటలోనే నడిచేది వేతన సవరణ కష్టమయ్యేదికాదు సమ్మె చేయాల్సిన అవసరమే ఏర్పడేది కాదు.

అంతేకాదు కార్మికులు కూడబెట్టుకొన్న డబ్బును కూడా కొల్లగొట్టే కక్కుర్తికి పాల్పడింది కె.సి.ఆర్ ప్రభుత్వం. “క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ”(CCS)లో కార్మికులు కూడబెట్టుకొన్న రూ. 528.55 కోట్లు ఆర్టీసి యాజమాన్యం దారిమళ్లించింది. అందువలన 2019 జనవరి నుండి 9000 మందికి సి.సి.ఎస్ లోన్లు ఇవ్వకుండా మొండిచేయి చూపారు. అలాగే 2018 నుంచి రిటైర్ అయిన కార్మికులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 528 కోట్లలోనూ సుమారు రూ. 100 కోట్లు ఇవ్వలేదు. తోటి కార్మికుల జీవితాల కోసం తన జీవితాన్ని బలిదానం చేసిన శ్రీనివాస్ రెడ్డి తన సూసైడ్ నోటులో “పి.ఎఫ్, సి.సి.ఎస్. డబ్బులు వెంటనే జమ చెయ్యాలి” అని, ఇకపై ప్రభుత్వాలు ఇలా తమ జీవితాలతో  ఆటలాడుకోకుండా “టి.ఎస్.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలి” అని రాయటాన్నిబట్టి కె.సి.ఆర్ కార్మిక వ్యతిరేక, ప్రజా(రవాణా)వ్యతిరేక వైఖరి ఎంత క్రూరంగావుందో అర్థమవుతోంది. అంతేగాక కె.సి.ఆర్ హామీ మేరకు 2017లో ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాల్సి ఉనప్పటికీ చేయకుండా దాటవేస్తూ రెండు సంవత్సరాలకు పైగా (30 నెలలు) పెండింగ్లో పెట్టటం ఎంత బాధ్యతారాహిత్యమో చెప్పనక్కరలేదు.

కె.సి.ఆర్ ప్రభుత్వం అనుసరించిన ఈ నిర్లక్ష్య, నిరంకుశ వైఖరికి నిరసనగా, తమ హక్కుల రక్షణకోసం, ఉద్యోగభద్రత కోసం, వేతన సవరణ కోసం, ప్రభుత్వంలో విలీనం కోసం అన్ని యూనియన్లు ఏకమై 2019 సెప్టెంబర్ 6న సమ్మె నోటీసు ఇచ్చాయి. దీనికి తోడు పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొంటూ ఆరాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవటం, ఆ రాష్ట్ర రవాణాను (పీపుల్స్ ట్రాన్స్పోర్ట్) ప్రజారవాణాగా ప్రకటించటం తెలంగాణ కార్మికులకి ప్రేరణనిచ్చింది. వై.ఎస్. జగన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న కె.సి.ఆర్ తెలంగాణలో కూడా అమలు చేస్తాడని కార్మికుల్లో ఆశ జనించింది.

ఈ నేపధ్యంలో రెండు సంవత్సరాలకు పైగా ఆగి, అన్ని వత్తిడి ప్రయత్నాలు చేసినాక, గత్యంతరంలేని స్థితిలో ఆఖరు అస్త్రంగానే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అయినా సమ్మె చేయటమంటే “బ్లాక్మెయిల్” చేయటమేనని, ఆర్టీసీ డిపోల్లో ఆందోళనకు దిగుతమంటే “గుండాగిరి”కి దిగటమేనని, వెంటనే విధుల్లో చేరకపోతే డిస్మిస్ చేసి పారేస్తానని, ఎస్మా ప్రయోగించి ఉక్కుపాదంతో అణచిపారేస్తానని దొరహంకారాన్ని ప్రదర్శించి బెదిరించాలని చూశాడు. కె.సి.ఆర్ దొర ఇంకా జాగీర్దార్ల, దేశ్ ముఖ్ ల జమానాలోనే వున్నట్లుగా “ నీబాంచెన్ కాల్మొక్త దొరా” అని కార్మికులు కాళ్లబేరానికి వస్తారని భావించాడు. ఎన్నోఏండ్ల పోరాటంతో , ఎంతోమంది ప్రాణత్యాగాలతో కార్మికులు సాధించుకొన్న “సమ్మె” హక్కును, సంఘం పెట్టుకొనే హక్కును, కార్మిక సంఘాలతో చర్చలు జరిపేహక్కును ఆధునిక ప్రజాస్వామ్య హక్కులుగా అనుమతించలేని అహంభావంతో అమానుషమైన కక్ష సాధింపు చర్యలకు దిగాడు.

