వారికి సొమ్ము.. ఆర్టీసీకి దుమ్ము

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • సంస్థ ఆదాయం నాయకుల జేబుల్లోకి..
  • డీలర్‌ షిప్‌ మార్జిన్లో 60% ధారాదత్తం
  • చక్రం తిప్పిన రాష్ట్ర మాజీ మంత్రి
  • సగానికి సగం కీలక నేత హస్తగతం
  • తన స్థలాలను చమురు కంపెనీలకు లీజుకిచ్చిన ఆర్టీసీ
  • వాటిలో పెట్రోలు బంకులు ఏర్పాటు చేసిన కంపెనీలు
  • ఆథరైజ్డ్‌ డీలర్‌గా ఆర్టీసీ.. పెట్రోల్‌, డీజిల్‌పై కమీషన్‌
  • నిర్వహణ కోసం సర్వీసు ప్రొవైడర్ల ఎంపిక
  • వాటి పేరిట రాజకీయ నాయకుల చొరబాటు
  • ఆర్టీసీ పెట్రోలు బంకుల్లో భారీగా సాగుతున్న దోపిడీ

పైసా పెట్టుబడి లేదు! రవ్వంత కష్టం లేదు! రోజూ కోట్ల రూపాయలు వచ్చి జేబులో పడిపోతాయి! అదంతా ఆర్టీసీ ఖజానాకు చేరాల్సిన సొమ్ము! కానీ, అధికార పార్టీ నాయకుల జేబుల్లో చేరుతోంది! కీలక నేతకు కాసులు కురిపిస్తోంది! ఆర్టీసీ స్థలాల్లో చమురు కంపెనీలు ఏర్పాటు చేసిన పెట్రోలు బంకులు రాజకీయ నాయకులకు కామధేనువు, కల్పవృక్షంగా మారాయి!!

స్థలాలు ఆర్టీసీవి! పెట్రోలు బంకులు చమురు కంపెనీలవి! నిర్వహణ పేరిట అడ్డగోలు దోపిడీ అధికార పార్టీ నాయకులది! ఆర్టీసీకి రావాల్సిన ఆదాయాన్ని అప్పనంగా దోచేస్తున్నారు! ఆర్టీసీ స్థలాలను లీజు పేరిట చెరబడుతున్న రాజకీయ నాయకులు.. సర్వీసు ప్రొవైడర్ల రూపంలో పెట్రోలు బంకుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కొల్లగొడుతున్నారు. ఆర్టీసీ ప్రారంభించిన పెట్రోలు బంకుల్లో సగానికి సగం ప్రజా ప్రతినిధి కూడా అయిన ప్రభుత్వంలోని కీలక నేత గుప్పిట్లో ఉన్నాయి. ఆయన, ఆయన అనుచరులు, బంధువర్గం బంకుల ద్వారా కాసులు వెనకేసుకుంటున్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి పెట్రోలు బంకులను ఏర్పాటుచేస్తే.. మాజీ మంత్రి ఒకరు చక్రం తిప్పి.. బంకుల నిర్వహణలో రాజకీయ నాయకులను చొప్పించారు. బంకుల ద్వారా వచ్చే రాబడిలో 60ు వాళ్లే తన్నుకుపోతున్నారు.

దోపిడీ ఇలా..! ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి ఏం చేయాలంటూ గతంలో అంతర్మథనం జరిగింది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేసి, వాటిని ఆర్టీసీయే నిర్వహిస్తే ఆదాయం వస్తుందని, నష్టాలు తగ్గుతాయని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. దాంతో, వివిధ బస్‌ స్టేషన్లు, డిపోల వద్ద ఖాళీగా ఉన్న స్థలాలను వినియోగంలోకి తేవడం ద్వారా వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. పట్టణాలు, నగరాల్లో తమకున్న చిన్న చిన్న స్థలాల్లో పెట్రోలు బంకులను ఏర్పాటు చేసి, విక్రయాలు సాగించాలని నిశ్చయించింది. 1000-1200 గజాలకుపైగా ఉన్న చిన్న చిన్న బిట్లను ఇందుకు ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115 అనువైన స్థలాలను గుర్తించింది. వీటిలో హైదరాబాద్‌ సిటీ జోన్‌లో 10, హైదరాబాద్‌ జోన్‌లో 49, కరీంనగర్‌ జోన్‌లో 56 స్థలా లు ఉన్నాయి. వీటిలో బంకుల ఏర్పాటుకు హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లతో చర్చలు జరిపింది.

తమ స్థలాలను లీజుకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. వీటిలో 90 వరకు స్థలాలను హెచ్‌పీసీఎల్‌ పేర, మిగతా స్థలాలను ఐవోసీ పేర లీజు డీడ్లు చేశారు. వాటిలో ఆయా కంపెనీ లు పెట్రోలు బంకులను ఏర్పాటు చేశాయి. వాటికి ఆథరైజ్డ్‌ డీలర్‌గా ఆర్టీసీ వ్యవహరిస్తుందని ఒప్పందం చేసుకున్నారు. ఇందుకుగాను లీటరు పెట్రోలుపై రూ.2.80; లీటరు డీజిల్‌పై రూ.1.70 చొప్పున ఆర్టీసీకి ‘రిటెయిలర్‌ మార్జిన్‌’ ఇవ్వాలని కంపెనీలు నిర్ణయించాయి. నిజానికి, ఈ బంకులను ఆర్టీసీ తన సిబ్బందితో నిర్వహించాలి. కానీ, సర్వీసు ప్రొవైడర్స్‌ పేరిట వాటి నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీ ప్రైవేటు సంస్థలకు ఔట్‌సోర్స్‌ చేసింది. ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో మాజీ మంత్రి ఒకరు చక్రం తిప్పారు. సర్వీసు ప్రొవైడర్ల ఎంపికలోనూ ఆయన మాటే శాసనమైంది. టెండర్ల దాఖలు సమయంలో సమాచారాన్ని లీక్‌ చేయించి, తక్కువ కోట్‌ చేసేలా పావులు కదిపారన్న ఆరోపణలున్నాయి. అంతేనా.. కేవలం సిబ్బంది, నిర్వహణ బాధ్యతలు చూసే సర్వీసు ప్రొవైడర్లకు ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ఏకంగా 60ు ఇచ్చేలా చక్రం తిప్పారు.

కీలక నేత గుప్పిట్లో బంకులు..ఆర్టీసీ నిర్వహిస్తున్న బంకుల్లోకి సర్వీసు ప్రొవైడర్లుగా అధికార పార్టీ నేతలు దూరారు. ఆర్టీసీ నిర్వహించే 115 బంకుల్లో ప్రభుత్వంలోని కీలక నేత, ఆయన అనుచరులు, బంధువర్గమే 56 బంకులను గుప్పిట పట్టింది. కరీంనగర్‌ జోన్‌లోనే సదరు నేత అత్యధిక బంకులను దక్కించుకున్నాడు. ఆర్టీసీకి దక్కాల్సిన ఆదాయంతో ఆయన పంట పండుతోంది. ఆర్టీసీకి లీటరు అమ్మకాలపై వస్తున్న మార్జిన్‌లో 60 శాతం పిండేస్తున్నారు. నిజానికి, ఇక్కడ స్థలాలు ఆర్టీసీవి. చమురు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నది ఆర్టీసీనే! ఆథరైజ్డ్‌ డీలర్‌ కూడా ఆర్టీసీనే. పెట్రోలు బంకులను ఏర్పాటు చేసింది చమురు కంపెనీలు. సర్వీసు ప్రొవైడర్ల బాధ్యత కేవలం సిబ్బంది నియామకం, నిర్వహణ. అంతకుమించి అవి చేసేదేమీ లేదు. కానీ, ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో వాటికి ఏకంగా 60ు ధారాదత్తం చేస్తున్నారు. అంటే, పెట్రోలుపై ఆర్టీసీకి లీటరుకు లభించే రూ.2.80; డీజిల్‌పై లభించే రూ.1.70పై రాజకీయ నాయకులకు 60%, ఆర్టీసీకి 40% దక్కుతోంది. అందుకే, రాజకీయ నాయకులు పెద్దఎత్తున బంకులను దక్కించుకుని, ఆర్టీసీ లాభాలను తన్నుకుపోతున్నారు.

           Courtyesy Andhrajyothi..

RELATED ARTICLES

Latest Updates