కొందరికే ‘భరోసా’..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కౌలురైతులకు అన్యాయం
భూయజమాని పొలం ఎంతమంది కౌలుకు చేసినా ఒక్కరికే వర్తింపు

‘పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలో ఓ గ్రామానికి చెందిన భూ యజమానికి 40 ఎకరాల సాగు భూమి ఉంది. దీన్ని 15 మంది కౌలురైతులకు కౌలుకిచ్చాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరిలో ఒక్కరికి మాత్రమే రైతుభరోసా వర్తిస్తుంది. మిగిలిన 14 మందికి మొండిచేయ్యే’

‘జిల్లాలో మెట్ట ప్రాంతమైన గోపాలపురం మండలంలోని ఒక రైతుకు 20 ఎకరాల పొగాకు సాగు భూమి ఉంది. నాలుగు బ్యారన్ల కింద నలుగురికి కౌలుకిచ్చాడు. మరి ఒకరికే రైతుభరోసా వర్తిస్తే మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరమే’

పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం మూడు లక్షల మంది కౌలురైతులున్నారు. జిల్లాలోని సాగు భూమిలో 70 శాతం వీరే సాగుచేస్తున్నారు. ఎకరం, రెండెకరాల సొంత భూమి కలిగిన రైతులు సాధారణంగా కౌలుకిచ్చే పరిస్థితి ఉండదు. పట్టణాల్లో ఉద్యోగం చేసుకునే వారైతేనే కౌలుకిస్తారు. జిల్లాలో అత్యధికంగా ఐదెకరాల నుంచి 50 ఎకరాల భూమి ఉన్న భూయజమానులూ ఉన్నారు. ఇలాంటి వారు వ్యాపారాలు చేసుకుంటూ తమ పొలాలను కౌలుకిచ్చేస్తున్నారు. కౌలురైతులు ఎక్కువ మంది రెండు, మూడెకరాల భూమికి మించి కౌలు చేసే అవకాశం ఉండదు. అంతకు మించి చేసినా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదుగనుక పెట్టుబడి కష్టతరంగా మారుతోంది. ఎందుకంటే వ్యవసాయ ఖర్చులు రెట్టింపయ్యాయి. డిఎపి బస్తా కొనుగోలు చేయాలంటే రూ.1300 వెచ్చించాల్సిన పరిస్థితి. డీజిల్‌ ధరలు పెరగడంతో దుక్కులకు తడిసి మోపెడవుతోంది. పురుగుమందుల ధరలూ అదేపరిస్థితి. ఎకరం వరి సాగు చేయాలంటే రూ.30 వేలకుపైగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక పొగాకు సాగుకైతే మరింత ఖర్చవుతోంది. దీంతో కౌలురైతులు రెండు, మూడెకరాలు సాగు చేయాలంటేనే రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీంతో ఐదెకరాల భూయజమాని కూడా తన పొలం ఇద్దరు, ముగ్గురు కౌలురైతులకు ఇచ్చే పరిస్థితి జిల్లాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుభరోసాలో విధిస్తున్న నిబంధనలు కౌలురైతులకు ఇబ్బందిగా పరిణమించాయి. పదెకరాల సొంత భూమి ఉన్న రైతు తన పొలాన్ని ఎంతమంది కౌలురైతులకు కౌలుకిచ్చినా ఒక్కరికే రైతుభరోసా కింద ఏడాదికి అందించే రూ.12,500 వర్తించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం రైతుభరోసా అందించే రైతుల సంఖ్యను తగ్గించుకునేందుకు ఈ విధమైన ఎత్తుగడ వేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఓ భూయజమాని పొలం ఎవరెవరు కౌలుకు చేస్తున్నారో విఆర్‌ఒల వద్ద సమాచారం ఉంటుంది. పైగా ప్రభుత్వం 50 ఇళ్లకు ఒకరిని చొప్పున గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేసింది. వీరు పక్కా సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఎవరి భూమి కౌలుకు చేస్తున్నారో వీరు ఆధారాలతో సహా సేకరించగలరు. ప్రభుత్వం అటువైపు ఆలోచించకుండా కౌలురైతులకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

(Courtesy Prajashakti)

 

RELATED ARTICLES

Latest Updates