సార్లు.. బడి ముఖం చూసి ఏళ్లు..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాష్ట్రంలో పాఠశాలలకు రాని టీచర్ల సంఖ్య 106
అయిదేళ్లుగా 22 మంది డుమ్మా రంగారెడ్డి జిల్లా నుంచే 15 మంది

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఏడాది, ఆపైబడి ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవుతున్న  ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 జిల్లాల్లో ఇలాంటి 106 మందిని గుర్తించగా.. వారిలో 15 మంది ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఉండటం గమనార్హం. ఇలా విధులకు రాని ఉపాధ్యాయుల సమాచారాన్ని అందజేయాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలను కోరింది. ఈ క్రమంలో అసలు గుట్టు బయటపడింది. హైదరాబాద్ నుంచి తొమ్మిది మంది, సిద్దిపేట, జనగామ, మెదక్ జిల్లాల నుంచి ఆరుగురు చొప్పున సంగారెడ్డి-5, యాదాద్రి, ఖమ్మం, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి నలుగురు చొప్పున ఉన్నట్లు గుర్తించారు. వికారాబాద్, కామారెడ్డి, మహబూబాబాద్, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ముగ్గురేసి. ఇతర జిల్లాల్లో ఒక్కొక్కరు వంతున ఉన్నట్లు డీఈవోలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ కు సమాచారం పంపారు. మొత్తం డుమ్మా ఉపాధ్యాయుల్లో అయిదేళ్ల నుంచి విధులకు రానివారూ ఏకంగా 22 మంది ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు ఏం చేస్తున్నట్లు.. అన్న ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. వాస్తవానికి కరీంనగర్ డీఈవో వెబ్ సైట్లో ఎప్పటి నుంచో ఇలాంటి ఉపాధ్యాయుల జాబితాను పెట్టడం గమనార్హం. వీరందరికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొని, కమిటీల సిఫారసు మేరకు వారిని విధుల నుంచి తొలగిస్తామని విద్యాశాఖాధికారి ఒకరు తెలిపారు.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates