మూలవాసి యుద్ధగానం ఉపాళి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఉపాళి పాటకు పూలే-, అంబేడ్కర్‌ అందించిన మూలవాసి తాత్వికత భూమికగా ఉండేది. అందుకే నిశబ్దాల అవనిలో శబ్దం పుట్టిం చిన వాణ్ణి, శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినవాణ్ణిఅని ధిక్కారంగా పలికాడు. ఈ ధిక్కారం దండోరా అందించిన చూపునుంచి వచ్చింది.

దళిత సాహిత్యాన్ని పదునెక్కించిన పాటకు మూలవాసి తాత్వికతను అద్దిన వాగ్గేయకారుడు ఎర్ర ఉపాళి. తెలంగాణ ఉద్యమాల చరిత్రకు తనవంతు కృషిని జతచేసిన జాంబవంతుని వారసుడు. పల్లెపల్లెన పాటల డప్పై మోగినవాడు. దళిత సాహిత్యం ఉవ్వెత్తున ఎగసిన తొంభయ్యవ దశకమే ఉపాళిని కన్నది. భారత దేశంలో వర్గపోరాటం మాత్రమే విముక్తిని సాధించలేదని దానికి కులచైతన్యం కూడా అవసరమని భావించాడు మారోజు వీరన్న. వీరన్న జీవించిన కాలంలోనే మాదిగ వాగ్గేయకారునిగా కన్ను తెరిచాడు ఉపాళి. అప్పటి వరకు తనకు తెలిసిన పల్లె పాటలను పాడుకుంటూ ఊరూర తిరిగేవాడు. అలాంటి ఉపాళికి వీరన్న సిద్ధాంతం ఎంతో నేర్పింది. మరోవైపు గద్దర్‌ పాటల ప్రభంజనం ఉపాళిని ఆలోచింపజేసింది. దీంతో పాటంటే ప్రజలను ఆలోచింపజేసేదే కావాలి తప్ప, ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదని విశ్వసించాడు.

ఉపాళి పాటల్లో మూలవాసి సిద్ధాంతం ప్రతిధ్వనించేది. ఏది రాసినా చారిత్రిక కోణం నుంచి చెప్పుకురావడం ఆయన ప్రత్యేకత. ఈ దేశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలదని బలంగా నమ్మాడు. బహుజనుల ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న మనువాదం మీద మంటలై మండినవాడు ఎర్ర ఉపాళి. ఆయన కలంలో, గళంలో ఒక నిప్పుల సెగ ఉండేది. దగాపడ్డ బతుకుల్లో ఉండే డప్పుల ధర్మాగ్రహం లావాలా ప్రవహించేది. మిగిలిన వాగ్గేయకారుల్లాగా ఉపాళి ఏది పడితే అది రాయలేదు. ఆయన పాటకు పూలే- అంబేడ్కర్‌ అందించిన మూలవాసి తాత్వికత భూమికగా ఉండేది. అందుకే ‘నిశబ్దాల అవనిలో శబ్దం పుట్టించిన వాణ్ణి, శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినవాణ్ణి’ అని ధిక్కారంగా పలికాడు. ఈ ధిక్కారం దండోరా అందించిన చూపునుంచి వచ్చింది.

గ్రామీణ యువతకే కాదు, యూనివర్సిటీ వరకు వచ్చినవారికి సైతం తమ మూలాల గురించి తెలుసుకోవాలంటే ఉపాళి పాటలే ఆధారంగా నిలిచాయంటే ఆ పాటల ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఉపాళి పాట ఒక ఎడ్యుకేషన్‌. అణిచివేయబడుతున్న ఆధిపత్య శక్తుల మీద చేయవలసిన జ్ఞానపోరాటానికి దిశానిర్దేశం చేసే దిక్సూచి.

