ఊడుతున్న లక్షలాదిమంది ఉద్యోగాలు : మోడీ వైఫల్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సవేరా

భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. ఈ తీవ్ర సంక్షోభాన్ని ప్రధాన మీడియా తక్కువగా అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం అదే తరహాలో ఆలోచిస్తోంది. ఆర్థికవృద్ధి క్షీణత (5శాతానికి పడిపోయింది), పెట్టుబడుల తగ్గుదల, బ్యాంక్‌ రుణాల స్తంభన, కొనుగోళ్ల తగ్గుదల లాంటి స్థూల ఆర్థిక సూచికలనే ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటిని పరిశీలించాల్సిందే! ఎందుకంటే భారతదేశం ఒక ‘సూపర్‌ పవర్‌’ అవుతుందని, 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడం దాని లక్ష్యమనే ఊహాలోకంలో విహరిస్తున్నవారిని ఇవి కలవరపరుస్తాయి. అయితే ఈ గణాంకాలు, పరిశీలనలు.. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు సృష్టించిన విధ్వంసాన్ని… వాస్తవ స్థితిలో అంచనా కట్టడం లేదు. వ్యవసాయ కార్మికులు, చిన్న మధ్య తరగతి రైతులు, గని కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, సేవారంగాల లోని ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులపై పడిన ప్రభావాన్ని పరిశీలిస్తే వాస్తవాలు బోధపడతాయి.
పోతున్న ఉద్యోగాలు
మన దేశంలో ఆటోమొబైల్‌ పరిశ్రమలో 3.7కోట్ల కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటికే 3లక్షల ఉద్యోగాలకు కోత పడిందని, రాబోయే కొద్ది కాలంలో 10లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆ పరిశ్రమ వర్గాలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. అయితే ఇది కూడా వాస్తవ పరిస్థితిని పూర్తిగా తెలియచేయడం లేదని కూడా అర్థం అవుతున్నది. ఒక పెద్ద పరిశ్రమ ఉంటే దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఉంటాయి. కొన్ని దానికి ముడి సరుకులు ఇచ్చేవి, మరికొన్ని విడి భాగాలను ఇచ్చేవి. పెద్ద పరిశ్రమలో డిమాండ్‌ తగ్గి ఈ అనుబంధ పరిశ్రమలు కూడా ప్రభావం పడి ఉద్యోగాలు పోతాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమకు స్టీల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడి భాగాలు, రబ్బర్‌ టైర్లు, ఇతర చిన్న పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాల కోత చాలా తీవ్రంగా ఉందని సీఐటీయూ సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
గనుల తవ్వకాల రంగంలో రాబోయే కొన్ని నెలల్లో 2-3లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఉత్పత్తి అయిన సరుకులు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. వాటిని కొనే వారు లేరు. అందుకని యజమానులు వాళ్ల లాభాలకు నష్టం రాకుండా కార్మికులను తగ్గించుకోవడం లేదా పని దినాలను తగ్గించడం చేస్తున్నారు. సంక్షోభం ఇంతగా విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం మైనింగ్‌రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నది. సంక్షోభ పరిస్థితిని వాడుకొని స్వదేశీ లేక విదేశీ పరిశ్రమలకు లాభం చేకూర్చాలనే మోడీ ప్రభుత్వ విధానాన్ని ఇది బట్టబయలు చేస్తున్నది. దీనివలన మరింత మంది ఉద్యోగాలు పోతాయి. బొగ్గు గని కార్మికులు వేతనాలు కూడా తగ్గిపోతాయి.
స్టీల్‌ రంగం
స్టీల్‌, ఆటోరంగాలకు మధ్య వున్న అనుబంధం గురించి తెలిసిందే. స్టీల్‌రంగం కీలకమైనది. డిమాండ్‌ లేకపోవడంతో ఈ రంగం కూడా సంక్షోభంలో ఇరుక్కున్నది. దాంతోపాటే ఆటోరంగం కూడా మునుగుతున్నది. ఇతరరంగాల పైనా ప్రభావం చూపుతోంది. రైల్వేలు, నిర్మాణరంగం ఇంజనీరింగ్‌ రంగాలు విరివిగా స్టీల్‌ను వాడుతుంటాయి. ఈ రంగాలు కూడా సంక్షోభం లోనే వున్నాయి. టాటా స్టీల్‌ ప్రయివేటు రంగంలో స్టీల్‌ ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ. రూ.4000 కోట్లతో కంపెనీ విస్తరించాలను కున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని నిర్ణయించు కున్నది. దాంతో ఇక కొత్త ఉద్యోగాలు ఉండవు. జార్ఖండ్‌, ఒరిస్సాలలో స్టీల్‌రంగానికి అనుబంధంగా ఉన్న జంషడ్‌పూర్‌ చుట్టుపక్కల చిన్న పరిశ్రమలలో ఇప్పటికే ఒక లక్ష ఉద్యోగాలు పోయాయి.
వస్త్ర పరిశ్రమ
ఇదివరలో లేని విధంగా ఈ రంగంలో భారీ సంక్షోభం నెలకొన్నది. 10కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. ప్రస్తుతం 2/3 వంతు మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి పోయే పరిస్థితి ఏర్పడింది. ‘పత్తి నూలు’కు దేశ, విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఈ ఏడలాది మంచి పంట వచ్చింది. దాదాపు రూ.80,000 కోట్ల విలువ చేస్తుందని భావిస్తున్న సందర్భంలో… ఈ సంక్షోభం రైతును దివాళ దిశగా నడిపిస్తున్నది. పైగా అనుబంధ పరిశ్రమలు కూడా కునారిల్లుతాయి. దాంతో ఉద్యోగాల కోత కూడా పెద్ద ఎత్తున ఉంటుంది.రవాణా రంగం
పెద్ద లారీలే కాదు, చిన్న సరుకుల రవాణా వాహనాలు కూడా ఈ రంగంలో ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో వీటి మీద కూడా తీవ్ర ప్రభావం పడింది. కోటి వాహనాలలో 60శాతం వాహనాలు పని లేక నిలబడి ఉన్నాయని తెలుస్తున్నది. అంటే ఈ రంగంలో పని చేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్కులు, లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ చేసే వారిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. దీనికి తోడుగా కొత్త మోటారు వాహన చట్టం పుణ్యమా అని ఏదైనా ట్రాఫిక్‌ చట్టాల ఉల్లంఘన జరిగితే విపరీతమైన పెనాల్టీల వడ్డన జరుగుతున్నది. చిన్న యజమానులను దెబ్బ కొట్టి పెద్ద పరిశ్రమలకు లాభం చేకూర్చేలా ఉన్నాయి.
నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌
రవాణారంగంలో పని దొరకని వారికి గతంలో నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పని లభించేది. ఇప్పుడు అది కూడా గత కొన్ని సంవత్సరాలుగా సంక్షోభంలో ఉన్నది. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంటు కౌన్సిల్‌ లెక్కల ప్రకారం ఇప్పటికే లక్ష మందికి ఉద్యోగాలు పోయాయి. రాబోయే కొన్ని నెలలు మరో ఐదు లక్షల మంది ఉద్యోగాలు పోవచ్చని అంచనా కడుతున్నది. ఈ రంగానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు సిమెంట్‌, స్టీల్‌, పెయింట్లు, ఎలక్ట్రికల్‌ సామగ్రి, ఇందులో రవాణా చేసే వారు కూడా దెబ్బ తింటున్నారు. ఇక్కడ కూడా ఉద్యోగాలు పోతున్నాయి. ఎగుమతి ఆధారిత రంగమైన ఐటీ మీద కూడా దెబ్బ పడింది. విదేశాల నుండి స్వదేశం నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ఐటీ కంపెనీలు, ఐటీ ఆధారిత సంస్థలు తమ ఉద్యోగులను తొలగించి తమ భారం తగ్గించుకుంటున్నారు.
రికార్డు స్థాయిలో నిరుద్యోగం
ప్రస్తుతం పోతున్న ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంది! ఇక గత కొద్ది సంవత్సరాలుగా పోగుపడిన నిరుద్యోగం మాటేమిటి? అది మరింత జటిలంగా మారుతున్నది. సీఎంఐఈ తాజా లెక్కల ప్రకారం ఆగస్టు 2019 చివరికి నిరుద్యోగశాతం 8.7శాతం చేరుకున్నది. ఇది గత కొన్ని సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. కార్మిక శాఖ అధికారికంగా గత మే నెలలో 2017-18లో నిరుద్యోగం 6.1శాతం ఉన్నట్టు, అది 45ఏండ్లలోనే అత్యధికమని ప్రకటించింది. అంటే నిరుద్యోగం తారా స్థాయికి చేరుకున్నది. పురుషుల కంటే మహిళలలో నిరుద్యోగం, ఉద్యోగాలు పోవడం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ వినాశకర విధానాల ప్రభావం మహిళల పైనే ఎక్కువగా పడుతోంది. ఉద్యోగాల కోత ఈ గణాంకాలలో కొంత వరకూ కనబడినా మొత్తం సమస్యను వివరించలేవు. ఎందుకంటే కొంత శాతం నిరుద్యోగం కనబడకుండా ఉండిపోతుంది. ఉదాహరణకు ఒక కార్మికుడిని ఒక నెల రోజులు మీ గ్రామానికి వెళ్లి రమ్మని తప్పుడు హామీ ఇచ్చి పంపితే దాన్ని నిరుద్యోగ జాబితాలో చూపెట్టరు. ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
విష వలయం
ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా కాలంగా జీతాలు పెరగక పోవడం, రైతులకు రాబడి తగ్గిపోవడం, గతం నుంచి కొనసాగుతున్న నిరుద్యోగం, జీఎస్‌టీ-నోట్ల రద్దు’ లాంటి రెండు పెనుభూతాల వలన అత్యధికంగా పనులు కల్పించే చిన్న ఉత్పత్తి రంగం కునారిల్లడంతో ఉపాధిపై కోత పడింది. పనులు కల్పించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి సమస్యను పరిష్కరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించడంలేదు. ప్రజల ఉపాధి కల్పనకు వెచ్చించే మొత్తాన్ని తగ్గించాలని… ప్రయివేటు రంగాన్ని విస్తరించాలని ఒత్తిడి చేసే… నయా ఉదారవాద విధానాలపై దానికి వున్న గుడ్డి నిబద్ధతే అందుకు కారణం.
కొనుగోలు శక్తి తగ్గిపోవడం, డిమాండ్‌ తగ్గిపోవడంతో వినిమయ సరుకుల రంగం బాగా దెబ్బతిన్నది. దీనికి మంచి ఉదాహరణ పార్లే-జి బిస్కెట్లు. రూ.5 చిన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ కూడా అమ్ముడు పోని పరిస్థితి వచ్చిందని ఆ కంపెనీ యాజమాన్యమే ప్రకటించింది. దానితో పాటే బాగా అమ్ముడు పోయే చిరుతిళ్లు, అలంకరణ వస్తువులు, లోదుస్తులు, వంట పాత్రల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. దీంతో ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించుకొని ఇతర ఉపాయాలతో తమ లాభాలను కాపాడుకోవాలని చూస్తున్నారు. వాళ్లు చేసే మొదటి పని ఉద్యోగులను తొలగించడం, జీతాలు తగ్గించడం. ఫలితంగా కొనుగోలు శక్తి మరింత తగ్గిపోతుంది. దీన్నే విషవలయం అంటాం. ఇందులోనే ప్రస్తుతం మన దేశం చిక్కుకొన్నది.
దీని పరిష్కారానికి ఒకే ఒక మార్గం ఉన్నది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ విధానాలను మార్చుకునేలా చేయడమే. ప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించే మొత్తాలను పెంచాలి. కేవలం ఉపశమనం కోసం మాత్రమే కాదు. ఉపాధి కల్పన కోసం కూడా ఖర్చు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. జీతాలు పెంచి ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా చెయ్యాలి. ఇది విష వలయాన్ని ఛేదించే పద్ధతి. మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేస్తుంది. తద్వారా ఉత్పత్తి పెరిగి, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రయివేటు రంగానికే మరిన్ని రాయితీలు ఇచ్చేందుకు తన వనరులను వినియోగిస్తున్నది. వేతనాలను సాధ్యమైనంత తక్కువగా ఉంచేందుకు చూస్తున్నది. కనీస మద్దతు ధర ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా నిరాకరిస్తున్నది. ఈ సంక్షోభాన్ని ఒక సాకుగా చూపి ఇప్పటికే ధనవంతులుగా ఉన్న వారిని మరింత ధనవంతులుగా చేసేందుకు పూనుకుంటున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన ప్రతిఘటించాలి. అప్పుడే ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంటుంది.

అనువాదం: టి.యస్‌.వి.రమణ,
సెల్‌: 8985628662

RELATED ARTICLES

Latest Updates