కొత్త భవనాల్నీ కూల్చివేస్తారా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • సీ, డీ, ఈ బ్లాకుల్లో పెద్దగా లోపాలు లేవు..
  • ఫైర్‌ సేఫ్టీ అధికారులు సూచనలు చేశారంతే!
  • ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు విస్మయం

హైదరాబాద్‌, అన్ని హంగులతో 2013లో నిర్మించిన సచివాలయ బ్లాకులను కూల్చివేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 2016లో ఫైర్‌ సేఫ్టీ అధికారులు సచివాలయ భవనాలను పరిశీలించి కొన్ని సూచనలు మాత్రమే చేశారని, వాటిని కూల్చివేయమని చెప్పలేదని గుర్తుచేసింది. సీ, డీ, ఈ బ్లాకుల్లో పెద్దగా లోపాలు లేవని నివేదిక స్పష్టం చేస్తోందని, అలాంటి వాటిని కూల్చి కొత్తగా నిర్మాణాలు చేపడతామంటే ఎలా అని ప్రశ్నించింది. పలు జిల్లా కోర్టుల్లో సరైన సౌకర్యాలు లేవని, ఫైర్‌సేఫ్టీ ఊసే లేదని, న్యాయాధికారులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారని గుర్తుచేసింది. జిల్లాల్లోని అన్ని కోర్టులు కూల్చివేసి అని సౌకర్యాలతో కొత్తవి కట్టాలని అడిగామా? అని వ్యాఖ్యానించింది. భవనాలకు తగిన మరమ్మతులు చేయడం ద్వారా తిరిగి వినియోగంలోకి తేవచ్చని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో 9 కోట్ల మంది ప్రజల అవసరాలకు సరిపడా ఉన్న సచివాలయ భవనాలు ఏపీ ఖాళీ చేసిన తర్వాత 4 కోట్ల మంది అవసరాలు సరిపడేలా లేవా? అని ప్రశ్నించింది. కావాలంటే 130 ఏళ్ల క్రితం 1888లో నిర్మించిన ‘జి’ బ్లాకు శిథిలావస్థలో ఉండి వినియోగానికి పనికిరాకుండా ఉన్నందున దాన్ని కూల్చి అక్కడ మరో భవంతి కట్టుకోవచ్చని వ్యాఖ్యానించింది. కొత్తగా నిర్మించ తలపెట్టిన సచివాలయ టవర్లకు ఎలాంటి డిజైన్లు సిద్ధం చేశారని అదనపు ఏజీని ప్రశ్నించింది. డిజైన్ల రూపకల్పన పనిని రెండు సంస్థలకు అప్పగించామని ఆయన కోర్టుకు తెలిపారు. ఆ వివరాలు కోర్టు పరిశీలనకు ఇస్తామని చెప్పారు. దీంతో విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.

ఆ రెండు నిర్ణయాలకు తేడా ఏమిటి?

సచివాలయ భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో నూతన భవనం నిర్మించడానికి జూన్‌ 27న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరం కన్వీనర్‌, తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు 2016లోనూ, ఆ తర్వాత దాఖలైన మరికొన్ని వ్యాజ్యాలను సోమవారం ధర్మాసనం విచారించింది. విశ్వేశ్వరరావు తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌రావు వాదించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భవనాలను మరో 50-70 సంవత్సరాల పాటు వినియోగించవచ్చని చెప్పారు. ‘‘2014లో రాష్ట్ర విభజన తర్వాత 3 బ్లాకులు తెలంగాణకు, 5 బ్లాకులు ఏపీకి కేటాయించారు. ఏపీకి కేటాయించిన భవనాలను 10 సంవత్సరాల పాటు వినియోగించుకునే హక్కు ఉన్నప్పటికీ వాటిని ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఈ భవనాలను కూల్చివేసి రూ.400 కోట్లతో 6లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇవి పూర్తయ్యే సరికి ఖర్చు రూ.1000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది’’ అని వివరించారు. ఎటువంటి ప్రణాళిక లేకుండానే నూతన భవనం నిర్మాణానికి ముందుకు వెళుతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.

నిర్ణయమా.. నివేదికా? ఏది ముందు?
అదనపు ఏజీ వాదిస్తూ… సచివాలయ భవనాల సముదాయం ఒకదానికొకటి దూరంగా ఉన్నాయని, పలు భవనాల్లో ఫైర్‌సేఫ్టీ లేదని తెలిపారు. వేసవి, వర్షాకాలల్లో ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సరైన పార్కింగ్‌ సౌకర్యాలు లేవని చెప్పారు. సచివాలయ భవనాలపై నియమించిన ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నివేదిక ఉందని తెలిపారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం.. భవనాలను కూల్చివేయాలన్న మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందా? నివేదిక ఆధారంగా కూల్చివేయాలని మంత్రి మండలి నిర్ణయించిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఏఏజీ బదులిస్తూ మంత్రిమండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడాన్ని ఆక్షేపించింది. అంతకు ముందు ఫైర్‌సేఫ్టీ అధికారులు భవనాలను తనిఖీలు చేసి స్వల్ప మార్పులు సూచించారని, ఆ మేరకు మరమ్మతులు చేసి అవసరమైన అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. ఈలోగా కోర్టు సమయం ముగియడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Courtesy Andhra Jyothy

RELATED ARTICLES

Latest Updates