Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మనకు ఓ జాతీయ భాష అవసరమా?

భారత్‌కు జాతీయ భాష అనేది లేదు. అసలు మనకు ఒక జాతీయ భాష అవసరం లేదు. ఒకే భాష ప్రాతిపదికన ఒక జాతి సమైక్యమై తీరాలన్నది 19 వ శతాబ్దపు యూరోపియన్ భావన. 21 వ శతాబ్దంలో ఆ భావనకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. దాన్ని త్యజించి తీరాలి. హిందీని జాతీయ భాషగా ఇతర భారతీయ భాషలపై అధికారికంగా రుద్దడం అనేది మన జాతీయవాద స్ఫూర్తికి విరుద్ధమైనది. అటువంటి చర్య ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులోని భాషలలో హిందీ ఒకటి. అవన్నీ భాతృభాషలు. మరి హిందీకి ఏ ఆధిక్యమున్నదని దానికి, ఇతర భాషల కంటే అధిక ప్రాధాన్యమివ్వదలుచుకున్నారు? జాతీయ భాషగా గౌరవం కల్పించి ఇతర భారతీయ భాషలపై హిందీని రుద్దడం సమంజసమేనా? ఈ విషయాలపై ప్రస్తుతం జరుగుతోన్న చర్చ నాకు అమిత చికాకు కల్గిస్తోంది. మాది కింది స్థాయి మధ్య తరగతి కుటుంబం. అయితే వర్గ దోపిడీ చేదు అనుభవాలు నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు. నేను ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వాడినైనా నా కుటుంబ నేపథ్యం మూలంగా నేను నేరుగా ఎప్పుడూ ఎలాంటి కుల వివక్షకు గురి కాలేదు. అయితే సాంస్కృతిక బహిష్కారం గురించి ఒకటి రెండు విషయాలు చెప్పగలను. నేను హిందీ మాధ్యమంలో చదువుకున్న వాణ్ణి. న్యూఢిల్లీ కులీన శ్రేణుల్లో – ఉదారవాదులు కానివ్వండి లేదా వామపక్షాలకు చెందిన వారు కానివ్వండి- నా పట్ల ఒక ఉపేక్షా భావం కన్పించింది. అవును మరి, వారు ఆంగ్ల విద్యాధికులు కదా. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా భావాలను కూలంకషంగా అధ్యయనం చేసిన వాణ్ణి గనుక నా పట్ల ఆ కులీనుల వైఖరి వివక్ష కిందకు వస్తుందని చెప్పక తప్పదు. ఈ అనుభవం నాకు భాష ప్రభావశీలత, అది కల్పించే అధికార హోదా అంటే ఏమిటో; పాలక వర్గాల భాష గురించి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. ఈ కారణంగానే ‘హిందీ దివస్’ సందర్భంగా హిందీ భాష వర్తమాన పరిస్థితితో పాటు ఇతర భారతీయ భాషల అభివృద్ధి గురించి నా భావాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం పరిపాటి అయింది. అనేక సంవత్సరాలుగా ఇది జరుగుతోంది. అయితే ఒకే భావాలను మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేయవలసిరావడంతో నేను విసిగి పోయాను. ఈ ఏడాది ‘హిందీ దివస్’ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొన లేదు. పూర్తిగా మౌనం వహించాను. ఇంతలో అమిత్ షా తన హిందీ వాదనలను దేశం మీదకి వదిలారు. అవి నా ప్రశాంతతను భగ్నం చేశాయి. నిజానికి అమిత్ షా ప్రసంగం ఏమంత ప్రాధాన్యమున్నది కాదు. పూర్తిగా మరచిపోదగ్గది. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలకు యావద్దేశమూ ముఖ్యంగా హిందీయేతర భాషా ప్రాంతాల వారు అమితంగా ప్రతిస్పందించారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రతికూల ప్రతిస్పందనలకు ఆస్కారమిచ్చిన వ్యక్తి సాక్షాత్తు దేశంలోనే అత్యంత శక్తిమంతుడు.

