భారత సంతతి ఆర్థికవేత్తకు నోబెల్‌ పురస్కారం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

స్టాక్‌హోం: అర్థశాస్త్రంలో ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీని వరించింది. ఈసారి ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు. ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమెర్‌లతో కలిసి అభిజిత్‌ బెనర్జీ ఈ అవార్డును అందుకోనున్నారు. మరో విశేషమేంటంటే అభిజిత్‌, ఎస్తర్‌ భార్యాభర్తలు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

కోల్‌కతా నుంచి అమెరికాకు..
58ఏళ్ల అభిజిత్‌ బెనర్జీ పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి హార్వర్డ్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఫోర్డ్‌ ఫౌండేషన్ ఇంటర్నేషనల్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. తన సహ పరిశోధకురాలు ఎస్తర్‌ డఫ్లోతో చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న అభిజిత్‌ బెనర్జీ.. 2015లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఎస్తర్‌ కూడా ఎంఐటీలో పేదరిక నిర్మూలన, ఆర్థిక రంగ అభివృద్ధిపై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఎస్తర్‌తో కలిసి 2003లో అబ్దుల్‌ లతిఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ను స్థాపించారు.

అమెరికాలో స్థిరపడినప్పటికీ భారత్‌లోని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అభిజిత్‌ పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన న్యాయ్‌పై అభిజిత్‌ స్పందిస్తూ.. నిధుల సమీకరణ కోసం పన్నుల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఈసారి ఇద్దరు మహిళలకు..
అర్థశాస్త్రంలో నోబెల్‌ ప్రకటనతో ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాలు ముగిశాయి. ఈ ఏడాది మొత్తం ఆరు రంగాల్లో 15 మందిని నోబెల్‌ పురస్కారాలు వరించాయి. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. అర్థశాస్త్రంలో ఎస్తర్‌ డఫ్లోకు నోబెల్‌ రాగా.. సాహిత్యంలో పోలండ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి ఓల్గా టోకార్‌జుక్‌కు ఈ పురస్కారం ప్రకటించారు.

అయితే 2018 సంవత్సరానికి గానూ ఓల్గాకు అవార్డు దక్కింది. లైంగిక వేధింపుల కుంభకోణం నేపథ్యంలో గతేడాది సాహిత్యంలో నోబెల్‌ పురస్కారాన్ని ఇవ్వలేదు. దీంతో ఆ సంవత్సర పురస్కారాన్ని కూడా గతవారం ప్రకటించారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates