ఇక ఎన్‌ఆర్సీ లొల్లి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– అంతకుముందే పార్లమెంట్‌కు పౌరసత్వ సవరణ బిల్లు..
ముస్లిమేతర శరణార్థులకు రక్షణ కల్పించే చట్టం…
సంఫ్‌పరివార్‌ విభజన రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ…!!
మోడీ సర్కార్‌ ఆర్థిక వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే యత్నం..!!!

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ ఘోరంగా వైఫల్యం చెందిందన్న ఆర్థికవేత్తల విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకు హిందూత్వ అతివాదులు కొత్త ఎత్తుగడల్ని రూపొందిస్తున్నట్టుగా అర్థమవుతోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్సీ)ని రూపొందిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. కోల్‌కతాలో హౌంమంత్రి అమిత్‌షా ఇటీవల చేసిన ప్రకటనపై ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు మొదలయ్యాయి. ఎన్‌ఆర్సీని అమలు చేయడం ద్వారా బెంగాల్‌ నుంచి విదేశీయుల్ని తరిమికొడ్తామంటూ అమిత్‌షా పదేపదే ప్రకటనలు గుప్పించిన విషయం తెలిసిందే.
అయితే, 1955 పౌరసత్వ చట్టానికి సవరణ బిల్లు(సీఏబీ)ను నవంబర్‌లో ప్రారంభయ్యే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెడ్తామని అమిత్‌షా తెలిపారు. శరణార్థులకు రక్షణ కల్పించేందుకే ఈ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తెస్తున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన హిందువులు,బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్శీలు, క్రైస్తవులను శరణార్థులుగా పేర్కొంటూ ఇప్పటికే సీఏబీని రూపొందించారు. ముస్లింలు అధికంగా ఉన్న ఆ దేశాల నుంచి వలస వచ్చిన మైనారిటీ వర్గాలను (ముస్లిమేతరులను) శరణార్థులుగా గుర్తించాలన్నది సంఫ్‌ుపరివార్‌ వాదన. శరణార్థులుగా వచ్చినవారు ఆరేండ్లపాటు భారత్‌లో నివాసమున్నట్టు ఆధారాలు చూపితే వారికి పౌరసత్వం కల్పించేలా సీఏబీలో పేర్కొన్నారు. 1955 చట్టంలో ఇది 11 ఏండ్లుగా ఉన్నది. సీఏబీకి మోడీ సర్కార్‌-1 కాలంలోనే లోక్‌సభ నుంచి ఆమోదం లభించింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి నిరసన దృష్ట్యా రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా నిలిపివేశారు. ఇప్పుడది చట్టరూపం దాల్చాలంటే తిరిగి ఉభయసభల ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఆ చట్టం రాజ్యాంగ సమ్మతమేనా అన్నది సుప్రీంకోర్టులో తేలాల్సి ఉంటుంది.
ఎన్‌ఆర్సీకీ సీఏబీని లింక్‌ చేయడమెందుకు..?
అసోంలో కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిన ఒప్పందం మేరకు ఎన్‌ఆర్సీ అమలులోకి వచ్చింది. మోడీ సర్కార్‌ అధికారం చేపట్టిన తర్వాత ఎన్‌ఆర్సీ అంశం సుప్రీంకోర్టు పర్వవేక్షణలోకి వెళ్లింది. దాంతో,అసోంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ ఏడాది ఆగస్టు 31న విడుదల చేసిన అసోం జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్సీ) తుది జాబితాలో 3 కోట్ల 11 లక్షల 21 వేల 4 మందికి చోటు దక్కగా, 19 లక్షల 6 వేల 657 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తొలగించబడిన 19 లక్షలమందిలో హిందువులు పెద్ద సంఖ్యలో ఉండటంతో బీజేపీ అనుకూల సంఫ్‌ుపరివార్‌ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో, ఎన్‌ఆర్సీకి సీఏబీని లింక్‌ చేయడం ద్వారా ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలవుతుందని సంఫ్‌ుపరివార్‌ ఎత్తుగడ. సీఏబీ పట్ల ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీయులుగా తేలినవారు ఏ మతానికి చెందినవారైనా సరే పౌరసత్వం కల్పించొద్దనేది వారి వాదన. మరోవైపు మతాల ప్రాతిపదికన సీఏబీని రూపొందించడాన్ని వామపక్షాలుసహా లౌకిక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగంలోని 14వ అధికరణం హామీ ఇచ్చిన కుల, మతాలకు అతీతమైన సమానత్వపు హక్కుకు సీఏబీ విరుద్ధంగా ఉన్నదని వారు చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్‌ఆర్సీతోపాటు సీఏబీని అమలులోకి తేవడం తమ బాధ్యత అని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా బీజేపీ ఇవ్వనున్న సందేశమేమిటి..? భారత పౌరసత్వం పొందాలంటే..ముస్లింలైతే కనీసం 11 ఏండ్లు నివాసమున్నట్టు ధ్రువీకరించుకోవాలి. ఇతర మతస్థులు మాత్రం ఆరేండ్లుంటే చాలు పౌరసత్వం పొందొచ్చు. వాస్తవానికి ముస్లిమేతరులకు మోడీ సర్కార్‌ కొన్ని వెసులుబాట్లను ఇప్పటికే కల్పించింది. పాస్‌పోర్టు చట్టం 1920, విదేశీయుల చట్టం 1946కు 2015, 2016లో కొన్ని సవరణలు చేసింది. వాటి ప్రకారం 2014, డిసెంబర్‌ 31కి ముందు ఆ మూడు దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులు ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోయినా వెనక్కి పంపడం లేదా నిర్బంధించడంగానీ జరగదు. అదే ముస్లింల విషయంలో ఈ రక్షణ ఉండదు. మత విభజన రాజకీయాల ద్వారానే బీజేపీ లబ్ది పొందుతోందన్న లౌకిక పార్టీల విమర్శలకు ఇలాంటివన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అసోంలో చేపట్టిన ఎన్‌ఆర్సీ ప్రక్రియ వల్ల హిందువులకు కూడా నష్టం జరిగిందని భావించిన బీజేపీ సీఏబీపై ప్రచారం సాగిస్తోంది. ఇప్పటికే అమిత్‌షా ప్రతిపాదనకు దాదాపు 10 రాష్ట్రాల బీజేపీ అగ్ర నేతలు మద్దతు తెలిపారు. వీరిలో కొందరు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఎన్‌ఆర్సీని తమ రాష్ట్రంలోనూ చేపట్టాలని ఢిల్లీ, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్‌(సీఎం యోగి ఆదిత్యనాథ్‌), హర్యానా, రాజస్థాన్‌, ఒడిషా, జార్ఖండ్‌(సీఎం రఘుబర్‌దాస్‌), మణిపూర్‌(సీఎం ఎన్‌.బిరేన్‌సింగ్‌), బీహార్‌ రాష్ట్రాల బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. విదేశీయుల నిర్బంధ కేంద్రాలను బీజేపీ పాలిత మహారాష్ట్ర , గోవాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

Courtesy Nava telangana…

RELATED ARTICLES

Latest Updates