హిందీనాదమా.. హిందూత్వవాదమా..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భారతదేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. హిందీ భాష గురించి హౌం శాఖ మంత్రి అమిత్‌ షా లేవనెత్తిన చర్చ బీజేపీ/ఆరెస్సెస్‌ మౌలిక హిందూత్వ దృక్ఫథానికి అనుగుణంగానే ఉంది. షా లేవనెత్తిన సమస్యను చర్చించబోయే ముందు జాతీయత గురించి కొన్ని ప్రాథమిక అంశాలు పరిశీలించాలి. పశ్చిమ దేశాల జాతీయవాదానికి ఒకే భాష, ఒకే మతం, ఒకే జాతి ప్రాతిపదిక. ఇందుకు భిన్నంగా వర్థమాన దేశాలు ప్రత్యేకించి భారతదేశం వంటి దేశాల జాతీయతకు బహుళమతాలూ బహుళ భాషలూ పునాది. అందుకే భారత రాజ్యాంగం దేశాన్ని సమాఖ్య రాజ్యంగా ఘోషిస్తోంది. సమాఖ్య రాజ్యం అంటే కేవలం వేర్వేరు రాష్ట్రాలు రాజకీయ యూనిట్లుగా పరిగణించి వాటికీ కేంద్రానికి మధ్య సమన్వయం ఉండాలన్న లక్ష్యం ఒక్కటే కాదు. భౌగోళిక అస్తిత్వంగా భారతదేశం అన్నది వివిధ భాషల ఆధారంగా రూపొందిన ప్రాంతీయ అస్తిత్వాల సమాహారమేనన్న కోణం కూడా సమాఖ్య భావనకు ప్రాతిపదిక. త్రిభాషా సూత్రం భాషోన్మాదాన్ని అదుపులో ఉంచి అన్ని భాషల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం ద్వారా సమాఖ్య తత్వాన్ని ఆచరణలో పెట్టే సూత్రమే. కానీ చర్చల్లో సమాఖ్యతత్వపు ఈ పునాది గురించిన చర్చ మరుగున పడింది.

18వ శతాబ్దిలో యూరప్‌ కేంద్రంలో మొదలైన జాతీయతా ఉద్యమాలకు 19-20వ శతాబ్దాల్లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాలు కేంద్రంగా సాగిన జాతీయోద్యమాలకు మధ్య హస్తిమశకాంతరం తేడా ఉంది. దేశాన్ని ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతితో కూడిన రాజకీయ యూనిట్లుగా రూపొందించటమే యూరప్‌లో సాగిన జాతీయత ఉద్యమాల లక్ష్యం. వలస దేశాల జాతీయోద్యమాల లక్ష్యం ఇందుకు భిన్నమైనది. చారిత్రక పరిణామంలో వేర్వేరు జాతీయత లక్షణాలు కలిగిన ప్రజలు ఒకే భౌగోళిక యూనిట్లో అంతర్భాగమయ్యారు. అటువంటి విశాల వైవిధ్యభరితమైన ప్రజా సమూహాలను వలసపీడనకు వ్యతిరేకంగా కదిలించే క్రమంలో రూపొందిందే వలస దేశాల జాతీయత. భారత జాతీయత.

యూరోపియన్‌ జాతీయత సామాజిక వెలి సిద్ధాంతం ప్రాతిపదికగా ఉంటే వలస దేశాల జాతీయత సమీకృత సామాజిక నిర్మాణాల ప్రాతిపదికన నిర్మితమైంది. ఈ వ్యత్యాసాన్ని మర్చిపోయినప్పుడే ఒకే భాష, ఒకే జాతి, ఒకే దేశం అన్న నినాదం ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు బీజేపీ/ఆరెస్సెస్‌ల హిందీభాషా జాతీయత ఏదో కాకతాళీయమైనదని కొట్టిపారేస్తే తీవ్రమైన పొరపాటవుతుంది. తాజాగా ఈ నినాదాన్ని అమిత్‌షా ముందుకు తెచ్చినంత మాత్రాన అమిత్‌షా వెనక ఉన్న బీజేపీ/ఆరెస్సెస్‌ వంటి రాజ్యాంగేతర శక్తుల పాత్రను గుర్తించ నిరాకరించటం రాజకీయ ప్రత్యామ్నాయం కోరేశక్తుల పొరపాటవుతుంది.
జాతీయ భావనకు, భాషకు మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. భారత జాతీయత భావనకు రాజ్యాంగం ప్రతిపాదించినట్టు భౌగోళిక యూనిట్‌ను అంగీకరించటం ఆరెస్సెస్‌ వ్యవస్థాపక లక్ష్యాలకు, వాటి స్ఫూర్తికి భిన్నమైన వ్యవహారం. అందుకే రాజ్యాంగ ప్రమాణాలను పక్కకు నెట్టి సరికొత్త సరిహద్దులు, ప్రమాణాలు, ప్రాతిపదికల ఆధారంగా జాతీయతను నిర్థారించే ప్రయత్నం ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు చేసినా, అస్సాంలో జనాభా రిజిష్టర్‌ ఆధారంగా భారతీయేతరులను గుర్తించే ప్రయత్నం చేసినా, నేడు హిందీయేతరులు వివాదాన్ని ముందుకు తెచ్చినా లక్ష్యం ఒక్కటే. ఆరెస్సెస్‌ ప్రతిపాదిత హిందూత్వ రాజ్య నిర్మాణం. ఈ లక్ష్య సాధనలో హిందీని జాతీయ భాషగా గుర్తించటం అంటే మిగిలిన భాషలను, ఆ భాషలు మాట్లాడేవారిని జాతీయేతరులుగా గుర్తించటమే.

అందువల్లనే భారత దేశంలో జాతీయత సమస్య గురించి చర్చించేటప్పుడు సూక్ష్మ స్థాయిలోనూ, స్థూల స్థాయిలోనూ పరిశీలించాల్సి ఉంటుంది. స్థూలస్థాయిలో జాతీయత వ్యక్తమయ్యే రూపం భౌగోళిక యూనిట్‌. సూక్ష్మ స్థాయిలో జాతీయత వ్యక్తమయ్యే రూపం భాషా ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రాలు. ప్రాంతీయ అసమానతలు, భాషా ప్రాతిపదికన ఏర్పడ్డ యూనిట్ల మధ్య నిరంతరం రాజకీయ ఆర్థిక ఘర్షణ కొనసాగుతూ వచ్చింది. కొన్ని సార్లు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు ద్వారా పాలకవర్గాలు ఈ ఘర్షణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాయి. అభివృద్ధికి, అస్తిత్వానికి మధ్య ఉన్న ఘర్షణను ఈ విధంగా వాయిదా వేయటం అంటే అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చెందాలన్న మౌలిక సూత్రం ఆచరణలోకి రానీయకుండా వాయిదా వేయటమే.
రాజ్యాంగ యంత్రం ఉద్దేశ్యపూర్వకంగా గానీ, సదుద్దేశ్యంతో గానీ రూపొందించే విధానాలు, వాటి ఆచరణ అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి. ఈ భయాందోళనలు పరిష్కరించి సమాజంలో సామాజిక శాంతి సుస్థిరతలు నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. అటువంటి ప్రభుత్వాలే ఉద్దేశ్యపూర్వకంగా అల్పసంఖ్యాక వర్గాల్లో భయాందోళనలను రేకెత్తించే పనులకు పూనుకున్న ప్పుడు ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకించక తప్పదు.

తాజాగా బీజేపీ చేస్తున్న పని అలా శంకించాల్సిన అంశమే. రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా నిర్వచించబడిన భారత జాతీయత స్థానంలో రాజ్యాంగమే లేని సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ మతోన్మాద జాతీయతను ఆచరణలోకి తేవటమే ఈ ప్రయత్నం వెనకున్న ఉద్దేశ్యం. బీజేపీ/ ఆరెస్సెస్‌లు ప్రతిపాదిస్తున్న భాషా, మతపరమైన జాతీయత భారతీయ ప్రజల జాతీయత కాదు. అగ్రకులాలు, మధ్యతరగతి వర్గాల సాంస్కృతిక ఆధిపత్యాన్ని దేశంపై రుద్దే ప్రయత్నమే ఇది. ఏకీకృత రాజకీయ అస్తిత్వాన్ని రూపొందించటంలో భాష పోషించే పాత్ర, దాని ప్రాధాన్యత విమర్శకులకంటే ఆరెస్సెస్‌కే బాగా తెలుసు.