భాషా వ్యవహారాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో కాకుండా శాంతిభద్రతల రక్షణకు పూచీ పడే హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంచడం చాలా అసంబద్ధమైన విషయమని విఖ్యాత భాషా వేత్త ప్రొఫెసర్ గణేష్ దేవీ అన్నారు. ఈ వ్యాఖ్యలో సంపూర్ణ నిజంలేదని ఎవరనగలరు? భాషాపరమైన సామరస్యం వర్ధిల్లేందుకు శాంతిభద్రతల పరిరక్షకులు ఎలా బాధ్యత వహిస్తారు? ఇటీవల ‘హిందీ దివస్’ సందర్భంగా కేంద్ర హోంమంత్రి ప్రసంగం భాషాపరమైన సామరస్యాన్ని పెంపొందించడం కాదు కదా ఉన్న పరిస్థితికి ఎంతైనా హాని చేసింది. సరే, అమిత్ షా మహాశయుని వ్యాఖ్యలను చూద్దాం. భారతీయ భాషలన్నీ సకల యూరోపియన్ భాషల కంటే ఉత్కృష్టమైనవట (ఎలా? ఎందుకు?). ఈ అత్యంత విస్మయకరమైన విషయాన్ని వక్కాణించడంలో అమిత్ షా ‘లఘుత గ్రంథి’ (ఆత్మ న్యూనతా భావం) అనే మాటను ఒకసారి కంటే ఎక్కువగా ఉపయోగించడాన్ని నేను గమనించాను. యూరోపియన్ దేశాల వలసపాలనలో మగ్గిపోయిన ప్రజలలో భారతీయులు మాత్రమే ఆంగ్ల భాషను, ఆంగ్లీకరణను నిష్ఫలీకరించారని అమిత్ షా ఉద్ఘాటించారు (గౌరవనీయ మంత్రి మహాశయా, మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో తెలుసుకోవచ్చునా?).

ప్రపంచ జనాభాలో 20 శాతం మంది భాష హిందీ అని పేర్కొంటూ కీర్తిశేషురాలు సుష్మా స్వరాజ్ పేరును అమిత్ షా ఉటంకించారు (వీకీపిడియా ప్రకారం ప్రపంచ ప్రజలలో కేవలం 4.4 శాతం మందికి మాత్రమే హిందీ మాతృభాషగా ఉన్నది. ఈ విషయంలో సరైన సంఖ్య 6.6 శాతం అని చెప్పి తీరాలి). హిందీకి మద్దతుగా గోపాలకృష్ణ గోఖలే కూడా హిందీనే జాతీయ భాషగా చేయాలని ప్రతిపాదించారని అమిత్ షా పేర్కొన్నారు. (నిజమా? నాకయితే తెలియదు. ఆ మహోన్నత రాజనీతిజ్ఞుడు, అనుపమాన దేశ భక్తుడు హిందీకి అటువంటి ప్రాధాన్యమిచ్చారన్న విషయాన్ని ఎవరైనా ధ్రువీకరిస్తారేమోనని నేను ఇంకా ఎదురు చూస్తున్నాను). హిందీ భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం (లోక్ రాజ్) వర్ధిల్లదని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అన్నారని అమిత్ షా పేర్కొన్నారు (లోహియా నిజానికి హిందీని ప్రస్తావించలేదు. ప్రజాస్వామ్యానికి ‘లోక్ భాష’ ప్రజల భాష- అతి ముఖ్యమని మాత్రమే లోహియా అన్నారు). ఎలాంటి బాహ్య ప్రభావాల (ఇవేమిటో మీకు బాగా తెలుసు)తో కళంకితంకాని శుద్ధ హిందీని మాత్రమే ఉపయోగించాలని అమిత్ షా మహాశయుడు పిలుపునిచ్చారు. మంత్రిగారి ప్రసంగాన్ని మీరు విన్నారా? గుజరాతీకరణ అయిన శబ్ద క్రమం, ముతక గుజరాతీ ఉచ్ఛారణతో ఆయన ప్రసంగం సాగిపోయేది కదా. మరి శుద్ధ హిందీనే ఉపయోగించాలన్న సుభాషితం ఏమయి పోయినట్టు?

ఈ వ్యవహారాలన్నీ నిరపాయకరమైనవే సుమా! ఎందుకంటే హిందీ దివస్ ఆచారాలు ప్రతిఏటా అలానే వుంటాయి మరి. అయితే అమిత్ షా ఉద్ఘాటనల్లో ఒకటి భారతదేశ భాషాపరమైన వైవిధ్యానికి హాని కల్గించే విధంగా వున్నది. మన జాతీయ సమైక్యతకు ఒక జాతీయ భాష అవసరమని మన గౌరవనీయ అమాత్యుల వారు అన్నారు. భారతదేశపు జాతీయ భాష పాత్రను హిందీ మాత్రమే పోషించగలదని ఆయన వక్కాణించారు. హిందీని ‘రాష్ట్ర భాష’ (జాతీయ భాష) అనలేదుగానీ ఆయన ఉద్ఘాటనలోని అంతర్భావం అదే అని మరి చెప్పనవసరం లేదు. ఇదేమీ అయన తన ప్రసంగంలో యథాలాపంగా వాడిన ఒక అలంకారిక పద బంధం కాదు. హిందీ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన లిఖితపూర్వక సందేశంలో కూడా అమిత్ షా ఆ మాటను ఉపయోగించారు. ఒక సాధారణ ప్రభుత్వాధికారి అలా మాట్లాడితే పట్టించుకోవలసిన అవసరం లేదు. అయితే అమిత్ షా, ప్రధానమంత్రి తరువాత అంతటి అధికారాలను చలాయిస్తున్న శక్తిమంతుడైన నాయకుడు. ఈ కారణంగానే ఆయన వ్యాఖ్య ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఎనలేని ఆందోళనకూ కారణమయింది.

గమనార్హమైన వాస్తవం మరొకటి వున్నది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణ 370 రద్దు, జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ను దేశమంతటికీ వర్తింపచేస్తామన్న ప్రకటన ఆసేతు హిమాచలం సంఖ్యానేక భారతీయులను కలవరపెడుతున్న తరుణంలో హిందీకి జాతీయ భాష హోదా కల్పించడంపై అమిత్ షా మాట్లాడారు. జాతీయ సమైక్యతా భాషగా హిందీని గౌరవించి, ప్రోత్సహించాలన్న అమిత్ షా విజ్ఞప్తి అమంగళకరమైనదిగా సహేతుకంగానే భావించవలసి వస్తోంది. దీనిపై మనం మరింత నిశిత దృష్టిని సారించవలసి వున్నది.

భారత్‌కు జాతీయ భాష అనేది లేదు. అసలు మనకు ఒక జాతీయ భాష అవసరం లేదు. ఒకే భాష ప్రాతిపదికన ఒక జాతి సమైక్యమై తీరాలన్నది 19 వ శతాబ్దపు యూరోపియన్ భావన. 21 వ శతాబ్దంలో ఆ భావనకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. దాన్ని త్యజించి తీరాలి. భారత జాతీయోద్యమ మేధో సంప్రదాయం ఆ కాలం చెల్లిన భావనను అంగీకరించదు. ఏమైనప్పటికీ హిందీకి, ఇతర భారతీయ భాషలకు లేని గొప్పదనమేమీలేదు. అసలు పలు ఇతర భారతీయ భాషల కంటే హిందీ భాష ప్రాచీనమైనది కాదు. తమిళం, కన్నడ, తెలుగు మొదలైన భాషల కంటే హిందీ సాపేక్షంగా అభివృద్ధి చెందిన భాష కాదు. అన్ని భాషలకు కాకపోయినప్పటికీ కొన్ని భాషల మధ్య వారధిగా హిందీ సమర్థంగా వ్యవహరించగలదు. అరుణాచల్ గిరిజన తెగల మధ్య హిందీ ఒక అనుసంధాన భాషగా ఉపయోగపడుతున్నది. అయితే తమిళులు, కన్నడిగులు పరస్పరం మాట్లాడుకోవడానికి హిందీ అవసరమవుతుందని నేను అనుకోను. ఇతర భాషల వారు హిందీని గౌరవించాలని డిమాండ్ చేయడం కాదు, ఆ భాషా ప్రజల నమ్మకాన్ని హిందీ సముపార్జించు కోవాలి. మరి ఇదెలా సాధ్యం? ‘కల్తీ’ భాషగా రూపొందడమే. అంటే ఇతర భారతీయ భాషల నుంచి, భారతీయేతర భాషలనుంచి విస్తృతస్థాయిలో శబ్ద సంపదను స్వీకరించాలి. అప్పుడు మాత్రమే హిందీ పరిపుష్టమవగలదు. ఆచార్య వినోబా భావే అన్నట్టు హిందీ భాష ఒక నదిలా వుండకూడదు; అది ఒక సముద్రంలా విస్తరించాలి. ఈ వ్యవహారాన్ని సమాజం, మీడియా, మార్కెట్‌కు వదిలేద్దాం. హిందీని జాతీయ భాషగా ఇతర భారతీయ భాషలపై అధికారికంగా రుద్దడం అనేది మన జాతీయవాద స్ఫూర్తికి విరుద్ధమైనది. అటువంటి చర్య ప్రతి కూల ఫలితాలను మాత్రమే ఇస్తుంది.

ఏమైనా ఈ ఏడాది హిందీ దినోత్సవం ఒక నిర్దిష్ట చర్చకు దారి తీయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకే జాతి, ఒకే భాష భావనను ప్రజా జీవితంలోని పలువురు ప్రముఖులు, కొంతమంది రాజకీయ వేత్తలు బహిరంగంగా ప్రశ్నించడం ఒక శుభ పరిణామం. అయితే చర్చ ఇంతటితో ఆగిపోవడమే నాకు చికాకు కల్గిస్తోంది. ఎందుకని? తదుపరి ప్రశ్నను మనం అడగడం లేదు. ఇతర భారతీయ భాషలపై హిందీని రుద్దడం లేదా హిందీని భారతదేశ జాతీయ భాషగా పెంపొందించడమే మనకాలపు ప్రధాన కర్త్యవమా? రాజభాష కమిటీకి వెలుపల దేశంలో ప్రాబల్యం వహించగల స్థానంలో హిందీ ఉన్నదా? వీధిలోకి వెళ్ళండి. అడుగడుగునా ఆంగ్ల భాషా ప్రావీణ్యాలను నేర్పే కోర్సులకు సంబంధించిన ప్రకటనలు వున్న బోర్డులు కన్పించడం లేదూ? కాయకష్టంతో బతికే కూలీల మొదలు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివించేందుకే ఎందుకు ఆరాటపడుతున్నారు? హిందీ మాతృభాషగా గల యువజనులతో మాట్లాడండి. వారు హిందీని సక్రమంగా మాట్లాడలేరు. మరి ఆంగ్లభాషలో వారి ప్రావీణ్యాలు గురించి ఎంత తక్కువ చెప్పితే అంత మంచిది. ఉత్తర భారతావనిలో హిందీ పరిస్థితిని చూస్తే హిందీ ఆధిక్యం గురించి మాట్లాడడం ఒక జోక్ మినహా మరేమీ కాదు. హిందీని అలా వుంచి , ఆంగ్ల భాషకు ఇస్తున్న, లభిస్తున్న ప్రాధాన్యం గురించి మాట్లాడదామా? జెండర్, వర్గం, కులం వలే భాష కూడా అసమానతలు, వివక్ష, అన్యాయాలతో ముడివడివున్న విషయమే. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాలి. మన సమాజంలో ఆంగ్ల విద్యావంతులు, మాతృభాషల్లో విద్యాభ్యాసం చేసిన వారి మధ్య ఉన్న విభజన వాస్తవంగా ఒక అనధికారిక వివక్షా విధానం కాదూ? ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. భాషా విధానం ఎదుర్కొంటున్న అసలైన సవాళ్ళ గురించి చర్చించడం మనం ఎప్పుడు ప్రారంభిస్తాము? ఎనిమిదో షెడ్యూలులోని 22 భాషలను సంపూర్ణంగా ఎలా అభివృద్ధిపరచాలి? ఎనిమిదో షెడ్యూలులో లేని వందలాది ‘మాండలికాలు’, భాషలను పటిష్ఠపరచడం ఎలా? భాషాపరమైన వివక్ష బాధితులు ఈ అంశాలపై ఒక చర్చను ఎప్పుడు ప్రారంభిస్తారు? బహుశా, మీరు ఇప్పుడు నేను ఎందుకు చికాకు పడ్డానో అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను.

యోగేంద్ర యాదవ్. (వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షులు)

 

RELATED ARTICLES

Latest Updates