రుణ మాఫీ రద్దు తగదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రైతుల రుణ మాఫీ చివరి రెండు విడత బకాయిల చెల్లింపును నిలిపేయాలన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. తాను తొలి సంతకం చేసిన రైతుల రుణ మాఫీని తెలుగుదేశం ప్రభుత్వం మంచం కోళ్ల సామెతలా మార్చింది. 90 లక్షల మందికి రూ.87 వేల కోట్లతో రుణ మాఫీ చేస్తామని చెప్పి వడపోతలు మీద వడపోతలతో 36 లక్షల మందికి రూ.24 వేల కోట్లు ఖరారు చేసింది. ఆ మొత్తాన్ని కూడా ఒకే సారి కాకుండా అయిదంచెలుగా ఇస్తామని చెప్పి మూడు విడతలు మాత్రమే చెల్లించింది. చివరి 4,5 విడతల్లో రూ.8 వేల కోట్ల రుణ మాఫీ బకాయి విడుదలకు ఎన్నికల ముందు అంటే మార్చి 10న జీవో-38ని విడుదల జేసింది. ఇంతలోనే ‘అన్నదాత సుఖీభవ’ అన్న మరో పథకాన్ని తీసుకొచ్చి కేంద్రం గత డిసెంబరులో ప్రకటించిన ‘పిఎం కిసాన్‌ సమ్మాన్‌’ పథకంతో జోడించి రుణ మాఫీ నిధులను కొన్నిటిని అటు మళ్లించింది. ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ జీవో అమలు కూడా నిలిచిపోయింది. రుణమాఫీని ఇలా ప్రహసనంగా మార్చినందుకు చంద్రబాబు ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ సమీక్షించడం పరిపాటే. పాత ప్రభుత్వం చేసిన నిర్ణయాల్లో ప్రజలకు నష్టం కలిగించే వాటిని తిరగదోడడంలో తప్పులేదు. కానీ, ఆ పేరుతో రైతులకు ఎంతో కొంత ఉపశమనం కలిగించే రుణమాఫీ బకాయిల చెల్లింపును నిలిపేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. రుణమాఫీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీయే తప్ప ప్రభుత్వం ఇచ్చిన హామీ కాదని, దానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కొందరు వైసిపి నాయకులు చేస్తున్న వాదనలో పసలేదు. రుణమాఫీపై గత అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. కాబట్టి ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీయే. రైతు భరోసా తీసుకొస్తున్నాం కాబట్టి రుణ మాఫీని నిలిపేసినా పర్వాలేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది. అక్టోబరు నుంచి అమల్లోకి తీసుకొస్తామంటున్న రైతు భరోసాకు ప్రభుత్వం పెడుతున్న షరతులు చూస్తుంటే వైసిపి నవరత్నాల్లో ఇచ్చిన హామీకి, ప్రభుత్వం ప్రకటించిన విధానానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయ పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ.12,500 చొప్పున ప్రతియేటా ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు. ఆ ప్రకారం సొంత భూమి కలిగి ఉన్న 48.5 లక్షల మంది రైతులు, కౌల్దారులుగా ఉన్న 15.6 లక్షల మంది మొత్తం 64 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.12,500 చొప్పున చెల్లిస్తుందని అందరూ భావించారు. లబ్ధిదారుల సంఖ్యను వడపోసి కుదించారు. ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన బట్టి ‘పిఎం కిసాన్‌ సమ్మాన్‌’ కింద కేంద్రం రూ.రెండేసి వేలు చొప్పున మూడు విడతలుగా చెల్లించే రూ.6 వేలకు, ప్రభుత్వం అదనంగా మరో రూ.6,500 జోడించి చెల్లిస్తుంది. కౌలు రైతులకు ‘పిఎం కిసాన్‌ సమ్మాన్‌’ పథకం వర్తించదని తేల్చిచెప్పడంతో కౌల్దారులకు రూ.12,500 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తానంటున్నది. అయితే, కౌల్దార్లందరికీ ఇది వర్తించదు. అందులోనూ సామాజిక విభజన తీసుకొచ్చారు. 40 ఎకరాల అసామీ నుంచి పది మంది కౌలుకు తీసుకుని సాగు చేస్తే అందులో ఒకరికే రైతు భరోసా వర్తింపజేస్తామనడం, ఎకరాకు తక్కువ భూమి సాగు చేసే కౌలు రైతులను మినహాయించడం వంటి నిబంధనలు 80 శాతం దాకా భూమి సేద్యం చేస్తున్న కౌలు రైతులకు ఏపాటి భరోసా ఇస్తుందన్నది ప్రశ్నార్థకమైంది.
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు వంద మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో ఒకటి రుణభారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు వ్యవసాయ రంగాన్ని సంక్షోభ సుడిగుండం లోకి నెడుతున్నాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో బ్యాంకులు నిర్దేశించుకున్న వ్యవసాయ రుణాల లక్ష్యాల్లో 34 శాతం అంటే రూ.18 వేల కోట్లు ఇంతవరకు పంపిణీ చేయలేదంటే రైతుల పట్ల వీటికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. ఖరీఫ్‌ సీజన్‌ మరో అయిదు రోజుల్లో ముగియనుంది. రుణమాఫీ బకాయిలు చెల్లిస్తే రబీకి అయినా రైతులకు కొంత వెసులు బాటు లభించేది. విత్తనాల కొరతతో అనంతపురంలో వేరుశనగ రైతులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక శనగ రైతులు, మార్కెట్‌ మాయాజాలంతో నష్టపోతున్న ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 600 మండలాలకు గాను 300 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లు, చెరువులు నిండి ఉండడంతో రబీలోనైనా పరిస్థితి కొంత మెరుగు పడుతుందని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రుణ మాఫీ రద్దు చేయడమంటే రైతులకు అన్యాయం చేయడమే. అనవసర ప్రతిష్టకు పోకుండా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలి. చివరి 4,5 విడతల రుణ మాఫీ నిధులను విడుదలచేసి రైతులకు ఉపశమనం చేకూర్చాలి.

Courtesy Prajasakthi

 

RELATED ARTICLES

Latest Updates