ఐక్యంగా ఉన్న ప్రజలను, లేదా కనీసం ఐక్యతా భావాలను చీల్చే పునాదులు వేయటమే ఆరెస్సెస్‌ ఆశించే మతోన్మాద జాతీయత సాధనా మార్గం. ఈ మార్గంలో ఐక్యతను పెంపొందించే లక్షణాలన్నింటినీ చిదిమేయటం, దానికి కావల్సిన నినాదాలు రూపొందించటమే లక్ష్యంగా బీజేపీ/ఆరెస్సెస్‌లు పని చేస్తున్నాయి. అటువంటి కసరత్తులో భాగంగా ముందుకు వచ్చిందే హిందీ భాష జాతీయ భాష అన్న నినాదం. చూడటానికి అత్యంత ప్రజాతంత్ర నినాదంగా కనిపించవచ్చు. దీని వెనక ఉన్న రాజకీయ సాంస్కృతిక మతోన్మాద లక్షణాన్ని గమనించకపోతే ఇటువంటి సమస్యలను అధిగమించటంలో నిజమైన ప్రజాతంత్ర ఉద్యమం పప్పులో కాలేస్తుంది.

చివరిగా హిందీ భాష జాతీయ భాషగా మార్చటం ద్వారా ఆరెస్సెస్‌ లక్ష్యమైన హిందూత్వ మతోన్మాద రాజ్య స్థాపన ఎలా సాధ్యమవుతుందో పరిశీలిద్దాం. ఏ దేశంలో జాతీయ భావన ఆయినా ఆ దేశ పరిధిలో జీవించే ప్రజల మధ్య ఏర్పడే భావాల సమాహారం ద్వారానే సాధ్యమవుతుంది. విశాలమైన భారతదేశంలో అటువంటి భావ ఐక్యత సాధించాలంటే భాష ఒక్కటే సాధనం. భారత రాజ్యాంగం ఏ ఒక్క భాషనూ జాతీయ భాషగా గుర్తించటం లేదు. గుర్తించ లేదు. జాతీయ భాష కు బదులుగా జాతీయ భాషా సూత్రానికి అవకాశమిస్తోంది. అదే త్రిభాషా సూత్రం. అంటే అన్ని రకాల ప్రాంతీయ అస్తిత్వాలకు పునాదిగా ఉన్న భాషాపరమైన అస్తిత్వానికి రాజ్యాంగం గ్యారంటీ కల్పిస్తోంది. తద్వారా ఆయా రాష్ట్రాల్లోని ప్రజల విద్యాబుద్ధులు, ఆచార వ్యవహారాలు, హావభావాలు అన్నీ ప్రాంతీయ భాషల్లోనే సాగుతున్నాయి. వీటితోపాటే వైవిధ్యభరితమైన రాజకీయ భావనలకు కూడా ఈ ప్రాంతీయ భాషలే మూలస్థంభాలుగా ఉన్నాయి.

వీటి స్థానంలో హిందీభాషను జాతీయ భాషగా నిర్ధారించటం అంటే దేశంలో హిందూత్వ మతోన్మాద ప్రచారానికి దేశవ్యాపిత ప్రాతిపదిక ఏర్పాటు చేయటమే. ఇప్పటి పార్లమెంటరీ రంగంలో ఉన్న సౌలభ్యాన్ని ఉపయోగించుకుని పార్లమెంట్‌లో పాలక పార్టీగా బీజేపీ స్థిరపడినా దాని మాతృక ఆరెస్సెస్‌ భావజాలం, ఆలోచన శైలి మాత్రం జాతీయ ప్రధాన స్రవంతిగా ఎదగలేదు. ఈ అంతరాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ముందుకు వచ్చిన నినాదమే జాతీయ భాషగా హిందీ బాష నినాదం.

ధీర

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates