ఆమె… ఆదివాసీల వాణి!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రూబీ హెమ్‌బ్రోమ్‌ సంథాల్‌… ఆదివాసీల గళం, అక్షరం! సంథాలీ గిరిజన తెగ సంస్కృతినీ, సాహిత్యాన్నీ, వారి జీవితాలనూ డాక్యుమెంట్‌ చేసి పుస్తకాల రూపంలో తెస్తున్నారామె. ఇందుకోసం ఐటీ ఉద్యోగాన్ని వదిలేశారు. ‘ఆదివాణి’ సీరీస్‌లో 19 సంపుటాలను ప్రచురించారు. భారతదేశంలో తొలి సంథాల్‌ పబ్లిషింగ్‌ హౌస్‌కు శ్రీకారం చుట్టి, ఆ తెగకు చెందిన తొలి మహిళా ప్రచురణకర్తగా గుర్తింపు పొందారు. తన జీవిత ప్రయాణం గురించి ఆమె మాటల్లో…

‘‘జార్ఖండ్‌లోని బెనగారియా గ్రామంలో కొన్నాళ్లు మా కుటుంబం ఉంది. ఆ తర్వాత షిల్లాంగ్‌ వెళ్లాం. 1970లో కోల్‌కతాకు వచ్చి స్థిరపడ్డాం. నేను పుట్టి పెరిగింది కోల్‌కతాలోనే! అక్కడి ‘లా మార్టినైర్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌’లో పాఠశాల విద్య చదివా. కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నా. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్‌ కోర్సు చేశా.

ఆదివాసీల గళం వినిపిద్దామనే…
అంతరించిపోతున్న ఆదివాసీల కథలను బయటకు తీసుకురావాలనే తపన చిన్నతనం నుంచీ ఉండేది. అందుకే వారి గళాలు, జీవిత కథలు, చరిత్రకు సంథాలీ భాషలో అక్షరరూపం ఇవ్వాలని భావించా. ఆ పని కోసం ఉద్యోగాన్ని వదిలేశా. నేనూ సంథాల్‌ తెగకు చెందినదాన్నే. అందుకే నా వాళ్లకి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ప్రచురణ రంగంలోనూ ఆదివాసీల పట్ల వివక్షను గమనించా. వెంటనే పబ్లిషింగ్‌ కోర్సు చేశా. సంథాల్‌ తెగకు చెందిన జానపద కథలు సేకరించడం మొదలెట్టా. వందల సంవత్సరాలుగా ఆదివాసీ జీవితాల్లో మౌఖికంగా కొనసాగుతూ వస్తున్న కథలకు సైతం అక్షరరూపం ఇవ్వసాగాను. సంథాల్‌ భాషలోనే ఆదివాసీల జీవితాలనూ, సంస్కృతినీ, కథలనూ పుస్తకాలుగా తీసుకురావాలని ‘ఆదివాణి ’ సంస్థకు 2012లో శ్రీకారం చుట్టా. ఇందులో నాతో పాటు గిరిజన యువకుడు జాయ్‌ తుడు, మెక్సికన్‌ జర్నలిస్ట్‌, ఇలస్ట్రేటర్‌, ఆదివాసీ తెగల కళల పట్ల ఆసక్తి ఉన్న బోస్కి జైన్‌ ఉన్నారు. ‘ఆదివాణి’ లోగో రూపొందించింది బోస్కీనే.

దాచుకున్న డబ్బుతో…
మేము ముగ్గురం దాచుకున్న డబ్బుతో పబ్లిషింగ్‌ హౌస్‌ ఏర్పాటు చేశాం. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి అప్పులు తీసుకున్నాం. తొలినాళ్లల్లో ిసీడీసీ ప్రింటర్స్‌ వాళ్లు మా పుస్తకాలను ఉచితంగా ప్రచురిస్తామన్నారు. అప్పుడప్పుడు విదేశీ సంస్థల నుంచి కూడా డొనేషన్లు వచ్చేవి. ఆదివాసీ స్కాలర్లు, పరిశోధకులు నిధులు పంపుతుంటారు. ఎడిటర్‌గా ఆర్టికల్స్‌ రాయడం, ఆదివాసీలకు చెందిన పలు అంశాలపై ప్రసంగాలు ఇవ్వడం, రకరకాల అసైన్‌మెంట్లు చేపట్టడం, ఫెలోషిప్పుల ద్వారా వచ్చిన డబ్బును ‘ఆదివాణి’ కోసం ఖర్చుపెట్టడం వంటి పనులు చూసుకునేదాన్ని.

ఇప్పటి వరకూ ‘ఆదివాణి’ 19 పుస్తకాలను ప్రచురించింది. ప్రధానంగా మౌఖిక రూపంలో ఉన్న ఆదివాసీ సాహిత్యానికి అక్షరరూపం ఇవ్వడంతోపాటు గ్రాఫిక్‌, యానిమేషన్‌, పాటల రూపంలో కూడా వీటిని తెచ్చాం. సంథాల్స్‌ గిరిజన తెగవాళ్లు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, అస్సాంలో ఉన్నారు. ఆదివాసీల చేతుల్లో శక్తివంతమైన ‘సాహిత్య ఆయుధం’ ఉండడంతో వాటన్నింటినీ రికార్డు చేసేవాళ్లం. చరిత్రలో మా గురించి రాసిన తప్పుడు సమాచారంపై ఎలుగెత్తి సవాలు చేయాల్సిన స్థితి తలెత్తింది. అందుకే ఆదివాసీల్లోని ఒక తెగ అయిన సంథాల్‌ తెగ సమగ్ర సమాచారాన్ని రికార్డు చేయాలనుకున్నాం.

పుస్తకాలు ప్రచురించాలని…
‘ఆదివాణి’ ద్వారా మేము చేస్తున్నది తక్కువే. డాక్యుమెంట్‌ చేయడమంటే దాన్ని మానవ చరిత్రలో శాశ్వతం చేయడం. మనం కోల్పోయిన మన పూర్వీకుల సంప్రదాయ విజ్ఞానం ఎంతో ఉంది. మౌఖికంగా కొనసాగుతున్నా క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. వీటితో పాటు ఆధిపత్య సంస్కృతులు, భాషలు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలు, భాషా సాహిత్యాలను వెనక్కినెడుతూ వచ్చాయి. ఆదివాసీలకు ప్రత్యేక మాతృభాష, పద సంపద, వ్యాకరణం ఉంటాయి. ‘ఆదివాణి’లో రచనలు చేసే వారంతా ఆదివాసీలే. రెండు పుస్తకాలు – ఒకటి సంథాలీలో, రెండోది హిందీలో తప్ప మిగిలిన పుస్తకాలన్నీ ఆంగ్లంలోనే తెచ్చాం. ఇంగ్లీషులోని పుస్తకాలను సంథాలీ భాషలోకి అనువదిస్తాం. ఆదివాణిలోని ‘వన్‌ ఆఫ్‌ అజ్‌’ శీర్షిక కింద ఆదివాసీయేతర రచయితలు రాసిన గిరిజనుల అంశాలను ప్రచురిస్తాం.

మా అమ్మ ఎల్వీనా సంథాల్‌ న్యూస్‌ లెటర్‌కి కోశాధికారిగా, నాన్న టిమోథియాస్‌ ‘సంపాదకులు’గా ఉన్నారు. మా న్యూస్‌ లెటర్‌కు రాసే వాళ్లెవ్వరూ ప్రొఫెషనల్‌ రాతగాళ్లు కారు కానీ ఆయా రచనల్లో వారి వారి సంస్కృతికి సంబంధించిన వ్యక్తీకరణతోపాటు రాజకీయ వ్యాఖ్యానం జాలువారుతుంటుంది. సంథాలీని ఐదు అధికారిక స్ర్కిప్టుల్లో అంటే బంగ్లా, దేవనాగరి, ఒడియా, రోమన్‌, ఓల్‌ చికిలో రాయొచ్చు. ఆదివాసీల గురించి ఆంగ్లంలో డాక్యుమెంట్‌ చేయకపోతే వారిని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లోకి ఆదివాసీ జీవితాలు, సంస్కృతీ వెళ్లవు. అందుకే ఆంగ్లంలో పుస్తకాలను ప్రచురించడంపై విమర్శలు వచ్చినా అది వ్యూహాత్మకంగా మేము చేపట్టిన ఎత్తుగడ. ఈ పని చేయకపోతే ఆదివాసీలు తమ చరిత్రను కోల్పోతారు.

చేయాల్సింది ఎంతో ఉంది…
తొలుత చిన్నపిల్లల కథలను రాశాం. ఇప్పటి ఆదివాసీ పిల్లలు ఆదివాసీ సంప్రదాయాల మధ్య పెరగడం లేదు. మానవ జీవనశైలిలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం. ఆదివాసీల భూములను గనుల కంపెనీలు ఆక్రమించుకోవడంవల్ల వారి సంప్రదాయ జీవనశైలి కనుమరుగవుతోంది. మా ప్రచురణల్లో ఆదివాసీల జీవితాలు, వారిపై జరుగుతున్న ఘోరాలు, వారు అనుభవిస్తున్న పేదరికం, అభివృద్ధిలేమి వంటి వాటిని తెలియజేస్తున్నాం. పిల్లల కోసం ఆదివాణీ సంథాల్‌ క్రియేషన్‌ స్టోరీ్‌సని రాశాం. 1855-57లో సంథాల్‌ తిరుగుబాటుకు సంబంధించి ‘డిజైబోన్‌-హుల్‌’ పేరుతో తెచ్చిన బొమ్మల పుస్తకానికి బహుమతి కూడా వచ్చింది. ‘ఆదివాణీ’ ప్రచురణల ద్వారా ఆదివాసీలకు అండగా ఉండడం ఆనందంగా ఉన్నా మేము చేస్తున్నది అణువంత మాత్రమే, చేయాల్సింది కొండంత ఉంది’’.

ఎన్నో చేదు అనుభవాలు!
‘‘స్కూల్‌ చదువు నాకు చేదు అనుభవాలనే మిగిల్చింది. ఒకసారి నా తరగతిలోని ఒక అమ్మాయి తన షూను పాలిష్‌ చేసుకుంటూ ‘నీ ముఖాన్ని కూడా దీంతో పాలిష్‌ చేసుకోవచ్చు కదా’ అంది. నేను జార్ఖండ్‌ నుంచి వచ్చిన ఆదివాసీనని చెప్పినపుడు ‘మీరు మనుషులను తింటారా? చెట్ల మీద జీవిస్తారా?’ అని అడిగింది. ఇంగ్లీషులో మాట్లాడడం వల్లే ఆదివాసీనైనా కూడా నాకు ఐటీ ఉద్యోగం వచ్చింది.’’

ఆకట్టుకునే ఆదివాసీ కథలు!
‘‘చిన్నతనం నుంచీ ఆదివాసీల కథలు వింటూ పెరిగా. మా మాటల్లో ఎన్నో సామెతలు, నానుడులు, చమక్కులు, హాస్యం, వ్యంగ్యం ఉంటాయి. ఆదివాసీ సంప్రదాయ పాటలు నేర్చుకున్నా. అమ్మానాన్నలు చెప్పే ఆదివాసీల కథల్లోని హాస్యం నన్ను, మా సిస్టర్‌ని నవ్వించేది. చుట్టాల ఇళ్లకు వెళ్లినప్పుడు మాతో పాటు బోలెడు ఆదివాసీల కథలను మోసుకెళ్లేవాళ్లం. పుస్తకాలతో అనుబంధం స్కూలుకు వెళ్లడం వల్ల ఏర్పడినదే! అందుకే పుస్తకాలకు, ఆదివాసీలకు మధ్య ఉన్న ‘అక్షరాల’ అంతరాన్ని చెరిపేందుకే ప్రచురణరంగంలోకి వచ్చాను’’.

Courtesy Andhra jyothy

RELATED ARTICLES

Latest Updates