ఉపాళి కృషికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. తన పాటలను కనీసం రికార్డు చేసుకోలేని దుర్భర దారిద్య్రం ఆయన బతుకంతా వెంటాడింది. ౨0ఏళ్ళ క్రితం ‘పల్లె గొంతుల పాట’ అని తన పాటలను పుస్తకంగా వేసుకున్నాడు. ఆ తరువాత వందలాది బహుజనోద్యమ పాటలు రాశాడు. కానీ, వాటన్నింటిని అచ్చులోనో, ఆడియో రూపంలోనో తీసుకురాలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అయినా సరే తన పాటలు ప్రతీ సభలోను నిత్యం వినబడుతూనే ఉన్నాయి. మండే నెత్తురులాంటి పాటలకు పురుడుపోశాడు ఉపాళి. అణగారిన వారిని ఆలోచింపజేసే పాటలు రాశాడు. మూడువేల యేండ్లుగా పోరాడుతున్న దళిత, బహుజనులు అలిసిపోవద్దు, మరింత శక్తితో పోరాడాలని ఆశించాడు. ఇవాళ ఊరూరా పాటల జడివానను కురిపిస్తున్న ఏపూరి సోమన్నలాంటి వారిని తీర్చిదిద్దిన ప్రత్యక్ష స్ఫూర్తి ఎర్ర ఉపాళి.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ధూంధాం ఏర్పాటులో భాగస్వామి. తెలంగాణ ఉద్యమానికి పాటల దోసిలి పట్టిన వాగ్గేయకారుడు. తెలంగాణ సాధనలోనే ఈ ప్రాంత విముక్తి ఉందని భావించినవాడు. తెలంగాణను సాధించినా ఉపాళికి ఒరిగింది మాత్రం ఏమిలేదు. ఆకలి కడుపుతోనే జీవించాడు. ఆఖరికి ఆరోగ్యాన్ని కూడా బాగుచేయించుకోలేని దీనస్థితికి ఒక ప్రజాకళాకారుడు నెట్టివేయబడడం అత్యంత విషాదకరం.

పెద్ద చదువులు చదువుకోకున్నా ఉపాళి పాటల్లో ప్రయోగించిన పదాలు, పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. దండోరా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను గురించి ఉపాళి రాసిన పాట ఏపూరి నోట నేటికీ సజీవంగా రెండు రాష్ట్రాల్లోను వినిపిస్తూనే ఉంది. ‘మాదిగోణ్ణి మహా ఆదివాణ్ణి’అంటూ ఉపాళి ధిక్కారంగా, తిరుగుబాటుగా ‘ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోణ్ణి’ అంటాడు. ఈ స్పష్టమైన మూలవాసీ వైఖరి ఉపాళిలో బలంగా ఉండేది. మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థపై నిప్పుకణికల్లాంటి చురకలు విసిరేవాడు.

ఉపాళికి శత్రువు స్పష్టంగా కనిపించేవాడు. ఈ జాతులు ఇట్లా హక్కుల నిరాకరణకు గురికావడానికి కారణం ఆయనకు తెలుసు. అందుకే తాను పాటల పదాలల్లో కొత్తశక్తిని నింపేవాడు. అవి గాయకుని నోటినుంచి బయటికొచ్చిన మరుక్షణం రాకెట్‌ లాంచర్లలా పేలేవి. అవే ఉపాళిని నిలబెట్టాయి. మాస్టార్జీ, నాగప్పగారి సుందర్రాజు, గ్యార యాదయ్యలు అందించిన దృష్టిని మరింత పటిష్ఠం చేసి పాటల్లోకి ఒంపిన మహా వాగ్గేయకారుడు ఉపాళి.

ఉపాళి పాట ఎత్తుకుంటే వింటున్న వాళ్ల నెత్తురు మరిగేది. ఈ దేశాన్ని పాలించిన జాంబవంతుని వారసులుగా జీవించాలి. అందుకే ఎప్పటికైనా రాజ్యాధికారాన్ని సాధించాలని కలలుగన్నాడు. వర్గీకరణ సమస్య పరిష్కారమై దళితుల మధ్య ఐక్యత వెల్లివిరియాలని ఆకాంక్షించాడు. అందుకోసం ఎన్నో పాటలు రాసి, ఊరూరా ప్రచారం చేశాడు. దండోరా సభల కోసం ఉపాళి పాటలు రచించి, పాడాడు. అంబేడ్కరిజం అందించిన చూపుతో తన పేరును ఉపాళిగా మార్చుకున్నాడు. ఆనాడు బుద్ధుని శిష్యుడు ఉపాళి ఎలా ఈ సమాజ పరివర్తన కోసం పరితపించాడో, ఎర్ర ఉపాళి కూడా అంతే నిబద్ధతతో పాటు పడ్డాడు. అకాల మరణాల జాబితాలో ఉపాళి పేరు కూడా చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల దళిత, బహుజనులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జాతి విముక్తి కోసం ఇంత పాటుపడిన ఉపాళి మహనీయుల జీవితాల్లోని వ్యక్తిగత క్రమశిక్షణను అలవర్చుకోలేకపోయాడు. జాతి కోసమే పరితపిస్తూ తన ఆరోగ్యాన్ని, నమ్ముకున్న కుటుంబాన్ని ఎక్కడో మరిచిపోయాడు. తన పాటలను జాతి గుండెలకు చేర్చి చెప్పకుండా వెళ్లిపోవడం కన్నీళ్లను తెప్పిస్తున్నది. మాదిగ జాతి పాట ఉన్నంత కాలం ఉపాళి బతికే ఉంటాడు. ఉపాళికి చావు లేదు! ఉపాళి పాటకు మరణం లేదు!

పసునూరి రవీందర్‌

RELATED ARTICLES

Latest Updates