‘పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం’ ప్రకారం ప్రతినెల 1వ తేదీన లేదా కనీసం 7వ తేదీలోపు వేతనాలు ఇవ్వాల్సివున్నా సెప్టెంబర్ నెల జీతాన్ని అక్టోబర్ 1వ తేదిన ఇవ్వకుండా తొక్కిపెట్టాడు. తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో కార్మికులకు వైద్య సేవలు అందించకుండా నిలిపివేయించాడు. 2014 నుండి నేటివరకు 6000 మంది కార్మికులు రిటైర్ అయినా వారిస్థానంలో కొత్తవారిని నియమించి నిరుద్యోగులకు మేలు చేయకపోగా, ఉన్న 49,100 మంది ఆర్టీసీ కార్మికుల్ని డిస్మిస్ చేసి, కొత్తవారిని చేర్చుకుంటామని “బ్లాక్ మెయిల్” చేశాడు. కొత్తగా నియమించబడే కార్మికులు సమ్మెకు దిగరాదని, సంఘం పెట్టుకోరాదని ఆంక్షలు విధించాడు. టి.ఎస్.ఆర్టీసీని 3 ముక్కలుగా చేసి 20శాతం పూర్తిగా (ఎలక్ట్రిక్) ప్రైవేటుకు అప్పగిస్తానని, మరో 30శాతం అద్దె బస్సులకు అవకాశం కల్పించి మిగతా 50శాతం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తానని ప్రకటించి తన ప్రైవేటీకరణ పన్నాగాన్ని బైటపెట్టుకున్నాడు. అసలు కె.సి.ఆర్ తన ప్రైవేటీకరణ పన్నాగంతోనే కార్మికుల ఎడల ఇంత కఠినంగా, మొండిగా వ్యవహరిస్తున్నాడన్న సందేహాన్ని నిజంచేశాడు. దొర ఫర్మానా ప్రకారం సమ్మె విరమించి విధులకు హాజరుకాకుండా గైర్ హాజరైన వారు వారంతట వారే “సెల్ఫ్ డిస్మిస్” చేసుకొన్నారని ప్రకటించి, తమకు వంతపాడే మీడియాలో ఈప్రకటనను పదేపదే ప్రసారం చేసి కార్మికుల గుండె నిబ్బరాన్ని దెబ్బతీసి గుండె ఆగిపోయేట్లు చేశాడు. నిరాశా నిస్పృహహాలతో ఆత్మహత్యలకు, నిరంకుశ చర్యలతో బలవన్మరణాలకు, హఠాన్మరణాలకు, బలిదానాలకు పాల్పడే పరిస్థితి కల్పించాడు.

1). మియాపూర్ డిపో డ్రైవర్ లక్ష్మయ్య 2). శంగిచెర్ల డ్రైవర్ డి. కొమురయ్య 3). హకీంపేట డిపో మహిళా కండక్టర్ పద్మ భర్త రఘు 4). హెచ్.సి.యు డిపోకి చెందిన డ్రైవర్ షేక్ ఖలీల్ మియా 5). తోటి కార్మికుల భవిష్యత్ కోసం తన ప్రాణాన్ని బలిదానం చేసిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి 6). ఈ మరణవార్త విని మనోధైర్యం కోల్పోయి ఉరివేసుకొన్న రాణిగంజ్ డిపో కండక్టర్ సురేందర్ గౌడ్ టి.వి.ల్లో ఆర్టీసీ కార్మికుల మరణ వార్తలు చూస్తూ మనసు కలతచెందిన కార్మికులు ఇరువురిలో ఒకరు 7). హెచ్.సి.యు డిపో కండక్టర్ సందీప్ చెయ్యికోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. తోటి కార్మికులు వెంటనే హాస్పిటల్ కి తరలించటంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. మరొకరు ఖమ్మం జిల్లా, కొణిజర్ల. మం. అనంతారం గ్రామానికి చెందిన దామెర్ల ఆగ్నేష్ అనే కార్మికుడి తల్లి గుండె ఆగి చనిపోయింది.

