బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ముంబయి: టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. నాటకీయ పరిణామాల మధ్య గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడిగా నిలిచినట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జై షా కార్యదర్శిగా,  అరుణ్‌ ధూమల్‌ కోశాధికారిగా ఎన్నికవడం కూడా ఖరారైనట్లే. బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌కు అరుణ్‌ తమ్ముడు. నామినేషన్లకు సోమవారమే ఆఖరు తేదీ. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు. బీసీసీఐ అధ్యక్షుడైతే.. తప్పనిసరి విరామ నిబంధన వల్ల 2020 సెప్టెంబరులో అతడు ఆ పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. బీసీసీఐ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ఆదివారం ముంబయిలో సమావేశమయ్యారు. కీలక పదవుల్లో ఎవరుండాలన్నదానిపై వారి మధ్య చర్చ జోరుగా సాగింది. ముఖ్యంగా సౌరభ్‌ గంగూలీ, బ్రిజేష్‌ పటేల్‌ల మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా నడిచింది. మొదట శ్రీనివాసన్‌ సన్నిహితుడు బ్రిజేష్‌ పటేల్‌ అధ్యక్ష రేసులో ముందు నిలిచాడు. గంగూలీకి ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని భావించారు. అందుకు గంగూలీ తిరస్కరించాడట. అధ్యక్షుడిగా బ్రిజేష్‌ అభ్యర్థిత్వాన్ని ఎక్కువ రాష్ట్ర సంఘాలు కూడా వ్యతిరేకించినట్లు సమాచారం. ఆఖరికి గంగూలీకి బోర్డు అధ్యక్ష పదవి కట్టబెట్టి.. బ్రిజేష్‌కు ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే బిజేష్‌ ఇంకా అధ్యక్ష పోటీలోనే ఉన్నాడని కూడా బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ ఉత్కంఠకు సోమవారం తెరపడనుంది. అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు జరగాల్సి ఉంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates