రైతు సమన్వయం ఏమైంది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఉనికే లేని సమితులు..
  • రెండేళ్లైనా కార్యకలాపాలు లేవు
  • ఎరువుల పంపిణీ, ధాన్యం సేకరణ తూచ్‌
  • కార్పస్‌ ఫండ్‌ విడుదల చేయని ప్రభుత్వం
  • నిధుల్లేక అటకెక్కిన రైతు వేదికల నిర్మాణం
  • కార్యాలయం నిర్వహణకూ డబ్బులు లేవు
  • కరెంటు, ఫోన్‌ బిల్లూ చెల్లించలేని దుస్థితి

రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీలో డైరెక్టర్‌గా ఉన్నాను. పేరుకు ఓ పదవైతే ప్రకటించారు. కానీ, అధికారాలు, బాధ్యతలు ఏమీ లేవు. ఆ పదవి ఒకటి ఉన్నట్లు గుర్తు కూడా లేదు. గౌరవ వేతనం ప్రకటించినా.. ఒక్క నెల కూడా ఇవ్వలేదు. కార్యాలయం, కేరాఫ్‌ అడ్రస్‌ కూడా లేవు. పట్టా పాస్‌ పుస్తకాలు, ఎరువులు, విత్తనాలు ఇప్పించుడు దేవుడెరుగు.. అసలు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు! చివరికి, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది కూడా పలకరించే పరిస్థితి లేదు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఓ డైరెక్టర్‌ ఆవేదన……రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు! రాజీనామా కూడా చేశారు! రైతు సమన్వయ సమితుల్లో లక్షా అరవై వేల మంది సభ్యులు ఉన్నారు! తాము సభ్యులమన్న విషయాన్ని వాళ్లే మర్చిపోయారు! రెండేళ్ల కిందట రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు! ఇప్పటి వరకూ దానికి నిధులూ లేవు.. విధులూ లేవు! అసలు దాని ఉనికే లేదు! ఎరువులు, విత్తనాల పంపిణీ పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితులదే! యూరియా అందుబాటుకు సంబంధించి ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైంది కూడా! అయినా, దీనిపై రాష్ట్ర రైతు సమన్వయ సమితి కానీ.. అందులోని ఒక్కరంటే ఒక్క సభ్యుడు కానీ పట్టించుకున్న దాఖలా లేదు! వెరసి, రైతు సమన్వయ సమితులు ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితి. వీటికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా.. విద్యుత్తు, టెలిఫోన్‌ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి దానిది! రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితుల ఉనికి ప్రశ్నార్థకమైంది.

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఈ సమితులు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 2017 ఆగస్టు 27న రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,60,995 మంది సభ్యులు ఉన్నారు. కానీ, రాష్ట్రంలో అసలు రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ అనేది ఒకటి ఉందని, రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కమిటీలు ఉన్నాయనే విషయాన్ని అటు సభ్యులు, ఇటు రైతులు కూడా మరిచిపోయారు. సభ్యులకు ప్రభుత్వం గౌరవ వేతనం ప్రకటించినా ఇచ్చేందుకు కార్పొరేషన్‌లో చిల్లిగవ్వ లేదు. కమిటీలు ఏర్పాటు చేసిన తొలినాళ్లలో పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు, రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాల్లో వీరు హడావుడి చేశారు. ఆ తర్వాత ఊసే లేదు.

కార్పస్‌, ఎమ్మెస్పీ ఫండ్‌ హుష్‌కాకి…రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రైతుల నుంచి వివిధ పంటల కొనుగోలుకు రూ.500 కోట్ల ఎమ్మెస్పీ ఫండ్‌ కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. రైతు వేదికల నిర్మాణాలకు మరో రూ.300 కోట్లు మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు. దీని ప్రకారం రూ.1,000 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు నయా పైసా ఇవ్వలేదు. దీంతో కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తొలినాళ్లలో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లోని ఓ గదిలో కార్పొరేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. తర్వాత జూబ్లీహిల్స్‌లోని సెరికల్చర్‌ కార్యాలయానికి మార్చారు. నెలకు రూ.25 వేల చొప్పున పట్టు పరిశ్రమ శాఖకు అద్దె చెల్లించాలి. 10 నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. విద్యుత్తు చార్జీలు, టెలిఫోన్‌ బిల్లు కూడా చెల్లించలేని దుస్థితి. పంట ఉత్పత్తులను కూడా రైతులే మార్కెట్‌కు వెళ్లి విక్రయించుకుంటున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ ఏర్పడక ముందు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. కొనుగోళ్లు, అమ్మకాల్లో రైతులకు ఒరిగిందేమీ లేదు. విత్తనాలు, ఎరువుల పంపిణీని అధికారులే చూసుకుంటున్నారు.

గుత్తా రాజీనామాతో ఖాళీ….నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2018 ఫిబ్రవరి 22న బాఽధ్యతలు స్వీకరించారు. 17 నెలల 11 రోజులపాటు ఆయన పదవిలో ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో చైర్మన్‌ పదవికి గుత్తా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన శాసనమండలి చైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌ చైర్మన్‌గా మరొకరిని నియమించకపోవడంతో పెద్దదిక్కు లేకుండా పోయింది.

రైతు వేదికల ఊసే లేదు….రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,500 క్లస్టర్లలో ‘రైతు వేదికలు’ నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఒక్కో రైతు వేదికకు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారు. రైతు వేదికల నిర్మాణాలకు భూములు విరాళంగా ఇవ్వాలని, దాతల పేర్లను ఆయా భవనాలకు పెడతామని ప్రభుత్వం పిలుపునివ్వడంతో పలువురు దాతలు ముందుకు వచ్చారు. వేదికల నిర్మాణాలకు భూములు దానంగా ఇచ్చారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భూములు సేకరించారు. అన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,800 క్లస్టర్లలో భూములు అందుబాటులోకి వచ్చాయి. మరో 700 క్లస్టర్లలో భూ సేకరణ చేయాల్సి ఉంది. మొత్తం 2,500 రైతు వేదికలకు రూ.12 లక్షల చొప్పున రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకూ ఏ ఒక్క రైతు వేదికకూ నయా పైసా మంజూరు కాలేదు. వేదికలే లేనప్పుడు రైతు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి కూడా లేదు.

కమిటీ సభ్యుల్లో నైరాశ్యం….ప్రతి రెవెన్యూ గ్రామానికి 15 మంది, మండల, జిల్లా స్థాయిలో 24 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితి సభ్యులు ఉన్నారు. వీరితోపాటు గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. తొలినాళ్లలో శిక్షణ తరగతులు నిర్వహించి వదిలేశారు. ఈ తరగతులకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై సమితుల అధికారాలు, బాధ్యతల గురించి వివరించారు. పలు హామీలు కూడా ఇచ్చారు. కానీ, ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. క్లస్టర్‌, మండల, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ దళారీ వ్యవస్థకు చెక్‌ పడుతుందని భావించినా ప్రయోజనం లేకుండాపోయింది. కనీసం గుర్తింపు కార్డులు కూడా లేవని, అసలు కమిటీలు ఉన్నాయా? రద్దయ్యాయా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నామని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates