అలుపెరుగని నటుడికి అత్యున్నత పురస్కారం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భారత చలనచిత్ర పరిశ్రమలో నాలుగు పదుల ప్రస్థానం అమితాబ్‌ది. ఆయన ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా గురించి చెప్పడం కష్టం. హిందీ సహా అనేక భాషల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. 200కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట ేసవలు చేసిన ఈ అరుదైన నటుడికి ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు దక్కడంతో బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ ప్రశంసల వర్షం కురుస్తోంది. అలుపెరుగని నటుడిగా ఆయన కృషి అనితర సాధ్యమని వివిధ వర్గాల ప్రజలు సైతం ఆయన్ని ప్రశంసిస్తున్నారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్‌ హోస్ట్‌గా, అడపాదడపా నేపథ్యగాయకుడిగా అమితాబ్‌ బహుముఖ ప్రతిభ ప్రదర్శించారు.

1970 దశకంలో ‘జంజీర్‌’, ‘దీవార్‌’, షోలో’ వంటి చిత్రాలతో ఆయన ‘యాంగ్రి యంగ్‌మన్‌’గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఏర్పరచుకొన్నారు. ‘డాన్‌’, ‘కూలీ’, ‘అగ్నీపథ్‌’, ‘సర్కార్‌’, ‘బ్లాక్‌’, ‘పా’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో ఆయన నటించారు. వీటిల్లో ‘అగ్నిపథ్‌’, ‘బ్లాక్‌’, ‘పా’, ‘పీకూ’ చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి. 1970, 80, 90 దశకాల్లో తెరపై అమితాబ్‌ ఆధిపత్యం కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన హుషారుగా ఉంటూ ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఆయనే కాదు బచ్చన్‌ కుటుంబమే సినీరంగానికి అంకితమైంది. తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ ప్రముఖ కవి కూడా. భార్య జయాబచ్చన్‌, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్యారాయ్‌ బాలీవుడ్‌లో రాణిస్తున్నారు

మూడు ‘పద్మాలూ’ ఆయనివే…

భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులు మూడింటినీ అందుకున్న ఘనత అమితాబ్‌ సొంతం. 1984లో ‘పద్మశ్రీ’, 2001లో ‘పద్మభూషణ్‌’, 2015లో ‘పద్మ విభూషణ్‌’ అందుకున్నారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ హానర్‌’తో గౌరవించింది. ఇక ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 15 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకొన్నారు.

అప్పుడు ‘మనం’.. ఇప్పుడు ‘సైరా’

తెలుగులో అక్కినేని కుటుంబ సభ్యులంతా కలిసి నటించిన ‘మనం’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో నటించారు. అక్టోబర్‌ రెండున విడుదల కానున్న మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రంలో ఆయన గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. . ‘సైరా’లో తన గెటప్‌ నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను గుర్తు చేసిందని అమితాబ్‌ ఇటీవల ప్రకటించారు కూడా.

  • అమితాబ్‌ బచ్చన్‌ పుట్టింది పవిత్ర నదుల సంగమస్థానం ప్రస్తుతం ప్రయాగరాజ్‌గా పిలుస్తున్న అలహాబాద్‌లో. తండ్రి హరివంశ్‌ రాయ్‌ అమితాబ్‌ను ‘ఇంక్విలాబ్‌’ అని ముద్దుగా పిలిచేవారు. హరివంశ్‌ రాయ్‌ తన సహచర కవి సుమిత్రానందన్‌ సలహామేరకు ఆ పేరును అమితాబ్‌గా మార్చారు. ఆయన కలంపేరు ‘బచ్చన్‌’ అమితాబ్‌ ఇంటిపేరుగా మారింది. తల్లి తేజీ బచ్చన్‌కు నటన మీద ఆసక్తి వుండేది. ఆ ప్రభావం అమితాబ్‌ మీద బాగా
  • పనిచేసింది. 1969లో మృణాల్‌ ేసన్‌ నిర్మించిన ‘భువన్‌ షోమ్‌’ సినిమాకు గళాన్ని అందించి సినిమారంగ ప్రవేశానికి బాటలు పరిచారు.
  • ‘జంజీర్‌’ సినిమాతో అమితాబ్‌ ‘యాంగ్రి యంగ్‌మ్యాన్‌గా గుర్తుంపు పొందారు. ఈ సినిమా చేసేటప్పటికీ బచ్చన్‌ ఖాతాలో పన్నెండు ఫ్లాప్‌ చిత్రాలున్నాయి. ‘జంజీర్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ నటించడానికి రచయితలు సలీం-జావేద్‌ కారణం. ఈ చిత్రం రష్యాలో కూడా హిట్టైంది.
  • ‘ఆనంద్‌’ సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌, ‘బాంబే టు గోవా’లో హీరో పాత్రల విజయాన్ని పక్కనపెడితే ప్రారంభంలో అమితాబ్‌ నటించిన మిగతా సినిమాలన్నీ ఫ్లాప్‌లే! అందుకే ఆయన్ని ‘ఫెయిల్డ్‌ న్యూ కమ్మర్‌’ అనేవారు. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్లు.
  • హిందీలో అమితాబ్‌ నటించిన ‘జంజీర్‌’, యాదోంకీ బారాత్‌’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. వీటన్నింటిలో ఎన్టీఆర్‌ హీరోగా నటించడం విశేషం.
  • యశ్‌ చోప్రా దర్శకత్వంలో గుల్షన్‌ రాయ్‌ నిర్మించిన ’దీవార్‌’లో అమితాబ్‌ అద్భుతంగా నటించారు. ఇందులో ఆయన పాత్ర అండర్‌ వరల్డ్‌ డాన్‌ హాజీ మస్తాన్‌ను పోలి ఉండేలా రచయితలు సలీం-జావేద్‌ రూపొందించారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ మాస్టర్‌ పీస్‌గా చెబుతుంటారు.
  • అమితాబ్‌కు పునర్జన్మనిచ్చిన చిత్రంగా ‘కూలీ’ను పేర్కొనవచ్చు. 1982లో బెంగుళూరు యూనివర్సీటీలో అమితాబ్‌, పునీత్‌ ఇస్సార్‌పై తెరకెక్కిస్తున్న పోరాట సన్నివేశ చిత్రీకరణలో జరిగిన ప్రమాదం కారణంగా అమితాబ్‌ కోమాలోకి వెళ్లినంత పనైంది. మృత్యుకోరల నుంచి ఆయన బయటపడటానికి చాలాకాలం పట్టింది.
  • 2013 లో ‘ది గ్రేట్‌ గట్స్‌ బై’ అనే హాలీవుడ్‌ సినిమాలో నటించారు. లండన్‌, న్యూయార్క్‌, హాంగ్‌ కాంగ్‌, బ్యాంకాక్‌, వాషింగ్టన్‌, ఢిల్లీ నగరాలలోని మేడం టుస్సాడ్‌ మ్యూజియంలలో అమితాబ్‌ బచ్చన్‌ మైనపు బొమ్మలు ఉన్నాయి.

అభినందనలు

‘‘అమితాబ్‌ గారూ… ఈ గౌరవానికి (దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి) మీరు ఎంతో అర్హులు’’ 

– రజనీకాంత్‌

 ‘‘హుషారైన మీ నటనతో, అభినయంతో తరాలుగా మీరు ప్రేక్షకులను అలరిస్తున్నారు. హృదయపూర్వక అభినందనలు’’

– మోహన్‌లాల్‌

‘‘అమితాబ్‌ బచ్చన్‌గారిని దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు కేంద్రం ఎంపిక చేసిందనే వార్త తెలియగానే చాలా ఆనందించా. అలుపెరగని కెరటంలాంటి వారి నట జీవితం గొప్ప వికాస పాఠం. నటనలో తనకంటూ ఓ ఒరవడిని సృష్టించుకున్నారు. ఆయన కీర్తి కిరీటంలో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం ఓ కలికితురాయి. నా తరఫున, జనసైనికుల తరఫున ఆయనకు అభినందనలు.

– పవన్‌కల్యాణ్‌

‘‘ప్రియమైన అమిత్‌ జీ… ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం మిమ్మల్ని వరించిందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంది. కోట్లాదిమంది ప్రజలకు మీరు వినోదాన్ని అందించారు. స్ఫూర్తిగా నిలిచారు. ఇంకా ప్రేక్షకులను అలరిస్తున్నారు. వుయ్‌ లవ్‌ యు సార్‌. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను’’

– నాగార్జున అక్కినేని

Courtesy AndhraJyothy..

RELATED ARTICLES

Latest Updates