ఏం‘దయా’ ఇది!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆర్టీసీ ఆస్తులు గుప్పిట పట్టిన ఎంపీ..
  • 76 కోట్ల విలువైన 4 ఎకరాలకు టెండర్‌
  • హన్మకొండలో ఆర్టీసీ టైర్‌ రీట్రేడింగ్‌
  • సెంటర్‌ మూయించి కార్మికులను పంపించి..
  • సింగిల్‌ బిడ్‌తో దయాకర్‌కు 33 ఏళ్ల లీజు
  • అక్కడ మల్టీప్లెక్స్‌, మాల్‌ నిర్మాణానికి ప్లాన్‌
  • అరణ్య రోదనగా మారిన కార్మికుల ఆవేదన

అది వరంగల్‌ – ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్‌ రోడ్డు! అక్కడ గజం రూ.40 వేలకుపైమాటే! పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ ఉండేది! దాదాపు నాలుగెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్లో 150 మందికిపైగా కార్మికులు పని చేసేవారు! ఆ సెంటర్‌ను మూసేశారు! కార్మికులను పంపేశారు! ఇప్పుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్‌ సొంతమైంది!

హన్మకొండ హంటర్‌ రోడ్డులో ఉండే ఆర్టీసీ టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ స్థలానికి ‘టెండర్‌’ పెట్టి.. సింగిల్‌ బిడ్‌ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్‌ దానిని 33 ఏళ్ల లీజుకు దక్కించుకున్నారు! కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చి కుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు! హన్మకొండ హంటర్‌ రోడ్డులో దాదాపు 25 ఏళ్ల కిందట టైర్‌ రీ ట్రేడింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్‌ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన 6 జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రీట్రేడింగ్‌ చేసేవారు. కాల క్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ఏరియాగా మారింది. భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక్కడ ఎకరా విలువ రూ.19 కోట్లకుపైమాటే! అంటే, 4 ఎకరాలు కలిపి రూ.76 కోట్లు! దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది.

ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్‌తో ఎటువంటి ఉపయోగం లేదని, దీని కారణంగా ఆర్టీసీకి అపార నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ను మూసేశారు. ఆ తర్వాత, ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశలవారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత, అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ పసునూరి దయాకర్‌ తెర మీదకు వచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలిచారు. సింగిల్‌ బిడ్‌తోనే ఏకంగా 33 ఏళ్లకు ఎంపీ దయాకర్‌ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకూ నెలకు రూ.5 లక్షల చొప్పున ఏడాదికి రూ.60 లక్షలు అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్‌ సెంటర్లో భవనం, ఇతర యంత్రాలు ఉన్నాయి కదా! ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్‌ పిలిచారు. ఈ టెండర్‌ కూడా రూ.15 లక్షలకు పసునూరి దయాకర్‌కే దక్కడం విశేషం. టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్‌ థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు.

ఎంపీ గారూ.. మీకిది న్యాయమా..టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ను తరలించవద్దని, దానిని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు. రీట్రేడింగ్‌ సెంటర్‌ను తరలించవద్దంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్‌ సెంటర్‌ అన్యాక్రాంతం అవుతోందంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్క్‌ ఎదురుగా రిలే నిరాహర దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా.. పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. కానీ, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, భూ దందాలు, కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్‌ ఈ టైర్‌ రీట్రేడింగ్‌ సెంటర్‌ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనక ఎవరో ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ.. మాకు అండగా నిలవాల్సింది పోయి.. అన్యాయం చేస్తారా!? అని ప్రశ్నిస్తున్నారు.

Courtesy Andhrajyothi..

 

 

RELATED ARTICLES

Latest Updates