‘లీజు’ వెనక..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • విలువైన ఆర్టీసీ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను
  • లీజు, రెంట్‌ పేరిట స్వాధీనానికి ఎత్తుగడ
  • 500 కోట్ల బస్‌ భవన్‌ స్థలానికి టెండర్‌
  • 33 ఏళ్ల లీజు పేరిట అన్యాక్రాంతం

అది హైదరాబాద్‌ నగరానికి నడిబొడ్డు! ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ సమీపంలోని బస్‌ భవన్‌! దాని పక్కనే పదెకరాల ఖాళీ స్థలం! ఇక్కడ గజం లక్ష రూపాయలపైనే! పది ఎకరాలూ కలిపితే దాదాపు రూ.500 కోట్లు! ‘33 ఏళ్ల లీజు’ పేరిట ఈ స్థలాన్ని హస్తగతం చేసుకోవడానికి పావులు కదిలాయి! ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేలా ప్రతిపాదనలు తయారు చేయాలని ప్రభుత్వంలోని ముఖ్య వ్యక్తి ఒకరు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

  • ‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రె్‌స్ట’కు ప్రతిపాదనలు
  • తెరవెనక చక్రం తిప్పిన ముఖ్య నాయకుడు
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మికులు, నేతలు
  • ఆర్టీసీ కళామండపం, గెస్ట్‌హౌస్‌ ప్రైవేటుకు
  • ఆర్మూరు స్థలం లీజులో ఎమ్మెల్యేకూ భాగం?
  • ఆరేళ్లుగా 2 కోట్ల్లు ఇవ్వకుండా బెదిరింపులు

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని బస్‌ భవన్‌ పక్కనున్న 10 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి పావులు కదిలాయి. గత ఏడాది జూన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) ప్రకటనను పత్రికల్లో జారీ చేశారు. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన ఎలా వినియోగిస్తే బాగుంటుందో.. ఏయే నిర్మాణాలు చేపట్టాలో ప్రైవేటు సంస్థలు ఆసక్తిని కనబర్చాలంటూ ప్రకటన ఇచ్చారు. గత ఏడాది జూన్‌ 30వ తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలని కోరారు. అదే రోజు బిడ్లను తెరుస్తామని కూడా పేర్కొన్నారు. ఇందుకు అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్య నేత ప్రోద్బలంతోనే ఈ ప్రకటన జారీ అయినట్లు అప్పట్లో ఆర్టీసీలో ప్రచారం జరిగింది.

అందుకే, తాము చెప్పిన మాట వినే సునీల్‌ శర్మనే ఆర్టీసీ ఎండీగా వేసి, కొనసాగిస్తున్నారని కార్మిక నేతలు ఆరోపించారు. ‘ఈవోఐ’ను కార్మిక వర్గాలు వ్యతిరేకించాయి కూడా. అత్యంత విలువైన ఈ స్థలంపై కన్నేసినందునే.. ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నిజానికి, బస్‌ భవన్‌ పక్కన పాత బస్‌ భవన్‌ కార్యాలయానికి సంబంధించిన 10.04 ఎకరాల ఖాళీ స్థలాన్ని రాంనగర్‌ చేపల మార్కెట్‌కు కేటాయించాలన్న ప్రతిపాదన గతంలో వచ్చింది. దీనిని కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బీవోటీ ప్రాతిపదికన ఈ స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని వైఎస్‌ ప్రభుత్వం మరోసారి ప్రయత్నించింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆర్టీసీ బస్‌ భవన్‌ ఉండేలా, పైన ఐదంతస్తులను నిర్మించి షాపింగ్‌ కాంప్లెక్స్‌గా మార్చాలని యోచించింది. ఇందుకు టెండర్లు కూడా పిలిచింది. సోమ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరిగాయి. కార్మికుల వ్యతిరేకతతో సర్కారు వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ స్థలాన్నిదక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారని కార్మికనేతలు ఆరోపిస్తున్నారు.

లీజు.. రెంట్‌.. ఆర్టీసీ స్థలాలు హాంఫట్‌
‘‘రూ.లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కబ్జా చేయడానికే సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్థలాలను లీజుకు తీసుకోవడానికి కుట్ర పన్నుతున్నారు. 20 శాతం రూట్లను జాతీయం చేయడం ద్వారా బంధువర్గం బస్సులను ఆర్టీసీలోకి చొప్పించాలని చూస్తున్నారు’’ అంటూ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాజకీయ నాయకులు, కార్మిక నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని నిజం చేసేలా లీజు, రెంటు అని ముద్దు పేర్లు పెట్టి ఆర్టీసీ ఆస్తులను ఎక్కడికక్కడ చెరబడుతున్నారు. పెద్ద పెద్ద కాంప్లెక్సులు, బడా మాల్స్‌ నిర్మించి అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని రూ.76 కోట్ల విలువైన 4 ఎకరాల టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ స్థలాన్ని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ సింగిల్‌ బిడ్‌తో 33 ఏళ్ల లీజుకు తీసుకున్న విషయాన్ని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఇంకా ఎక్కడెక్కడ లీజులున్నాయి!? స్థలాలు ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయన్న వివరాలను ఆరా తీయగా మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారాలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుండడం విశేషం.

ప్రైవేట్‌కు మండపం
ఆర్టీసీ కార్మికుల పిల్లల పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బాగ్‌లింగంపల్లిలో కళా మండపాన్ని నిర్మించారు. కార్మికులకు నామమాత్ర అద్దెకే దీనిని ఇచ్చేవారు. ఆర్టీసీలోని సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం దీని నిర్వహణ బాధ్యతలు చూసేది. కానీ, మూడేళ్ల కిందట దీనిని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చారు. అప్పటి మంత్రి ఒకరు చక్రం తిప్పి దానిని తన సన్నిహితులకు దక్కేలా చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కార్మికుల నుంచి దాదాపు రూ.20 వేలు వసూలు చేసేవారు. కానీ.. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల నుంచి కూడా రూ.45 వేలపైనే వసూలు చేస్తున్నారు. అలాగే, ఆర్టీసీ అధికారుల కోసం హైదర్‌గూడలో నిర్మించిన గెస్ట్‌హౌజ్‌ను కూడా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చారు. ప్రస్తుతం దానిని కాస్తా లాడ్జిలా మార్చేశారు. బయటి వ్యక్తులకు కూడా రూములను అద్దెకిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు వచ్చినా సామాన్యుల మాదిరిగానే అద్దె చెల్లించాల్సి వస్తోంది.

రూ.2 కోట్ల లీజుకు ఎమ్మెల్యే ఎసరు!!
ఆర్మూర్‌లో బస్టాండ్‌కు ఆనుకుని ఆర్టీసీకి చెందిన 7000 గజాల స్థలం ఉంది. విలువైన ఈ స్థలాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 2013 జూన్‌ 1న విశ్వజిత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే సంస్థకు లీజుకిచ్చారు. నెలకు రూ.3లక్షలు చెల్లించేలా 33 ఏళ్లపాటు లీజుకి ఇచ్చేలా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తితో ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లోనే మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పనులు నిలిచిపోయాయి. 2015 తర్వాత పాత కాంట్రాక్టర్‌తో హైదరాబాద్‌కు చెందినవారు ఒప్పందం చేసుకున్నారు. పనులు మళ్లీ ప్రారంభమై పూర్తి కావొస్తున్నాయి. ఈ ఒప్పందంలో టీఆఎర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందన్న ప్రచారం ఉంది. ఒప్పందంలో ఆయన, బంధువుల పేర్లు లేకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. ఇక, ఆరేళ్లకు సంబంధించిన లీజు మొత్తం రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆర్టీసీ అధికారులు నోటీసులిచ్చారు. లీజు చెల్లించకుండా అధికారులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని అంటున్నారు.

జిల్లాల్లో లీజుల వ్యవహారం

  •  కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని బస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలం ఉంది. పదేళ్ల కిందటే పాత బస్టాండ్‌ స్థలాన్ని 66 ఏళ్లకు ప్రతిమ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ్‌సకి లీజుకిచ్చారు. ఇక్కడ మల్టీప్లెక్స్‌ నిర్మించారు. ప్రతిమ మల్టీప్లెక్స్‌, బస్‌ స్టేషన్‌ మధ్యలో కరీంనగర్‌-1, కరీంనగర్‌-2 డిపోలున్నాయి. వీటి స్థలాన్ని కూడా లీజుకిచ్చి ఈ డిపోలను నగర శివారుకు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, కరీంనగర్‌ వర్క్‌షా్‌పనకు చెందిన అత్యంత ఖరీదైన స్థలంలో ఒక ఎకరాన్ని మినీ థియేటర్‌, పెట్రోలు బంకుకు అప్పగించేందుకు ప్రతిపాదనలు పంపించారు.
  •  కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్‌ పాత డిపోకు సంబంధించి నిజాం కాలం నాటి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఇటీవల సమీకృత కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణానికి తీసుకుంది. ప్రత్యామ్నాయంగా వేరే చోట ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కేటాయించలేదు

Courtesy Andhra Jyothy..

RELATED ARTICLES

Latest Updates