అయినా అధైర్యపడకుండా, గుండె దిటవు చేసుకొని ఆర్టీసీ కార్మికులు జెఏసీ ఇచ్చిన ఆందోళనా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాపితంగా అన్ని డిపోల్లో అమలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అత్మబలిదానాలు చేసుకొన్న వారికి నివాళులు అర్పిస్తూ సంతాప సభలు జరుపుతున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి అండదండలు అందిస్తూ వివిధ ఉగ్యోగ -, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, విద్యార్థి – యువజన – ప్రజా సంఘాలు, దళిత బహుజన సంఘాలు, వివిధ ప్రతిపక్ష, వామపక్ష, విప్లవ పార్టీలు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించటంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె సకలజనుల సమ్మెను తలపించేలా ప్రజాదరణను పొందింది. అయినా కె.సి.ఆర్ తన మొండివైఖరిని విడనాడి కార్మికులతో చర్చలకు రాకపోవటంతో టి.ఎస్.ఆర్టీసీ జెఏసీ ఆధ్వర్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రధాని. హోంమంత్రి మోడీ-షాల పిలుపుమేరకు గవర్నర్ తమిళిసై హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ జెఏసీ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాలవారు మంత్రుల నివాసాలను ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాపితంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 19దాకా సెలవులు ప్రకటించటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కె.సి.ఆర్. పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 19వ తేదీలోపు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే 19వ తేదీన “తెలంగాణ రాష్ట్రబంద్” కు పిలుపినిస్తామని ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.

దీనితో పరిస్థితి చేయిదాటిపోతోందని, తెరాస ప్రభుత్వం పట్ల ప్రజల్లో నిరసన పెల్లుబుకుతోందని, ఆత్మబలిదానాలు సెకలాజికల్ ట్రెండ్ గా మారుతున్నాయని గ్రహించిన కేసీఆర్ తనకు మొఖం చెల్లక పరోక్షంగా తెరాస పార్టీ సెక్రటరీ జనరల్ (రాజ్యసభ సభ్యుడు) కె.కేశవరావుని రాయబారిగా రంగంలోకి దించాడు. తన ప్రైవేటీకరణ పన్నాగానికి గండిపడకుండా జాగ్రత్తపడి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తప్ప మిగతా డిమాండ్లు పరిష్కరించటానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని మీడియా ద్వారా కె. కేశవరావు బహిరంగ ప్రకటన చేశాడు. తెరాస అధికార పత్రిక”నమస్తే తెలంగాణ” ఆ ప్రకటనను ధృవీకరిస్తూ అక్టోబర్ 15న అధికారికంగా ప్రచురించింది. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంకావాలని కె.కె. మీడియా ద్వారా జెఏసీ నేతల్ని కోరాడు. విలీనమా, అలీనమా అనే మాట మాట్లాడకుండా, సమ్మె విరమించాలనే షరతు విధించకుండా చర్చలకు ఆహ్వానిస్తే వచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని, కె.కె. మధ్యవర్తిత్వాన్ని తాము గౌరవిస్తామని జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించాడు. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుపుతున్న హైకోర్టు కూడా, బేషజాలకు పోకుండా ప్రభుత్వం కార్మికులతో సమ్మెను విరమింపజేసి వారితో చర్చలు జరపాలని సూచించింది. ప్రజల అసౌకర్యాన్ని, విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసింది.

ఈ విధంగా కె.సి.ఆర్ దొరహంకారం మెడలు వంచి చర్చలకు దిగివచ్చేలా రాజీలేని పోరాటం చేసిన టి.ఎస్.ఆర్టీసీ కార్మికుల పోరాటశక్తికి జేజేలు పలుకుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వేతన సవరణ చేస్తానన్న కె.సి.ఆర్ తన వాగ్దానాల్ని వెనువెంటనే నెరవేర్చాలి. టి.ఎస్.ఆర్టీసీని ప్రైవేటీకరించే పన్నాగాన్ని కట్టిపెట్టి ఎ.పి.ఎస్.ఆర్టీసీలా ప్రజారవాణాగా కొనసాగించాలి.

తెలంగాణ శ్రామిక బహుజన సమితి (TSBS)
కుల అసమానతా నిర్మూలన పోరాటసమితి (KANPS)
కుల నిర్మూలనా ఉద్యమం   (CAM)
గ్రామీణ పేదల సంఘం    (GPS)
ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ  (DSO)
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ  (OPDR)
తెలంగాణ సింగరేణి గని కార్మిక సంఘం  (TSGKS)
భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైఖ్యతాకేంద్రం UCCRI(ML) (కిషన్ వర్గం)

ప్రచురణ కర్తలు : ఉ.సా, బండారి లక్ష్మయ్య, కొమ్ము సురేందర్, నర్శింహ, జన్ను అబ్రహాం, ఎ. అశోక్, జి. సదానందం
9849346707, 8143022416, 9885504994, 9494970334

Download PDF Pam plate link – RTC_Handleaf

RELATED ARTICLES

Latest Updates