మహాత్మా.. మన్నించు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ఆర్థిక విధానంలో ఏనాడో నీ బాట తప్పాం..
గ్రామాల్ని గాలికొదిలేశాం.. పట్టణీకరణపైనే దృష్టిపెట్టాం
గాంధీజీ సూచించిన ఆర్థిక విధానాలు..

అన్ని కరెన్సీ నోట్లపై బోసి నవ్వుల బాపూ చిత్రాన్ని ముద్రించుకున్నాం. కానీ, ఆయన సూచించిన జనహిత ఆర్థిక విధానాలను అను సరించడంలో విఫలమయ్యాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలైనా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించు కోలేకపోయాం. కోట్లాది మంది ప్రజలకు ఇప్పటికీ ఆర్థిక స్వాతం త్య్రం అందని ద్రాక్షే. భారత్‌ తనకంటూ సొంత ఆర్థిక విధానాన్ని కలిగి ఉండాలని, విదేశీ పోకడలను గుడ్డిగా అనుసరించవద్దని గాంధీ ఆనాడే చెప్పాడు. మరి మనమేం చేశాం.. గ్రామ స్వరాజ్యానికంటే పట్టణీకరణ, పారిశ్రామికీకరణకే అధిక ప్రాధాన్యమిచ్చాం. పెట్టుబడిదారీ, దళారీ వ్యవస్థను పెంపొందించుకున్నాం. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్‌లో కేవలం 25 మంది ధనవంతులు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 10 శాతానికి సమానమైన సంపద కలిగి ఉండటమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

యాంత్రీకరణ: దేశంలో యాంత్రీకరణ వ్యక్తుల ఆత్మగౌరవాన్ని, గ్రామ స్వీయ ఆధారాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. పరిశ్రమలు కార్మిక ఆధారితమై ఉండాలి.

దేశానికి అవసరమైనవి దేశీయంగానే..:మన దేశానికి అవసరమైన వస్తువులను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలి. దేశంలో తయారయ్యే వస్తువులకు దేశీయంగానే తగినం త డిమాండ్‌ ఉండాలి. విదేశీ వస్తువులను బహిష్కరించమని కాదు దీనర్థం. ఏమాత్రం లాభదాయకం కాని వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేయడం మూర్ఖత్వమే. వాటిని ఉత్పత్తి చేసే బదులు దిగుమతి చేసుకోవాలి.

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు..:భారత అభివృద్ధి గ్రామాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. గ్రామ స్థాయి నుంచి జరిగేదే అసలైన, నిలకడైన అభివృద్ధి. గ్రామాల అభివృద్ధి జరగకుండా భారత్‌ అభివృద్ధి కాలేదు. గ్రామంలోని వారికి అవసరమయ్యే వస్తు, సేవలన్నీ స్థానికంగానే సమకూర్చుకోగలగాలి. వ్యవసాయం ఒక్కటే నిరుద్యోగ సమస్యను తీర్చలేదు. గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమల ఏర్పాటే ఈ సమస్య కు తగిన పరిష్కారం. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర పెరగాలి.

అభివృద్ధి వికేంద్రీకరణ..: ఆర్థిక వ్యవస్థ సాఫీగా అభివృద్ధి చెందాలంటే ఏకకాలంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి. ఇందుకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అధికార, విత్త కేంద్రీకరణే దోపిడీకి మూలకారణం. తద్వారా దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతాయి. ధనవంతులు మరింత ధనవంతులవుతారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి కూరుకుపోతారు.

పారిశ్రామికీకరణ..: పారిశ్రామికీకరణ సహజ వనరులు, దోపిడీకి దారితీస్తుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ఏర్పా టు చేసే పరిశ్రమలతో ప్రజలు సోమరులుగా మారడమే కాకుండా, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. భారీ స్థాయి పరిశ్రమలు, ఆధునిక సాంకేతికతతో దేశంలో నిరుద్యోగం, పేదరికం, పట్టణీకరణ పెరగడంతో పాటు అడవులు హరించుకుపోతాయి.

ధర్మకర్తృత్వం..: నైతికత లోపించిన వ్యాపారం భూతం లాంటిది. సమాజంలో వివక్ష, అక్రమాలు, దోపీడీకి దారితీస్తుంది. వ్యక్తిగత ఆదా యం, జీవన ప్రమాణాల పెంపు కోసం సహజ, మానవ వనరుల వినియోగం పర్యావరణహితపద్ధతుల్లో జరగాలి. పెట్టుబడిదారులు, ధనవంతులు సమాజానికి ధర్మకర్తలుగా ఉండాలి. తమ సంపదను సమాజహితానికి ఉపయోగించాలి.

ఆర్థిక విషయాలపై మహాత్ముని సూక్తులు..: ఈ భూమ్మీద ప్రతి ఒక్కరి అవసరాలకు తగినన్ని వనరులున్నాయి. కానీ, అందరి దురాశను తీర్చగలిగేంత లేవు దారిద్య్రంలో మగ్గుతున్న వారికి నమ్మకంగా ఒకటే చెప్పదలుచుకున్నా. సంగీతం, పాండిత్యం, ఆర్థికం, సంతోషం అన్నీ చరఖాలోనే ఉన్నాయి.

Courtesy Andhrajyothy..

RELATED ARTICLES

Latest Updates